TG AGRICET 2024 Updates : బీఎస్సీ, బీటెక్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వివరాలను వెల్లడించింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు.
ఈ ప్రవేశ పరీక్షతో డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులకు వ్యవసాయ వర్సిటీ పరిధిలో బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ, బీటెక్ (అగ్రి ఇంజినీరింగ్) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. https://www.pjtsau.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ) నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) కోర్సుకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ కోసం జులై 10న అగ్రిసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 15 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లు ప్రారంభం కాగా…. చివరి తేదీగా జులై 31ని నిర్ణయించారు.
అదనపు రుసుముతో దరఖాస్తుకు చేసుకోవడానికి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5 గడువు ఇచ్చారు. అప్లికేషన్‌లో ఏదైనా మార్పు చేసుకోవాలంటే ఆగస్టు 7 నుంచి 8 మధ్య ఎడిట్ ఆప్షన్‌లో చేసుకోవచ్చు. దరఖాస్తు హర్డ్ కాపీలు పంపాల్సి ఉంటుంది. హర్డ్ కాపీలను పంపేందుకు ఆగస్టు 14 వరకు గడువు ఉంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తరువాత హర్డ్ కాపీని ఆగస్టు 14లోపు పంపాలి. అది కూడా రిజిస్ట్రర్ పోస్టు, లేదా స్పీడ్ పోస్టులో పంపాలి. దరఖాస్తు హర్డ్ కాపీ పంపాల్సిన చిరునామా ఇది.“The Convener, AGRICET-2024, O/o The Associate Dean, SV Agricultural College, Tirupati -517 502, A.P.
ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23 వరకు అగ్రిసెట్ హాల్‌టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అగ్రిసెట్ మాక్ టెస్టులు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 25 వరకు జరుగుతాయి. ఫలితాలు వెల్లడి, కౌన్సిలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఏఎన్‌జీఆర్ఏయూ తెలిపింది. పరీక్ష కేంద్రాలు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.750 కాగా, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,500 నిర్ణయించారు. ఫీజును అధికారిక వెబ్‌సైట్ angrau.ac.in లో ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. అప్లికేషన్ దాఖలకు గడువు జులై 31న ముగిసిన తరువాత ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5 వరకు అదనపు ఫీజుతో దరఖాస్తు చేయాలనుకునే జనరల్ కేటగిరీ, బీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది.