IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‍ను కుప్పకూల్చిన బుమ్రా.. భారత్‍కు భారీ ఆధిక్యం-ind vs eng 2nd test jasprit bumrah takes 6 wickets as england all out for 253 runs team india gets 143 lead ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 2nd Test: ఇంగ్లండ్‍ను కుప్పకూల్చిన బుమ్రా.. భారత్‍కు భారీ ఆధిక్యం

IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‍ను కుప్పకూల్చిన బుమ్రా.. భారత్‍కు భారీ ఆధిక్యం

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 03, 2024 05:04 PM IST

IND vs ENG 2nd Test - Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో విజృంభించటంతో ఇంగ్లండ్ విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. దీంతో భారత్‍కు మంచి ఆధిక్యం లభించింది.

IND vs ENG 2nd Test: ఓలీ పోప్‍ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసిన దృశ్యమిది
IND vs ENG 2nd Test: ఓలీ పోప్‍ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసిన దృశ్యమిది (REUTERS)

IND vs ENG 2nd Test - Jasprit Bumrah: ఇంగ్లండ్‍తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పైచేయి సాధించింది. భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీ తర్వాత.. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‍ను టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా (6/45) గడగడలాడించాడు. ఆరు వికెట్లతో సత్తాచాటాడు. దీంతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజైన నేడు (ఫిబ్రవరి 3) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ జాక్ క్రాలీ (76), కెప్టెన్ బెన్ స్టోక్స్ (47) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. 55.5 ఓవర్లలోనే ఇంగ్లిష్ జట్టును భారత బౌలర్లు కూల్చేశారు. దీంతో భారత్‍కు తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.

6 వికెట్లకు 336 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు రెండో రోజు ఆటకు బరిలోకి దిగిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (290 బంతుల్లో 209 పరుగులు) తన కెరీర్లో తొలి అంతర్జాతీయ డబుల్ సెంచరీని సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‍ను నేడే 253 పరుగులకు ఆలౌట్ చేసింది భారత్. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు కుల్‍దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసుకున్నారు.

బుమ్రా పేస్ మ్యాజిక్

ఫ్లాట్‍గా ఉన్న పిచ్‍పై కూడా భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా తన పేస్‍తో మ్యాజిక్ చేశాడు. ఆరు వికెట్లను దక్కించుకొని అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ దూకుడుగానే మొదలుపెట్టింది. ధాటిగా ఆడిన ఇంగ్లిష్ ఓపెనర్ బెన్ డకెట్ (21)ను భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ ఔట్ చేశాడు. టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. అనంతరం హాఫ్ సెంచరీతో జోరు చూపిన జాక్ క్రాలీని అక్షర్ పటేల్ పెవిలియన్‍కు పంపాడు. ఆ తర్వాత బుమ్రా తన వేట మొదలుపెట్టాడు. ఇంగ్లిష్ బ్యాటర్ ఓలీ పోప్ (23)ను సూపర్ యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ జో రూట్ (5), జానీ బెయిర్ స్టో (25)ను జస్‍ప్రీత్ ఔట్ చేశాడు.

ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూకుడుగా ఆడాడు. ఫోక్స్ (6), రెహాన్ అహ్మద్ (6)ను ఔట్ చేసి ఇంగ్లండ్‍ను దెబ్బ కొట్టాడు కుల్‍దీప్. ఆ తర్వాత బుమ్రా మరో స్పెల్‍లో దుమ్మురేపాడు. స్టోక్స్, టామ్ హార్ట్లీ (21), జేమ్స్ ఆండర్సన్ (6)ను వెనువెంటనే ఔట్ చేసి.. ఇంగ్లండ్‍ను కుప్పకూల్చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగియక ముందే ఇంగ్లిష్ జట్టు చాపచుట్టేసింది.

రెండో ఇన్నింగ్స్..

రెండో ఇన్నింగ్స్‌కు కూడా చివరి సెషన్‍లో బరిలోకి దిగింది భారత్. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది టీమిండియా. దీంతో ఆధిక్యం 171 పరుగులకు చేరింది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (15 నాటౌట్), కెప్టెన్ రోహిత్ శర్మ (13) క్రీజులో ఉన్నారు. రేపు మూడో రోజు ఆట కొనసాగించనున్నారు.

Whats_app_banner