Virat Kohli: బ్యాడ్‌న్యూస్.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకూ విరాట్ కోహ్లి దూరం.. ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు-virat kohli set to miss third and fourth tests against england kl rahul and jadeja may return cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: బ్యాడ్‌న్యూస్.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకూ విరాట్ కోహ్లి దూరం.. ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు

Virat Kohli: బ్యాడ్‌న్యూస్.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకూ విరాట్ కోహ్లి దూరం.. ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు

Hari Prasad S HT Telugu
Feb 07, 2024 09:10 PM IST

Virat Kohli: ఇంగ్లండ్ తో జరగబోయే మూడు, నాలుగు టెస్టులకు కూడా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. ఐదో టెస్టుకు కూడా అనుమానమే అని ఈఎస్పీఎన్ క్రికిన్ఫో రిపోర్ట్ వెల్లడించింది.

ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకూ విరాట్ కోహ్లి దూరం
ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకూ విరాట్ కోహ్లి దూరం (PTI)

Virat Kohli: ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండనున్నట్లు చెప్పిన విరాట్ కోహ్లి.. ఇప్పుడు మూడు, నాలుగో టెస్టులకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రికిన్ఫో పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది.

ఈ మూడు, నాలుగు టెస్టులు రాజ్‌కోట్, రాంచీలలో జరగనున్నాయి. ధర్మశాలలో జరగాల్సిన చివరిదైన ఐదో టెస్టుకు కూడా కోహ్లి అందుబాటులో ఉండటం అనుమానమే అని సదరు రిపోర్టు వెల్లడించింది.

విరాట్ కోహ్లికి ఏమైంది?

ఇంగ్లండ్ తో ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. తొలి టెస్టులో ఓడిన టీమ్.. రెండో టెస్టులో గెలిచి 1-1తో సిరీస్ ను సమం చేసింది. ఇక తర్వాతి టెస్టులకు విరాట్ కోహ్లి తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ తప్పేలా లేదు. రాజ్‌కోట్, రాంచీ టెస్టులకు కూడా విరాట్ దూరమైనట్లే అని ఈఎస్పీఎన్ క్రికిన్ఫో రిపోర్ట్ స్పష్టం చేసింది.

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టు కోసం జనవరి 22న మిగిలిన టీమ్ తో కలిసి కోహ్లి నగరానికి వచ్చాడు. అయితే అదే రోజు సాయంత్రం తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడు వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ అనౌన్స్ చేసింది. అయితే ఆ వ్యక్తిగత కారణాలు ఏంటన్నది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. అసలు కోహ్లి ఎక్కడ అన్నదానిపైనా స్పష్టత లేదు.

రాహుల్, జడేజా వస్తారా?

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో రాణించిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్ లో ఉన్నారు. అయితే వీళ్లు మూడో టెస్టుకు తిరిగి రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వీళ్లు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా.. వీళ్ల విషయంలో ఎన్సీఏ ఫిజియోలు సానుకూలంగానే ఉన్నారు.

అక్కడి ఫిజియో క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే వీళ్లను మూడో టెస్టు కోసం పరిశీలించనున్నారు. రాజ్‌కోట్ లో జరగాల్సిన మూడో టెస్ట్ ఫిబ్రవరి 15న ప్రారంభం కానుంది. మరో వారం సమయం ఉండటంతో రాహుల్, జడేజా రావచ్చని భావిస్తున్నారు. విరాట్ కోహ్లి దూరం కానున్నాడన్న వార్తే కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ కోహ్లి లేకపోతే రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు.

సిరాజ్‌కు గ్రీన్ సిగ్నల్

ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టుకు పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ను పక్కన పెట్టారు. అతనిపై పని భారం ఎక్కువ అవుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడతడు మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు.

రెండో టెస్టుకు అతని స్థానంలో వచ్చిన ముకేశ్ కుమార్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు తుది జట్టులో ఇద్దరు పేసర్లను తీసుకుంటారా? లేక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point