Chandrababu : బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయన్న కేంద్రమంత్రి, స్పందించిన చంద్రబాబు
Chandrababu : సీఎం జగన్ సంపద సృష్టించే అమరావతిని చంపేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఓట్ల అవకతవలపై దిల్లీ వెళ్లి పోరాడతామన్నారు. పొత్తులపై కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు.
Chandrababu : వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోమన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ద్రోహమన్నారు. వాలంటీర్లతో చాలా ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాసేవ వరకే వాలంటీర్ల సేవలు పరిశీలిస్తామన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కేంద్ర మంత్రి నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఎవరో ఏదో మాట్లాడితే దానిపై స్పందించి చులకన కాదల్చుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తన పెద్ద బాధ్యత అని చంద్రబాబు అన్నారు. పోరాడితే కేంద్రం దిగొస్తుందని జల్లికట్టు ఘటనే ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై దిల్లీ వరకు వెళ్లి పోరాడతామన్నారు.
సంపద సృష్టించే అమరావతిని చంపేశారు
చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ లో... సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ ఒక మూర్ఖడు అని, సంపద సృష్టించే అమరావతిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని పూర్తిచేసి ఉంటే చాలా అద్భుతమైన నగరంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ అన్ని వర్గాలను ఆకటుకుంటోందని చంద్రబాబు తెలిపారు. భారత్ మినహా ప్రపంచవ్యాప్తంగా జనాభాలో యువత తగ్గిపోతుందన్నారు. తల్లికి వందనం, ఆడ్డబిడ్డ నిధి, మహిళకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ మహిళల ఆత్మగౌరవం నిలిపేందుకు అమలుచేస్తామని మేనిఫెస్టో గురించి చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనవచ్చని సీఎం కేసీఆర్ చెబుతున్నారని చంద్రబాబు గుర్తుచేశారు.
త్వరలోనే పల్లె నిద్ర
ఒకరి మూర్ఖత్వానికి, పిచ్చితనానికి రాష్ట్రం బలికావాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జీవనాడి పోలవరాన్ని ముంచేస్తే ప్రజల్లో చైతన్యం ఏమైందన్నారు. కృష్ణా-గోదావరితో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఎకరాకు నీళ్లివ్వచ్చన్నారు. వైసీపీ నేతలు భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లతో వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో రైతులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గితే ఏపీలో పెరుగుతున్నాయని వివరించారు. టీడీపీ పాలనతో.. నాలుగేళ్ల వైసీపీ పాలనను బేరీజు వేసుకొనిచూడాలన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా త్వరలోనే పల్లె నిద్ర చేపడతానని చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని వనరులు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్నారు. పట్టిసీమ కడితే అప్పుడు ఎగతాళి చేశారని, ఇవాళ పట్టిసీమ లేకపోతే ఈ ప్రభుత్వం ఏంచేసేదన్నారు. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం ముంచేసిందని విమర్శించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.