AP Crime : డామిట్ కథ అడ్డం తిరిగింది.. భార్య చెప్పడంతో కువైట్ నుంచి వచ్చి చెల్లిలు మామ హత్య.. ఆ తర్వాత..
AP Crime : ఇటీవలి అన్నమయ్య జిల్లాలో చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. వృద్ధుడిని హత్య చేయడం సంచలనం అయింది. నిందితుడు.. తన కుమార్తె పట్ల నీచంగా ప్రవర్తించడం వల్లనే హత్య చేశానని వీడియో విడుదల చేశారు. అందరూ అదే అనుకున్నారు. కానీ ఇక్కడ డామిట్ కథ అడ్డం తిరిగింది.
ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన ఆంజనేయప్రసాద్, చంద్రకళ దంపతులకు ఒక కుమార్తె (12) ఉంది. అయితే జీవనోపాధి కోసం ఆంజనేయప్రసాద్, చంద్రకళ కువైట్‌లో ఉంటున్నారు. తమ కుమార్తెను అమ్మమ్మ రత్నమ్మ వద్దే ఉంచేశారు.
ఇటీవల రత్నమ్మ కూడా కువైట్ వెళ్లింది. ఈ సందర్భంలో ఆమె మరో కుమార్తె, చంద్రకళ చెల్లెలు లక్ష్మీ, వెంకటరమణ దంపతుల వద్ద మనవరాలిని ఉంచి వెళ్లారు. చెల్లెలు లక్ష్మీ వద్ద తన కుమార్తెను ఉంచడం చంద్రకళకు ఇష్టం లేదు. దీనిపై చంద్రకళకు, తన తల్లి రత్నమ్మ, సోదరి లక్ష్మీల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ నేపథ్యంలో నవంబర్ 21న చంద్రకళ కువైట్ నుంచి స్వగ్రామం కొత్తమంగంపేటకు వచ్చారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తన చెల్లెలు వద్ద తన కుమార్తెను ఉంచడం ఇష్టం లేదని, తన కుమార్తెను హాస్టల్‌లో ఉంచి చదివించుకుంటానని పోలీసులకు చెప్పారు. ఇక నుంచి తన కుమార్తెతో తన చెల్లెలు కుటుంబ సభ్యుల మాట్లాడకూడదని, వారి సంరక్షణ అవసరం లేదని తెలిపారు. వారి తన కుమార్తెపై ప్రమేయం లేకుండా చూడాలని, చెల్లెల కుటుంబ సభ్యులను హెచ్చరించాలని పోలీసులను కోరారు.
పోలీసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. అందుకు చంద్రకళ తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారమని, రేపే తాను కువైట్ వెళ్లాల్సి ఉందని చెప్పింది. దీంతో పోలీసులు ఆమె చెల్లెల కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తరువాత వారిని పోలీస్ స్టేషన్ నుంచి పంపిచేశారు. అంతేతప్ప నిందితుడు ఆంజనేయ ప్రసాద్ యూట్యూబ్‌లో ఆరోపించినట్లు చంద్రకళ చెల్లెలు లక్ష్మీ మామ గట్టు ఆంజనేయులు (59) తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దీనిపై కేసు పెట్టాలని చంద్రకళ పోలీసులను కోరలేదు.
అయితే పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ అనంతరం చంద్రకళ కువైట్‌కి వెళ్లిపోయింది. అక్కడ భర్త ఆంజనేయప్రసాద్‌తో కుమార్తె పట్ల ఆంజనేయులు అసభ్యంగా ప్రవర్తించాడని, ఆయనను చంపేయాలని కోరింది. దీంతో హత్య చేసేందుకు సిద్ధపడిన నిందితుడు ఆంజనేయప్రసాద్.. ఈనెల 5న కువైట్ నుంచి రైల్వే కోడూరు చేరుకుని ఓ లాడ్జిలో బస చేసి.. తన చిన్నాన్న కుమారుడి జడ్డా నవీన్‌ను కలిశాడు. గ్రామంలో ఈనెల 6న రెక్కీ చేశాడు. మరుసటి రోజు తెల్లవారు జామున తన ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఆంజనేయులపై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆంజనేయప్రసాద్ కువైట్ వెళ్లిపోయాడు.
జడ్డా నవీన్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఆంజనేయప్రసాద్ యూట్యూబర్ కావడంతో కేసును తప్పుదోవ పట్టించాలని అనుకున్నాడు. అందుకే పోలీసులపై ఆరోపణలు చేస్తూ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. వీడియోలో తన కుమార్తెపై ఆంజనేయులు అసభ్యంగా ప్రవర్తించాడని, పోలీసులకు ఫిర్యాదుచేస్తే పట్టించుకోలేదని ఆరోపణలు చేశాడు. ఆ వీడియో వైరల్ అయితే ప్రజలు, బంధువుల నుంచి తనకు సానుభూతి వస్తుందని భావించాడు.
ఆంజనేయప్రసాద్, చంద్రకళ ఇద్దరూ కువైట్ నుంచి వచ్చి జడ్డా నవీన్‌తో కలిసి ఈనెల 12న మంగళంపల్లి వద్ద న్యాయవాదిని కలిసేందుకు వెళ్తుండగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిని కోర్టులో హాజరపరిచారు. జడ్జ్ రిమాండ్ విధించడంతో వారిని రిమాండ్‌కు తరలించారు. నిందితుల పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్‌లు, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, టూవీలర్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రైల్వే కోడూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. రాజంపేట డీఎస్పీ సుధాకర్, రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లె ఎస్ఐ మహేష్ నిందితులను ప్రవేశపెట్టారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)