Jadeja wife Rivaba wins: రవీంద్ర జడేజా భార్య ఘన విజయం.. భారీ మెజార్టీ
Jadeja wife Rivaba wins: రవీంద్ర జడేజా భార్య ఘన విజయం సాధించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన రివాబా జడేజా భారీ మెజార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై గెలిచారు.
Jadeja wife Rivaba wins: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అక్కడి అధికార బీజేపీ నుంచి పోటీ చేసిన ఆమె ఏకంగా 57 శాతం ఓట్లు కొల్లగొట్టడం విశేషం. 50 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా.. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కర్షన్‌భాయ్ కర్మూర్‌పై రివాబా గెలిచారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చతుర్‌సింగ్ జడేజా 15.5 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన హరి సింగ్ సోలంకి బంధువు అయిన రివాబా జడేజా 2019లో బీజేపీలో చేరారు. నిజానికి జడేజా ఫ్యామిలీ చాలా రోజులుగా కాంగ్రెస్ మద్దతుదారే. అలాంటి కుటుంబానికి కోడలిగా వచ్చినా.. రివాబా మాత్రం బీజేపీలో చేరడం గమనార్హం.
ఈ ఎన్నికల సందర్భంగా కూడా రివాబా మామ, ఆమె వదిన కూడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. రివాబా వదిన నయనబా జడేజా కాంగ్రెస్ నేత. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఆమె ప్రచారం నిర్వహించారు. రివాబా బీజేపీ అయినా కూడా ఆమెపై, తన తమ్ముడిపై ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుందని, నిజానికి జామ్ నగర్‌లో జడేజా కుటుంబాల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని నయనబా చెప్పారు.
గుజరాత్‌లో వరుసగా ఏడోసారీ బీజేపీయే అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి అన్ని రికార్డులనూ చెరిపేస్తూ బంపర్ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 156 స్థానాల్లో గెలిచి కొత్త రికార్డు సృష్టించింది. ఇన్నాళ్లూ 1985లో కాంగ్రెస్ సాధించిన 149 సీట్లే రికార్డుగా ఉండేది.
తన విజయం తర్వాత రివాబా జడేజా మీడియాతో మాట్లాడారు. "నన్ను అభ్యర్థిగా అంగీకరించిన వాళ్లకు, నా కోసం పని చేసిన వాళ్లు అందరికీ కృతజ్ఞతలు. ఇది కేవలం నా విజయం కాదు మనందరి విజయం" అని రివాబా అన్నారు. 1990, సెప్టెంబర్ 5న జన్మించిన రివాబా.. మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆమె 2016, ఏప్రిల్ 17న క్రికెటర్ రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకున్నారు. బీజేపీలో చేరిన మూడేళ్లలోనే ఎమ్మెల్యే టికెట్ సంపాదించి ఘన విజయం సాధించడం విశేషం.