NCA | నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి ఎంపిక కావడం ఎలా?-how to get selected to national cricket academy often called as nca ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Nca | నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి ఎంపిక కావడం ఎలా?

NCA | నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి ఎంపిక కావడం ఎలా?

Hari Prasad S HT Telugu
Jan 24, 2022 05:34 PM IST

NCA.. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ అత్యున్నత స్థాయి ప్రమాణాలు, శిక్షణతో నేషనల్‌ టీమ్‌కు ప్లేయర్స్‌ను అందిస్తుంది. మన తెలుగు వాడు, వెరీ వెరీ స్పెషల్‌ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ మధ్యే ఈ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

<p>స్కూలు స్థాయి నుంచి శ్రమిస్తేనే నేషనల్ క్రికెట్ అకాడమీలోకి వెళ్లేది</p>
<p>స్కూలు స్థాయి నుంచి శ్రమిస్తేనే నేషనల్ క్రికెట్ అకాడమీలోకి వెళ్లేది</p>

నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(NCA).. దేశంలోనే అత్యుత్తమ అకాడమీ. క్రికెట్‌ను మతంగా భావించే ఈ దేశంలో ఆ గేమ్‌ను కెరీర్‌గా తీసుకోవాలని ఆరాటపడే వాళ్ల సంఖ్య భారీగానే ఉంటుంది. దీనికోసం చిన్న వయసులోనే తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను క్రికెట్‌ అకాడమీల్లో చేరుస్తున్నారు. అర్బన్‌ ఏరియాల్లో అయితే గల్లీకో క్రికెట్‌ అకాడమీ పుట్టుకొస్తోంది. అయితే నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ సంగతి వేరు. అత్యున్నత స్థాయి ప్రమాణాలు, శిక్షణతో నేషనల్‌ టీమ్‌కు ప్లేయర్స్‌ను అందించే అకాడమీ ఇది. 

మన తెలుగు వాడు, వెరీ వెరీ స్పెషల్‌ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ మధ్యే ఈ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమ క్రికెట్‌ అకాడమీ అంటేనే ఇందులోకి ఎంపిక కావడం ఎంత కష్టమో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ అకాడమీ ఏంటి? ఇక్కడి నుంచి వచ్చిన స్టార్‌ క్రికెటర్లు ఎవరు? ఇందులోకి ఎంపిక కావాలంటే ఏం చేయాలి అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఎక్కడుందీ NCA?

నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉంది. 2000వ సంవత్సరంలో బీసీసీఐ దీనిని స్థాపించింది. బోర్డు మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్‌ దుంగార్పూర్‌ దీని వ్యవస్థాపకులు. సచిన్‌ టెండూల్కర్‌, ధోనీ, విరాట్‌ కోహ్లి.. ఇలా వీళ్ల స్థాయిలో నేషనల్‌ క్రికెట్‌ టీమ్‌కు సేవలందించాలనుకుంటున్న వారికి ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీని ప్రారంభించారు. దేశంలో ఎన్నో సంస్థలు, స్కూళ్లు ప్రాథమిక స్థాయిలో క్రికెట్‌ శిక్షణ ఇస్తున్నాయి. అయితే ఎన్సీఏ మాత్రం అలా శిక్షణ పొంది వచ్చిన యువ క్రికెటర్లను ప్రొఫెషనల్‌ క్రికెటర్లుగా మారుస్తోంది.

అత్యాధునిక వసతులతో NCA

దేశంలో క్రికెట్‌ను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ అకాడమీ పని చేస్తోంది. గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌, రవిశాస్త్రి, అనిల్‌కుంబ్లే వంటి స్టార్‌ ప్లేయర్స్‌ ఈ అకాడమీలోని యువ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చారు. ఓ క్రికెటర్‌కు అవసరమైన అన్ని అత్యాధునిక వసతులు ఇక్కడ ఉన్నాయి. అంతెందుకు నేషనల్‌ టీమ్‌కు ఆడే ప్లేయర్స్‌ కూడా గాయపడి టీమ్‌కు దూరమైన సందర్భంలో మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించడానికి ఈ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలోనే సాధన చేస్తారు. 

నేషనల్‌ మెన్స్‌ టీమ్‌, ఇండియా ఎ, అండర్‌ 19 టీమ్స్‌ వంటి అన్ని జట్ల క్యాంప్‌లు ఇక్కడ జరుగుతాయి. ప్లేయర్స్‌ ఉండటానికి కూడా ఇక్కడ వసతులు ఉన్నాయి. అంతేకాదు 2014లో బీసీసీఐ ఇక్కడి క్రికెటర్లకు ఓ కొత్త విధానంలో శిక్షణ ఇవ్వడానికి వీలుగా క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక బోర్డర్‌-గవాస్కర్‌ స్కాలర్‌షిప్‌ పేరుతో ముగ్గురు ఎంపిక చేసిన క్రికెటర్లను ఆస్ట్రేలియా పంపించి.. అక్కడ అత్యాధునిక శిక్షణ కూడా ఇప్పిస్తోంది.

ద్రవిడ్‌ చేతుల్లోకి వెళ్లాక..

టీమిండియా మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నేషనల్‌ టీమ్‌కు హెడ్‌ కోచ్‌ అవకముందు ఈ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో ఈ ఎన్సీఏ మరింత మెరుగైంది. నేషనల్‌ టీమ్‌కు నాణ్యమైన క్రికెటర్లను అందించే ఫ్యాక్టరీగా ఎన్సీఏను ద్రవిడ్‌ మార్చేశాడు. అటు అండర్‌ 19 టీమ్‌ కోచ్‌గా వరల్డ్‌కప్‌ కూడా సాధించిపెట్టాడు. అతడు టీమిండియా కోచ్‌గా వెళ్లిన తర్వాత మరో స్టార్‌ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ చేతుల్లోకి ఈ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ వెళ్లింది.

NCAలోకి ఎలా సెలక్ట్‌ కావాలి?

నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలోకి ఎంపిక కావడం అంత సులువు కాదు. దీనికోసం స్కూలు స్థాయి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ముందుగా మీ స్కూల్‌ టీమ్‌కు ఎంపిక కావాలి లేదా అకాడమీ స్థాయిలో ఆడాలి. ఆ తర్వాత జిల్లా స్థాయి అండర్‌-15, 17, 19, 23 క్యాంప్‌లకు వెళ్లాలి. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి టీమ్‌కు ఎంపిక కావాలి. రాష్ట్ర స్థాయి క్యాంప్‌లకు హాజరు కావాలి. మీ కేటగిరీలో జాతీయ స్థాయిలో టాప్‌ 15లో ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత జోనల్‌ స్థాయి క్రికెట్‌ ఆడాలి. అప్పుడే మీకు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ నుంచి పిలుపు వస్తుంది. కేవలం ప్రదర్శన ఆధారంగానే ఎన్సీఏలోకి ఎంపిక జరుగుతుంది. అది కూడా జూనియర్‌, సీనియర్‌ స్థాయిలలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలోని జూనియర్‌ సెలక్టర్లు జోనల్‌ అకాడమీకి ఎంపిక చేస్తేనే నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో సీటు దొరుకుతుంది.

సంబంధిత కథనం