AP CID Heritage Papers : హెరిటేజ్ కేసు పేపర్లు దగ్ధం ఆరోపణలు, ఏపీ సీఐడీ క్లారిటీ!
AP CID Heritage Papers : తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో హెరిటేజ్ కేసుకు సంబంధించిన పేపర్లు తగలబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సీఐడీ వివరణ ఇచ్చింది.
AP CID Heritage Papers : తాడేపల్లి సీఐడీ ఆఫీస్ లో డాక్యుమెంట్ల (CID Papers Burnt)దగ్ధం ఘటన కలకలం రేపింది. హెరిటేజ్ డాక్యుమెంట్లు దగ్ధం చేశారని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని తెలిసి కీలకమైన డాక్యుమెంట్లు దగ్ధం చేస్తుందని టీడీపీ(TDP) ఆరోపిస్తుంది. డాక్యుమెంట్ల దగ్ధంపై ఏపీ సీఐడీ(AP CID) ప్రకటన జారీ చేసింది. మీడియా వస్తున్న కథనాలపై వివరణ ఇచ్చింది. తగలబెట్టినవి వేస్ట్ పేపర్లు అని తెలిపింది.
పేస్ట్ పేపర్లు తగలబెట్టాం
5 కేసుల్లో ఛార్జ్ షీట్‌లను సమర్పించినట్లు సీఐడీ(CID ) ప్రకటించింది. కేసులకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఏసీబీ కోర్టు(ACB Court) సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో నిందితులకు కాపీలు అందజేశామన్నారు. ప్రతీ ఛార్జ్ షీట్లలో 8000-10000 పేజీల ద్వారా భారీ డాక్యుమెంటరీ సాక్ష్యాలు కోర్టు అందించామన్నారు. ప్రతి కేసు 12 నుంచి 40 మంది నిందితులు ఉన్నారని సీఐడీ తెలిపింది. ఈ కేసుల్లో ఫొటో కాపీలు తీస్తున్నప్పుడు యంత్రాల్లో పేపర్లు చిక్కుకుపోయి, ప్రింట్ సరిగ్గా రాలేదని అధికారులు తెలిపారు. అలాంటి పేపర్లను తొలగించామని, వృథా పేపర్లను తగలబెట్టామని వివరణ ఇచ్చారు. అయితే కొన్ని మీడియా ఛానళ్లు బాధ్యతారహితమైన రిపోర్టింగ్ చేస్తున్నాయన్నారు. సీఐడీ దర్యాప్తును అప్రతిష్టపాలు చేయడం, నిరుత్సాహపరిచే ఉద్దేశంతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
అదంతా అసత్య ప్రచారం
హెరిటేజ్ ఫుడ్స్(Heritage Foods) ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన పత్రాలు తగలబెట్టారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఐడీ(CID) ఆరోపించింది. ఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు ముందు ఉంచామన్నారు. ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించి ఐటీ రిటర్న్‌లు తాము సీఆర్పీసీ(Cr.PC) ప్రోవిజన్ల ప్రకారం అధికారికంగానే తీసుకువచ్చామని తెలిపారు. ఈ కేసులో మిగతా ఆధారాలు కూడా చట్టప్రకారమే తీసుకున్నామన్నారు. ఆదాయపు పన్ను ఆధారంగానే నిందితులను ప్రశ్నించామన్నారు. ఈ కేసులో సంబంధిచిన అన్ని ఆధారాలు హైకోర్టు(AP High Court), ట్రయల్ కోర్టు ముందు ఉంచామన్నారు. హెరిటేజ్ కంపెనీ ప్రతినిధుల నుంచే ఈ డాక్యుమెంట్లను చట్టబద్ధంగా పొందామని సీఐడీ వివరణ ఇచ్చింది.
లోకేశ్ విమర్శలు
ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్(Nara Lokesh) విమర్శలు చేశారు. నేరపరిశోధనపై దృష్టి పెట్టాల్సిన ఏపీ సీఐడీ(AP CID)... సీఎం జగన్(CM Jagan) పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని ఆరోపించారు. తాను చెబుతున్న మాటలు ఇవాళ నిజమయ్యాయన్నారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జగన్ పోలీస్ సర్వీస్ గా రూపాంతరం చెందారని ఆరోపించారు. తన కుటుంబంపై బురద జల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర చేశారన్నారు. నిబంధనలకు విరుద్దంగా సీఐడీ డీఐజీ(CID DIG) రఘురామిరెడ్డి నేతృత్వతంలో అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారన్నారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పేపర్లను తగులబెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్ లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశచరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్(Lokesh) హెచ్చరించారు.
సంబంధిత కథనం