Chandrababu On Volunteers : వాలంటీర్లూ... మీరు ఆ పనులు చేయకండి-tdp chief chandrababu comments on volunteers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu On Volunteers : వాలంటీర్లూ... మీరు ఆ పనులు చేయకండి

Chandrababu On Volunteers : వాలంటీర్లూ... మీరు ఆ పనులు చేయకండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 14, 2023 07:12 PM IST

Chandrababu On Volunteers :వాలంటీర్లు రాజకీయాలు చేయడం సరికాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేవలం ప్రభుత్వ పనులు మాత్రమే చేయాలని హితవు పలికారు.

చంద్రబాబు
చంద్రబాబు

TDP Chief Chandrababu On Volunteers:ఏపీలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కీలకమైన డేటా సేకరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వారాహి యాత్రలో భాగంగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్... వాలంటీర్లు వైసీపీకి ప్రైవేటు సైన్యంగా మారారంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ విషయంలో వాలంటీర్లు ఆందోళనలు చేస్తుండగా... వైసీపీ కూడా పవన్ టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. వాలంటీర్లు రాజకీయం చేయవద్దని కోరారు.

శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో "మహాశక్తి చైతన్య రథ యాత్ర" ప్రారంభ సభ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న చంద్రబాబు... ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే... వాలంటీర్లు అంశంపై స్పందించారు. వాలంటీర్లు ఇప్పుడే ఇళ్లలోకి వస్తున్నారని...అలా ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. వాలంటీర్లు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సైకో చెప్పిన పనులు చేయొద్దన్న చంద్రబాబు... మీరు పార్టీ పనులు చేస్తే ఆ ఆడబిడ్డలు వదిలిపెట్టరని హెచ్చరించారు. అలా చేస్తే వాలంటీర్లను కచ్చితంగా నిలదీస్తారని కామెంట్స్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని మహిళలందరు మహాశక్తి సంకల్పం తీసుకోవాలన్నారు చంద్రబాబు. అన్ని సమస్యలకి పరిష్కార మార్గం మహాశక్తి సంకల్పం అని చెప్పారు. ఆడపిల్లలకు ఆస్తి ఉండాలని... చదువు ఉండాలని మహిళాభ్యుదయానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించింది కూడా తెలుగుదేశమే అని అన్నారు. మగవారి కంటే మహిళలకే తెలివితేటలు ఎక్కువని కొనియాడారు. మహిళల ప్రోత్సాహకానికి ఎన్నో కార్యక్రమాలతో పాటు పెద్దగా చదువుకోని వారి కోసం డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చిన చరిత్ర కూడా టీడీపీదే అని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పునరుద్ఘాటించారు చంద్రబాబు. ప్రస్తుతం గ్యాస్‌ ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంపద సృష్టించడం తెలిసిన నాయకుడు మన చంద్రబాబు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం కూడా తెలిసిన నాయకుడు చంద్రబాబు అని ప్రశంసలు కురిపించారు. మహిళా శక్తిని మహాశక్తిగా మార్చడానికి 40 ఏళ్ళ క్రితమే అంకురార్పణ జరిగిందన్నారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. సంక్షేమం అంటేనే టీడీపీ అని వ్యాఖ్యానించారు.

Whats_app_banner

సంబంధిత కథనం