Canntonment Politics: కంటోన్మెంట్‌‌లో గెలిచేదెవరు, సానుభూతి దక్కెదెవరికి?-in cantonment assembly constituency gaddar and sayannas daughters are in ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Canntonment Politics: కంటోన్మెంట్‌‌లో గెలిచేదెవరు, సానుభూతి దక్కెదెవరికి?

Canntonment Politics: కంటోన్మెంట్‌‌లో గెలిచేదెవరు, సానుభూతి దక్కెదెవరికి?

HT Telugu Desk HT Telugu
Nov 02, 2023 12:12 PM IST

Canntonment Politics: ఒకరు ప్రజాయుద్ధనౌక వారసురాలైతే మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే తనయురాలు… కంటోన్మెంట్‌ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీల తరపున తలపడుతున్నారు. గద్దర్ కుమార్తె వెన్నెల, ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందితల మధ్య పోటీ నెలకొంది.

గద్దర్ కుమార్తె వెన్నెల, సాయన్న కుమార్తె లాస్య నందిత
గద్దర్ కుమార్తె వెన్నెల, సాయన్న కుమార్తె లాస్య నందిత

Canntonment Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజక వర్గం ఒకటి ఉంది. అధికార బిఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆ నియోజక వర్గాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.

సికింద్రాబాద్ కంటోన్మెట్ నియోజకవర్గాన్ని రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందితకు బిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమకారుడు గద్దర్ కుమార్తె డా.వెన్నెలకు టికెట్ ఇచ్చింది.

ఇద్దరు అభ్యర్థులు ప్రముఖ నేతల కుమార్తెలు కావడంతో ఇక్కడ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగనుంది. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నిజానికి గద్దర్ మరణం వరకు డాక్టర్ వెన్నెల తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం లేదు.ఇటీవలే కాలంలోనే ఆమె గద్దర్ కుమార్తెగా ప్రజలకు పరిచయం అయ్యారు. తన తండ్రి ఆఖరి కోరికను తీర్చేందుకు, ఆయన రాజకీయ వారసురాలిగా ఆమె ప్రజల్లోకి వచ్చారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉన్న సీనియర్లను కాదని వెన్నెలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది.ఇన్నేళ్లుగా గద్దర్ వారసురాలిగా ఎక్కడా తన ఉనికిని బయట పెట్టకుండా తన కాళ్ళ మీద నిలబడాలనే సంకల్పంతో ఆమె జీవితాన్ని కొనసాగించారు.

వేతనం లేకుండా 7 ఏళ్ళ పాటు టీచర్‌గా విధులు…

సినీనటుడు మోహన్ బాబు స్థాపించిన విద్యా నికేతన్‌ చదువుకుంటున్న సమయంలోనే గద్దర్ అల్వాల్ భూదేవి నగర్ లో మాజీ ఐఏఎస్ శంకరన్ వంటి వారితో కలిసి మహాబోధి అనే పాఠశాల ప్రారంభించారు.

సెలవుల్లో వెన్నెల ఆ పాఠశాలలో పిల్లలకు కంప్యూటర్ పాటలు చెప్పేది.డిగ్రీ పూర్తి చేసుకున్న అనంతరం హైదరాబాద్ తిరిగి వచ్చిన వెన్నెల రంగారెడ్డి జిల్లాల్లో వెలుగు పథకంలో చిరు ఉద్యోగినిగా పని చేశారు. ఆ తరువాత 2010 నుంచి 2017 వరకు తన తండ్రి గద్దర్ స్థాపించిన మహాబోధి పాఠశాలలో రూపాయి వేతనం తీసుకోకుండా 7 ఏళ్ళ పాటు ఉపాధ్యాయురాలుగా పని చేశారు.

అనంతరం 2017లో పీహెచ్డీ పూర్తి చేశారు. అదే పాఠశాలలో కొంత వేతనంతో ప్రిన్సిపల్ గా పని చేశారు. ప్రస్తుతం తన తండ్రి ఆశయాల మేరకు ఆయన స్థాపించిన విద్యాసంస్థను మరింత విస్తరించే ప్రయత్నంలో ఉండగానే గద్దర్ కన్నుమూశారు.

జీవితపు చివరి రోజుల్లో గద్దర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.ఆ పార్టీ నుండి గద్దర్ పోటీ చేయాలని భావించి అంతలోనే మరణించారు.తన తండ్రి వదిలి వెళ్లిన బాధ్యతను కుమార్తె వెన్నల తీసుకొని పోటీకి సిద్ధమయ్యారు.కాంగ్రెస్ పార్టీ సైతం ముందుకొచ్చి ఆమెకి టికెట్ ఇచ్చింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే కుమార్తెగా…

ఇదే సెగ్మెంట్ లో 1994 నుంచి 2018 వరకు అయిదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన జి.సాయన్న ఇటీవలే మరణించడంతో ఎన్నికలో ఆయన కుమార్తె ,కార్పొరేటర్ గా ఉన్న లాస్య నందితకు సీఎం కేసిఆర్ టికెట్ కేటాయించారు.

తండ్రి వారసత్వం, బిఆర్ఎస్ అభ్యర్థిత్వం కలిపి తనకు గెలుపు తేస్తాయని లాస్య నందిత ధీమాతో ఉన్నారు. ఆమె కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇద్దరు విద్యాధికులైన మహిళలు,ఒకేసారి ఒకే నియోజికావర్గం నుండి తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుండండంతో కంటోన్మెంట్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner