AP Paddy Procurement: తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయనున్న ప్రభుత్వం-the ap government has announced that it will buy the grain irrespective of its moisture content ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Paddy Procurement: తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయనున్న ప్రభుత్వం

AP Paddy Procurement: తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయనున్న ప్రభుత్వం

Sarath chandra.B HT Telugu
Dec 07, 2023 07:35 AM IST

AP Paddy Procurement: తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం రైతులకు అండగా వుంటుందని, రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.

తడిచిన ధాన్యం పరిశీలిస్తున్న మంత్రి కారుమూరి
తడిచిన ధాన్యం పరిశీలిస్తున్న మంత్రి కారుమూరి

AP Paddy Procurement: మిగ్‌జామ్‌ తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామ శివారులో నీట మునిగిన వరి చేలను, ధాన్యం రాశులను మంత్రి కారుమూరి పరిశీలించారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు, శివదేవుని చిక్కాల, వెలివెల ,తిల్లపూడి గ్రామాల నీటమునిగిన వరి పొలాలను, ధాన్యం రాశులను, సుడిగాలులు వలన నష్టం వాటిల్లన కొబ్బరి, టేకు తదితర చెట్లను పరిశీలించి రైతులతో మాట్లాడి రైతులకు మంత్రి భరోసానిచ్చారు.

రాష్ట్రంలో తుఫాన్ నేపథ్యంలో తేమతో సంబంధం లేకుండా ధాన్యాన్ని రైతుల నుంచి మిల్లర్లు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. భారీ వర్షాల కారణంగా కళ్ళాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైసు మిల్లర్లను కోరామని వారు వెంటనే అంగీకరించారని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో పలు సడలింపులు జారీ చేసిందని ఆఫ్ లైన్లో కొనుగోలు, జిపిఎస్ లేకపోయినా తమ స్వంత వాహనాలు వినియోగించుకోవచ్చునని ఆయన తెలిపారు. రైతులు ఇంకా కోతలు కొయ్యని వరి పంటలను అధికారులు సలహాలు పాటించి కోతలు కోసుకోవాలని సూచించారు.

నరసాపురం మండలం లిఖితపూడి, లక్ష్మేశ్వరం గ్రామాలు నీటమునిగిన వరి పంటలను, లిఖితపూడిలో టోర్నాడో వలన నష్టం వాటిల్లిన ఇండ్లు , కొబ్బరి చెట్లును పరిశీలించి రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు , ప్రభుత్వ చీఫ్ విఫ్ ముదునూరి ప్రసాద రాజు రైతులను, బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

తుఫాను, అధిక వర్షాలు కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 15 వేల హెక్టార్లు లో పంట నష్టం జరిగిందన్నారు. ధాన్యాన్ని చివరి గింజవరకు కొనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు.

రాష్ట్రంలో 6,37,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 1300 కోట్ల రూపాయ లకి గాను సుమారు 1080 కోట్లు రైతులకు డబ్బులు చెల్లించామని ఆయన అన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లోనే వారికి డబ్బులు చెల్లిస్తున్నారు. తుఫాను నష్టం కన్నా టోర్నాడో నష్టమే ఎక్కువ కనిపిస్తుందని, తీర ప్రాంతం అయిన నరసాపురంలో బాధితులకు ప్రతి ఒక్కరికి రేషన్ కూడా వెనువెంటనే అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

Whats_app_banner