AP Rain ALERT : ఉపరితల ఆవర్తనం, ఆపై మరో అల్పపీడనం..! ఏపీకి భారీ వర్ష సూచన, ఈ జిల్లాలకు హెచ్చరికలు
AP Telangana Weather Updates : ఇవాళ దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిచింది. ఈ ప్రభావంతో సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది రేపటికి అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని వివరించింది.
మంగళవారం కోస్తా,రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
భారీ వర్ష సూచన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి
భారీ వర్షాలకు కాళంగి రిజర్వాయర్, అరణియార్ ప్రాజెక్ట్ నుండి నీటిని విడుదల చేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాజెక్టుల్లోనూ.. డ్యామ్‌లలోనూ పూర్తిస్థాయిలో నీటి నిలువ చేరుకున్నాయి. ఇక ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో…. వాతావరణంలో మరిన్ని మార్పులు అవకాశం ఉంటుంది. దీంతో ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండనుంది.
తెలంగాణలో చలి తీవ్రత:
ఇక తెలంగాణలో చూస్తే పొడి వాతావరణం ఉండనుంది. డిసెంబర్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 17వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడకక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది.