Vijayawada Floods : విజయవాడను చుట్టుముట్టిన వరద - ప్రధానమైన 10 ముఖ్యాంశాలు
Vijayawada Floods : భారీ వర్షాలకు విజయవాడ అస్తవ్యస్తం అయ్యింది. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. బుడమేరు పొంగడంతో పలు కాలనీలు నీట మునిగాయి.
Vijayawada Floods : గత రెండు రోజులు కురుస్తోన్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం అయ్యింది. నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నిన్న ఒక్క రోజే 29 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 30 ఏళ్ల రికార్డు బద్దలైంది. భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కాలనీలు, ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. విజయవాడను వరద నీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగుతోంది. దీంతో బడమేరు 11 గేట్లు ఎత్తివేశారు. కవులూరు వద్ద బుడమేరు కట్ట తెగి వరదనీరు కాలనీల్లోకి ప్రవేశిస్తుంది.
రికార్డు స్థాయిలో వర్షాలు
విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో 30 ఏళ్ల రికార్డు బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒకేరోజు(శనివారం) 29 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుంచి విజయవాడలో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం కూడా బెజవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెజవాడ గజగజ వణికిపోతోంది.
ముంపులో కాలనీలు
విజయవాడ, గుంటూరు నగరాల్లో అనేక కాలనీలు వరద నీటిలో నానుతున్నాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. నగర శివార్లలోని కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది నివాసాలు నీటమునిగాయి. రైల్వే ట్రాక్ అండర్ పాస్ వద్ద 4 బస్సులు నీట మునగగా క్రేన్ల సాయంతో అధికారులు...బస్సులను బయటకు తీశారు. మైలవరంలో వెలగలేరు గేట్లు ఎత్తివేశారు. దీంతో చుట్టుపక్కల కాలనీల్లోకి వరద నీరు చేరింది. రాజ రాజేశ్వరిపేట వరద నీటిలో చిక్కుకుంది.
బుడమేరు ఉగ్రరూపం
సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపునకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది.
విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది. 2005లో చివరి సారి బుడమేరు బెజవాడ పుట్టిముంచింది. 2005 సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.
తాజాగా బుడమేరు పొంగడంతో సింగ్‌నగర్, చిట్టీనగర్, ఇతర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో మంత్రులంతా వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అధికార యంత్రాంగం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. నీట మునిగిన కాలనీల్లో జనాన్ని కలిసి ఇబ్బందులను పరిష్కరిస్తున్నారు. వరదలో భయపడొద్దని, అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ
కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 7,69,443 క్యూసెక్కులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాగులు, వంకలు పొంగిపోర్లుతాయని, ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రాజధాని ప్రాంతం
అమరావతి ప్రాంతంలో వరద నీరు చేసింది. చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కరకట్ట సమీపంలోకి వరదనీరు చేరుతోంది. హైకోర్టు మార్గంలో వరద నీరు చేరింది.
నగరంలో రోడ్లు జలమయం
విజయవాడలో గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వరద నీటిలో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ విలవిల్లాడింది. పాతబస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్ లో భారీ వరద పోటెత్తింది. విజయవాడ సమీపంలోని జాతీయ రహదారుల నీటిలో చిక్కుకుపోయాయి.
మొగల్రాజపురం ప్రమాదం
విజయవాడలోని మొగల్రాజపురం వద్ద శనివారం కొండచరియల విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు. పడిపోయిన కొండరాళ్లను డ్రిల్లింగ్ చేసి, భారీ క్రేన్లతో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొగల్రాజపురం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు
విజయవాడలో భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రొటోకాల్ ఆఫీస్, డోనర్ సెల్ ధ్వంసం అయ్యాయి. ఈ ప్రదేశంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి ఘాట్‌రోడ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఘాట్‌రోడ్‌ను మూసివేశారు.
రాయనపాడు ఘటన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో నగర ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆరో బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ రెస్కూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టింది. రాయనపాడులో నిలిచిపోయిన తమిళనాడు ఎక్స్ ప్రెస్ లోని ప్రయాణికులను రక్షించి, విజయవాడ స్టేషన్ కు తరలించారు. ప్రయాణికులను ప్రత్యేక రైలులో తమిళనాడుకు తరలిస్తున్నారు.
పలు రైళ్లు రద్దు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. శనివారం 20 రైళ్లు రద్దు చేయగా...తాజాగా మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భారీ వర్షాలకు పట్టాలపై వరదనీరు చేరడంతో 15 రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది.
సంబంధిత కథనం