Vijayawada CP: బెజవాడ పోలీస్ కమిషనరేట్ గాడిన పడుతుందా? కమిషనరేట్ అప్‌గ్రేడ్‌పై అనుమానాలు…
Vijayawada CP: బెజవాడ పోలీస్ బాస్‌ను కొనసాగిస్తారా, ఏడీజీ స్థాయి అధికారితో అప్‌గ్రేడ్ చేస్తారా, పోలీస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది.
Vijayawada CP: విజయవాడ పోలీస్ కమిషనరేట్ పోస్టింగ్‌పై అందరి దృష్టి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడను గత ఐదేళ్లుగా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అడిషనల్ డీజీ స్థాయి అధికారులతో నడిచిన కమిషనరేట్ హోదాను గత ప్రభుత్వం కావాలనే తగ్గించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నికల తర్వాత ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు గత ఐదేళ్లుగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ ప్రతిష్టను తగ్గించేలా ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగాయి.
కమిషనరేట్ స్థాయి పెంపు…
విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని ఎంపిక చేసిన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనరేట్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. అప్పటి వరకు ఐజి స్థాయి అధికారులను మాత్రమే విజయవాడ పోలీస్ కమిషనర్‌లుగా నియమించేవారు.
రాజధానిలో భాగంగా 2014 చివరి నుంచి విజయవాడ కేంద్రంగానే పాలన సాగింది. 2015లో పాలనా యంత్రాంగాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలనే ఉద్దేశంతో రాజధాని నిర్మాణం చేపట్టారు. ఏడాది వ్యవధిలోనే సచివాలయ నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వ కార్యాలయాలను తరలించారు. ఈ క్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్లుగా అదనపు డీజీ స్థాయి అధికారులను నియమిస్తూ వచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావు, గౌతమ్ సవాంగ్, ద్వారకా తిరుమల రావు వంటి ఏడీజీ స్థాయి అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్లుగా పనిచేశారు.
2020 వరకు ఏడీజీ స్థాయి అధికారితోనే విజయవాడ పోలీస్ కమిషనరేట్ నడిచింది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా దాని స్థాయి తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పటికే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం, పరిపాలనా వ్యవస్థను విశాఖపట్నం తరలించాలని నిర్ణయించడంతో విజయవాడ కమిషనరేట్ స్థాయిని కూడా ఐజీ స్థాయికి తగ్గించింది.
ఆ తర్వాత కమిషనరేట్ పరిధిని ఎన్టీఆర్ జిల్లాకు మార్చింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమ కృష్ణా ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఐజీ స్థాయి అధికారులనే విజయవాడ సీపీలుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం మారడంతో అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్ భవితవ్యం ఏమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
వివాదాస్పదమైన అధికారుల పనితీరు..
విజయవాడ పోలీస్ కమిషనర్లుగా పనిచేసిన అధికారుల్లో ఎన్ని సంఘం వేటు వేసిన కాంతిరాణా తాతా వివాదాస్పద వైఖరి నేపథ్యంలో ఐజీ స్థాయి అధికారిని విజయవాడలో కొనసాగిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులకు పోలీసులు అండగా నిలిచారనే విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు ముఖ్యమంత్రిపైనే రాయి దాడి జరగడంతో సీపీ కాంతిరాణాపై ఈసీ వేటు వేసింది. అంతకు ముందే ఆయన్ని విధుల నుంచి తప్పించాలని విపక్షాలు పలుమార్లు ఫిర్యాదు చేశాయి. ద్వారకా తిరుమల రావు తర్వాత విజయవాడ సీపీగా పనిచేసిన బత్తిన శ్రీనివాసులు గతంలో కూడా విజయవాడలో పనిచేశారు.
ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రస్తుతం విజయవాడ సీపీగా పిహెచ్‌డి రామకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ సీపీగా ఆయన తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గతవారం జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సీపీ ఆ తర్వాత ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఈ నేపథ్యంలో విజయవాడ సీపీగా ఐజీ స్థాయి అధికారి వ్యవహారం చర్చకు వచ్చింది.
క్షీణించిన శాంతి భద్రతలు…
గత ఐదేళ్లలో విజయవాడలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గంజాయి మూకలు చెలిరేగిపోయాయి. వీధికో గ్యాంగు వెలిసింది. పట్టపగలు, అర్థరాత్రి తేడాలేకుండా వీధుల్లో అల్లరి మూకలు చెలరేగిపోతున్నా పోలీసులు చర్యలు మాత్రం లేవు. పోలీస్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమై కేవలం బందోబస్తు విధులకు పరిమితం అయ్యారు. ఈ పరిస్థితుల్లో విజయవాడ వంటి నగరంలో సిబ్బందిని ముందుండి ధైర్యంగా నడిపించే అధికారుల అవసరం ఉంటుంది. మరోవైపు రాజధాని ప్రాంతంలో కీలకమైన కమిషనరేట్ స్థాయిని ఐజీ స్థాయి అధికారికి పరిమితం చేస్తారా లేదా అనే చర్చ కూడా ఉంది.
సీనియర్ అధికారుల కొరత…
విజయవాడకు సీనియర్ అధికారులను నియమించే విషయంలో ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఉన్న వారిలో కొందరు కేంద్ర ప్రభుత్వ డెప్యూటేషన్‌లో ఉండటం, మరికొందరు రాజకీయ ముద్రలు వేసుకోవడం, గత ఐదేళ్లలో అధికార పార్టీతో అంటకాగడం వంటి సమస్యలతో ఉన్న వారిలో పలువురిని ప్రాధాన్య పోస్టింగుల్లో వేయలేని పరిస్థితి ఉంది.
ప్రస్తుతం డీజీపీగా ద్వారకా తిరుమల రావు ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి వరకు ఆయన పదవీ కాలం ఉంది. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న అంజనీకుమార్, అంజనా సిన్హా తెలంగాణలో ఉన్నారు. ఆ తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. మాజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హోంసెక్రటరీగా ఉన్నారు. ఆ సీనియారిటీలో ఆ తర్వాత స్థానాల్లో ఉన్న పిఎస్సార్ ఆంజనేయులు, మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలు కూడా డీజీపీ క్యాడర్‌లో ఉన్నారు. సీనియారిటీలో ఆ తర్వాత స్థానాల్లో నళిని ప్రభాత్ కేంద్ర సిఆర్‌పిఎఫ్ ఐజీగా ఉన్నారు. మహేష్ దిక్షిత్ కూడా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇటీవల డీజీపీగా పదోన్నతి లభించిన పివి సునీల్‌కు పోస్టింగ్ లేదు. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి.
ఏడీజీగా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్‌కు సిఐడి బాధ్యతలు అప్పగించారు. బాలసుబ్రహ్మణ్యం డీజీపీ ఆఫీసులో కో ఆర్డినేషన్ విధుల్లో ఉన్నారు. కృపానంద్ త్రిపాఠి,అతుల్ సింగ్ రాజీవ్ కుమార్ మీనా, భావనా సక్సేనా, మధుసూదన్ రెడ్డి వంటి అధికారులు ఏడీజీ హోదాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ సీపీగా అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమిస్తారా, ఐజీ స్థాయితోనే సరిపెడతారా అనే చర్చ జరుగుతోంది.