AP CID Petition : చిక్కుల్లో నారా లోకేశ్..! ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్
AP CID Petition On Lokesh: నారా లోకేశ్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవలే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సీఐడీ… లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
AP CID Petition On Lokesh: నారా లోకేశ్ ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇచ్చిన 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది. ఈ మేరకు ఇటీవలే లోకేశ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది సీఐడీ.
చంద్రబాబు కేసుకు సంబంధించి రెడ్‌బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను లోకేశ్ బెదిరించే విధంగా వ్యవహరించారని తెలిపిన సీఐడీ.. దర్యాప్తు అధికారులను జైలుకి పంపిస్తామని చేసిన ప్రకటనలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. రెడ్‌బుక్ పేరుతో చేస్తున్న ప్రకటనను సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే లోకేశ్ పేరును నమోదు చేసింది సీఐడీ. హైకోర్టు ఆదేశాలతో 41ఏ నోటీసులను కూడా జారీ చేసింది. అయితే ఇందులో పేర్కొన్న నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారని…తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.