Minister Lokesh On Talliki Vandanam : తల్లికి వందనం పథకంపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ కీలక ప్రకటన చేశారు. శాసనమండలిలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.... తల్లికి వందనం పథకం...ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అంత మందికీ ఇస్తామన్నారు. ఎన్నికల్లో ఇది మా హామీ.. హామీ ప్రకారమే ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తామన్నారు. తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా కోతలు లేకుండా రూ.15 వేలు అందిస్తామన్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 72 వేల మంది విద్యార్థులు తగ్గారన్నారు. ఇతర రాష్ట్రాల్లోని విద్యా విధానాలపై అధ్యయనం చేసి, మంచి విధానాలను ఏపీలో అమలు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామన్నారు.
“తల్లికి వందనం పథకం ఇంట్లో ఉన్న అందరి పిల్లలకు ఇస్తాం. గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంత సమయం కావాలి. మంత్రులందరితో చర్చి్స్తున్నాం. గతంలో జరిగిన విధంగా లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. గత ప్రభుత్వంలో రూ.15 వేలు ఇస్తామని చెప్పి, రూ.14 వేలు, ఆ తర్వాత రూ.13 వేలు చేశారు. అదే విధంగా అర్హతలపై కూడా గందరగోళం ఉంది. ఆదాయం, విద్యుత్ బిల్లు, భూమి విషయం లెక్కలోకి తీసుకుని గైడ్ లైన్స్ రూపొందించారు. వాటన్నింటిని పరిశీలించాల్సి ఉంది. నా పాదయాత్రలో కూడా నేను స్వయంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఉపాధి కోసం అప్పు చేసి ఫోర్ వీలర్ తీసుకుంటే...మా తెల్ల రేషన్ కార్డు తీసేశారు. పథకాలు ఆపేశారని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కూడా చర్చించాల్సి ఉంది. ఇంట్లో అర్హులు ఎంత మంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తాం. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుంది” - మంత్రి లోకేశ్
"2019-2024 మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా 72 వేల మంది విద్యార్థులు తగ్గారు. నాడు-నేడు కార్యక్రమంలో వేల కోట్లు ఖర్చు చేశారు. అయినా ఎందుకు విద్యార్థులు తగ్గారనేది తెలియాల్సి ఉంది. గత ప్రభుత్వం సీబీఎస్ఈ తెచ్చింది. విద్యాశాఖలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరితో చర్చించి తీసుకోవాలి. ఒక రోడ్ మ్యాప్ వేసి వచ్చే విద్యాసంవత్సరం సంస్కరణలు చేపడతాం. అన్ని సంఘాలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలో ఎన్ రోల్మెంట్ తగ్గుంది. ఇది వాస్తవం. ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీలన్నింటినీ భర్తి చేస్తాం. దాదాపు 11 వేల పాఠశాలల్లో 10 కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది. ఎన్ రోల్మెంట్ ఎలా పెంచాలని ఆలోచన చేస్తున్నాం." - మంత్రి లోకేశ్
ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందిస్తామని హామీ ఇచ్చాయి.
సంబంధిత కథనం