IND vs ENG Test Series: ‘రూట్ నువ్వు అది మర్చిపో’: ఇంగ్లండ్ సీనియర్‌కు మాజీ కెప్టెన్ సలహా
IND vs ENG Test Series: భారత్‍తో తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ విఫలమయ్యాడు. అంచనాలను తలకిందులు చూస్తూ విఫలమయ్యాడు. దీంతో అతడికి ఓ సలహా ఇచ్చాడు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.
IND vs ENG Test Series: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‍కు విరామం వచ్చింది. తొలి రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరొకటి గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో ఉంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15వ తేదీన రాజ్‍కోట్‍లో మొదలుకానుంది. ఈ సిరీస్‍లో హైదరాబాద్‍లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలిస్తే.. విశాఖపట్నం మ్యాచ్‍లో భారత్ విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ, బుమ్రా 9 వికెట్ల అద్భుత బౌలింగ్‍తో విశాఖలో టీమిండియా విజయం సాధించింది.
భారత్‍తో తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ స్టార్ సీనియర్ బ్యాటర్ జో రూట్ విఫలమయ్యాడు. ఇండియా గడ్డపై సత్తాచాటుతాడని ఇంగ్లండ్ అతడిపై గంపెడు ఆశలు పెట్టుకోగా.. అంచనాలను అందుకోలేకపోయాడు. రెండు టెస్టుల్లో 29, 2, 5, 16 పరుగులతో వరుసగా విఫలమయ్యాడు. ఫామ్ కోల్పోయాడు. ఈ తరుణంలో రూట్ బ్యాటింగ్‍పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
బజ్‍బాల్ (దూకుడుగా ఆడడం) విధానాన్ని జో రూట్ మర్చిపోవాలని, తన సహజసిద్ధమైన ఆట ఆడాలని మైకేల్ వాన్ సూచించాడు. ఇతర ఆటగాళ్లకు అది సూటవుతుందని, కానీ ఇప్పటికే టెస్టుల్లో 10వేలకు పైగా రన్స్ చేసిన రూట్‍కు బజ్‍బాల్ పద్ధతి అవసరం లేదని యూకే టెలిగ్రాఫ్‍కు రాసిన కాలమ్‍లో వాన్ పేర్కొన్నాడు.
“వాళ్లు (యువ ప్లేయర్లు) అలా (బజ్‍బాల్) ఆడుతుంటే నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే వారికి అది సూటవుతుంది. కానీ జో రూట్ దాన్ని మర్చిపోవాలి. అతడికి 10వేలకు పైగా రన్స్ ఉన్నాయి. అతడు జో రూట్‍లాగే ఆడాలి. అతడు బజ్‍బాలర్‌గా ఉండాల్సిన అవసరం లేదు” అని వాన్ తెలిపాడు.
మేనేజ్‍మెంట్ చెప్పాలి
తన ఆట తాను ఆడాలని జో రూట్‍కు ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‍మెంట్ చెప్పాలని వాన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ చరిత్రలో గ్రహమ్ గూచ్ తర్వాత.. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది స్పిన్‍గా ఉన్న రూట్.. తన వికెట్‍ను రెండో టెస్టులో చేజార్చున్న తీరు పట్ల వాన్ అసంతృప్తి చెందాడు.
“ఇంగ్లండ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వాళ్లలో గ్రాహమ్ గూచ్‍లా స్పిన్‍ను అత్యత్తమంగా ఆడే బెస్ట్ ప్లేయర్ జో రూట్. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రూట్ ఆడడం చూస్తుంటే అతడు కాదేమో అనిపించింది. ఇలా వికెట్లను ఇచ్చేస్తే భారత్‍పై ఇంగ్లండ్ గెలవడం కష్టమవుతుంది” అని వాన్ రాసుకొచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‍లో దూకుడుగా ఆడే క్రమంలో రూట్ ఔటయ్యాడు.
రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ ద్విశకతంతో సత్తాచాటితే.. టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్‍ను కుప్పకూల్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‍మన్ గిల్ సెంచరీ చేయడంతో ఇంగ్లండ్‍కు 399 పరుగుల టార్గెట్ ఇచ్చింది భారత్. అయితే, 292 పరుగులకే ఇంగ్లిష్ జట్టు ఆలౌటై ఓటమి పాలైంది. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఇరు జట్లు మధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15న షురూ కానుంది.