Chevireddy Mohith Reddy Arrest : పోలీసుల అదుపులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి!-tirupati chevireddy mohit reddy arrested in bangalore on pulivarthi nani attack case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chevireddy Mohith Reddy Arrest : పోలీసుల అదుపులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి!

Chevireddy Mohith Reddy Arrest : పోలీసుల అదుపులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి!

Bandaru Satyaprasad HT Telugu
Jul 28, 2024 08:33 AM IST

Chevireddy Mohith Reddy Arrest : అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేసిన కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్
వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్

Chevireddy Mohith Reddy Arrest : వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సమయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని కారుపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి మోహిత్ రెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన మోహిత్ రెడ్డి ఓడిపోయారు. అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి మోహిత్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు.

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఎన్నికల సమయంలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... 37వ నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు...మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు. పులివర్తి నానిపై దాడి తర్వాత మోహిత్ రెడ్డి పరారీలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే తిరుపతి పోలీసులు ఎట్టకేలకు మోహిత్ రెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగింది?

ఏపీ అసెంబ్లీ పోలింగ్ మరుసటి రోజు మే 14న తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేత పులివర్తి నానిపై అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులైన భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డి, పలువురితో కలిసి దాడి చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ సమీపంలో రాడ్లు, బీరు సీసాలతో పులివర్తి నాని కార్లపై దాడి చేశారు. ఈ ఘటనలో పులివర్తి నాని వ్యక్తిగత సహాయకుడు గాల్లోకి కాల్పులు సైతం జరిపారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అవ్వడంతో ఈసీ, అప్పటి సీఎస్, డీజీపీలను దిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తనపై హత్యాయత్నం చేశారని పులివర్తి నాని ఫిర్యాదు చేయడంతో... పోలీసులు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో...ఈ కేసులో అసలు కుట్రదారులు ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి 37వ నిందితుడిగా చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు. శనివారం తిరుపతి పోలీసులు మోహిత్‌రెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం