Siddipet Student : ఐఐటీ తిరుపతిలో సీటు సాధించిన గురుకుల విద్యార్థి, అండగా నిలిచిన సిద్దిపేట కలెక్టర్-siddipet gurukul students got iit tirupati seat collector financial help to student ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Student : ఐఐటీ తిరుపతిలో సీటు సాధించిన గురుకుల విద్యార్థి, అండగా నిలిచిన సిద్దిపేట కలెక్టర్

Siddipet Student : ఐఐటీ తిరుపతిలో సీటు సాధించిన గురుకుల విద్యార్థి, అండగా నిలిచిన సిద్దిపేట కలెక్టర్

HT Telugu Desk HT Telugu
Jul 27, 2024 05:53 PM IST

Siddipet Student : సిద్ధిపేట జిల్లా గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఐఐటీ-తిరుపతిలో సీటు సాధించాడు. అయితే ఐఐటీలో చేరేందుకు పేదరికం అడ్డురావడంతో...జిల్లా కలెక్టర్ ఆ విద్యార్థికి అండగా నిలించారు. విద్యార్థికి సెమిస్టర్ ఫీజు చెల్లించారు.

ఐఐటీ తిరుపతిలో సీటు సాధించిన గురుకుల విద్యార్థి, అండగా నిలిచిన కలెక్టర్
ఐఐటీ తిరుపతిలో సీటు సాధించిన గురుకుల విద్యార్థి, అండగా నిలిచిన కలెక్టర్

Siddipet Student : ఐఐటీ- తిరుపతిలో సీటు సాధించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్న యువకుని కష్టాలను తెలుసుకొన్న సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఆ యువకున్ని అన్నివిధాలా ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బి. ఆర్యన్ రోషన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల - కోహెడలో చదివి పదో తరగతిలో 10/10 జీపీఏని సాధించారు. అక్కడే ఇంటర్మీడియట్ ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు పొందటంతో పాటు, ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ఐఐటీ తిరుపతిలో కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ లో సీటు సాధించాడు. అయితే అతనికి ఐఐటీలో చేరేందుకు పేదరికం అడ్డురావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ విద్యార్థి చదువును ఎటువంటి అడ్డంకులు లేకుండా కొనసాగించడానికి తోడ్పాటునందించారు.

లాప్ టాప్ బహుకరించిన కలెక్టర్

శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో రూ.40,500 విలువ చేసె ఎచ్పీ లాప్ టాప్ తో పాటు ఐఐటీ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు రూ.36,750 చెక్కు రూపేనా జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగవాల్ తో కలిసి ఆర్యన్ రోషన్ కి అందించారు.

ఆర్యన్ రోషన్ అందరికీ ఆదర్శం

బి.ఆర్యన్ రోషన్ తండ్రి... తన చిన్నతనంలోనే మరణించినా తల్లి రాజమణి రోజు కూలి చేసి తనను చదివించిందని, పట్టుదలతో చదివి ఐఐటిలో సీటు పొందినందుకు అభినందనలు తెలుపుతూ.. ఇలాగే ఐఐటీ పూర్తి చేసుకోని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షిచారు. చదువుకోవాలనే ఆసక్తిగల నీలాంటి నిరుపేదలకు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకంగా నిలవాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మకమైన విద్యను అందించాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో అభ్యాసన సామర్ధ్యాల పెంపుపై కలెక్టర్ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ నోడల్ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యను అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, ఇతర కార్యక్రమాల ద్వారా కల్పిస్తుందన్నారు. ఈ సదుపాయాలను సద్వినియోగం చేస్తూ విద్యార్థులలో గుణాత్మకమైన అభ్యాసన శక్తిని పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది, విద్యాశాఖ అధికారులదని అన్నారు. విద్యార్థుల అభ్యాసన సమస్యల ప్రకారం ఏ, బి, సి గ్రూపులుగా వర్గీకరించి తక్కువ అభ్యాసన సామర్ధ్యం గల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఏయే సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గుర్తించి ఆయా సబ్జెక్టుల్లో అర్థమయ్యేలా ప్రత్యేక బోధన చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి కేస్ షీట్ రూపొందించి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించాలని అన్నారు. మార్కుల లక్ష్యంగా కాకుండా విజ్ఞానం లక్ష్యంగా బోధన చేస్తే ఆటోమెటిగ్ గా పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన ప్రదర్శిస్తారని అన్నారు.

పాఠశాలలో ఆటలు తప్పనిసరి

ప్రతి పాఠశాలలో విద్యార్థులతో గేమ్స్ కమిటీ, డిబేట్స్ కమిటీ, కల్చరల్ కమిటీ, డ్రాయింగ్ కమిటీ తదితర కమిటీలను ఏర్పాటు చేసి ఆయా కమిటీలలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలని అలా చేసే విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగుంటదని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం అన్ని స్కూళ్ల లైబ్రరీలకు అనేక విజ్ఞాన పుస్తకాలను పంపించిందని వాటిని విద్యార్థులు ఉపయోగించుకునేలా చూడాలని అన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చూడాలని, అన్ని పాఠశాలలో టెస్ట్ బుక్స్ పంపిణీ చేసి వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని, మధ్యాహ్న భోజనం వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు. ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది రిజిస్టర్ ను పక్కాగా అమలు చేయాలని అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ని ఆదర్శంగా తీసుకొని అడ్మిషన్ కోసం పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం