Jakkampudi Raja : ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. 151 స్థానాల నుంచి 11 సీట్లకు అత్యంత దారుణంగా వైసీపీ పరాజయం పాలైంది. అసెంబ్లీ కనీసం ప్రతిపక్షం హోదా కూడా వైసీపీకి దక్కలేదు. తాజాగా వైసీపీ ఓటమిపై ఆ పార్టీ నేత, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆయన చుట్టూ చేరిన కోటరీ ఓ భ్రమలోకి తీసుకెళ్లిందన్నారు. జగన్ ను నమ్ముకున్నవారే ముంచేశారన్నారు. జగన్ చుట్టూ చేరిన కోటరీ, కొంతమంది అధికారులు, వ్యవస్థని భ్రష్టు పట్టించారన్నారన్నారు. వైఎస్ జగన్ ను వారంతా తప్పుదోవ పట్టించారని ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతలపై జక్కంపూడి రాజా సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ కోటరీ ఎవరని చర్చ జరుగుతోంది.
రాష్ట్ర ప్రజలకు ఎంతో చేశామని, అయినా ఎందుకు ఓడిపోయామన్నది ఎవరికీ అంతు చిక్కడంలేదని జక్కంపూడి రాజా అన్నారు. వైఎస్ జగన్ చుట్టూ పనికిమాలిన అధికారులు, చెత్త కోటరీ ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో నిజాయితీగా ఉండాలనే వైఎస్ జగన్ తీరులో నిజంగా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారేమో అన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేశాయన్నారు. జగన్ చుట్టూ చేరిన కోటరి ఆయనను తప్పుదోవ పట్టించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్ అన్నారు. అలాంటి నేతకు కేవలం 11 సీట్లు రావడం అత్యంత దారుణం అని ఆవేదన చెందారు.
జగన్ మంచి నేత, ఆయన చుట్టూ చేరిన వాళ్ల వల్లే నష్టం జరిగిందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్లతో పార్టీ జరిగిన విషయాలపై ఒక్కొక్కరిగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. ప్రతి రోజూ ప్రజల కోసం పనిచేసినా ఓటమి తప్పలేదన్నారు. తాము తప్పు చేశామా, ప్రజలే తప్పుచేశారా అన్న అర్థం కావడంలేదన్నారు.
"జగన్ చుట్టూ చేరిన కోటరీ, కొందరు అధికారులు ఆయన చుట్టూ గిరి గీసి ఒక ట్రాన్స్ లో ఉంటారు. జగన్ కు ఏదైనా పేపర్ ఇస్తే ఆ అధికారులను నమ్మి వారికి ఇచ్చే వారు. ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారి ఎవరూ లేరు. ఏదైనా పనికి అర్జీ పట్టుకుని వేళ్తే, ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించేవారు. ఆయన రూము ముందు గంటల తరబడి నిలబడాల్సి వచ్చేంది. పది మందికి మంచి జరుగుతుందని గంటల తరబడి ఆయన రూము ముందు వేచిచూసేవాళ్లం. లోపలికి పిలిచి కనీసం రెండు నిమిషాలు కూడా మాట్లాడేవారు కాదు. ఉదయం 8 గంటలకు వెళ్లి రాత్రి 11 గంటల వరకు ధనుంజయ రెడ్డి రూము బయట నిలబడేవాళ్లు."- జక్కంపూడి రాజా
పోలింగ్ తర్వాత కూడా వైఎస్ జగన్ ఐ పాక్ ఆఫీస్ కి వెళ్లి ప్రపంచమంతా మన వైపు చూడబోతుందని చెప్పారంటే, ఆయనను ఎంత భ్రమలో ఉంచారో అర్థమవుతుందని జక్కంపూడి రాజా అన్నారు. తాను చిన్నప్పటి నుంచి రాజకీయాలను చాలా దగ్గరగా చూశానన్నారు. రాజకీయాల్లో ఓటమి, గెలుపు సహజం అన్నారు. కానీ తాను ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదన్నారు. రాజకీయాల్లో చూడాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయరన్నారు. రాజకీయాలలో విలువలు పాటించే వ్యక్తి జగన్ అన్నారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం జగన్ ఖర్చు పెట్టారన్నారు.
సంబంధిత కథనం