Karimnagar: మంచు లక్ష్మీ మంచి పని, ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు సహకారం
Karimnagar: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరిగేలా కరీంనగర్ లోని కోతిరాంపూర్ (పోచంపల్లి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటైంది.
Karimnagar: సినీ నటి మంచు లక్ష్మీ మంచి పనిచేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల కోసం కంప్యూటర్లను అందించారు. తన కుమార్తె మాదిరే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు కూడా కంప్యూటర్ విద్యను అందించాలనే ఉద్దేశంతో జిల్లాలో 20 పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. పేదింటి పిల్లలకు కంప్యూటర్ విద్యను అందించేందుకు తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్ని ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరిగేలా కరీంనగర్ లోని కోతిరాంపూర్ (పోచంపల్లి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్మార్ట్ క్లాస్ రూమ్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపక చైర్ పర్సన్, మేనేజింగ్ ట్రస్ట్రీ సినీనటి మంచు లక్ష్మి ప్రారంభించారు.
నా కూతురు చదువుకునే పాఠశాలలో ఏవిదంగా పాఠాలు చెబుతారో స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా పేద విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరగాలనే ఉద్దేశంతో చేయూత అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు మీ వెంటే మేముంటానని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు చేయూత అందించాలని ఉద్దేశంతోనే కరీంనగర్ జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకున్నామని తెలిపారు.
కలెక్టర్ స్పూర్తితో…
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవ వల్లనే కరీంనగర్ జిల్లాలో 20 పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్ కు ఎంపిక చేసుకున్నామని మంచు లక్ష్మి తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతిని అనునిత్యం ఫాలో అవుతానని తెలిపారు. మంచి ఐఏఎస్ అధికారి అని, యాదాద్రి లో పని చేసే సమయంలో అక్కడ 50 పాఠశాలలను అభివృద్ధి చేశామని వివరించారు. విద్యార్థులు కష్టపడి చదవాలని, కష్టపడితే మనల్ని ఆపేవారు ఎవరూ ఉండరని తెలిపారు. కాసేపు విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.
మాతృభాష ను వరువద్దు.. కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు దీటుగా విద్యానందిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. స్మార్ట్ క్లాస్ రూమ్ ను విద్యార్థులు సద్వినియం చేసుకొని చక్కని ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు మాతృభాషను మరవ వద్దని, ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషలకు కూడా నేర్చుకోవాలని సూచించారు. టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమం కింద సినీ నటి మంచు లక్ష్మి స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
మంచు లక్ష్మి పేద విద్యార్థులకు చేతనందించడం మరిచిపోలేమని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ డీఈఓ జనార్దన్ రావు, స్థానిక కార్పొరేటర్ మర్రి భావన, ప్లానింగ్ అధికారి అబ్దుల్ బరి, టీచ్ ఫర్ చేంజ్ సిఓఓ ఆయుబ్, హెచ్ఎంలు సంపత్ రావు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
(రిపోర్టింగ్:కె.వి.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్)