Ysrcp Welfare: సంక్షేమ రాజ్యంలో సత్యం ఎంత…? వైఎస్‌ జగన్‌ మాటల్లో నిజమెంత? నాణానికి రెండో వైపు ఉందా?-what is the other side of the gram swaraj brought by the jaganmohan reddy government in ap ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ysrcp Welfare: సంక్షేమ రాజ్యంలో సత్యం ఎంత…? వైఎస్‌ జగన్‌ మాటల్లో నిజమెంత? నాణానికి రెండో వైపు ఉందా?

Ysrcp Welfare: సంక్షేమ రాజ్యంలో సత్యం ఎంత…? వైఎస్‌ జగన్‌ మాటల్లో నిజమెంత? నాణానికి రెండో వైపు ఉందా?

Sarath chandra.B HT Telugu
Apr 27, 2024 07:59 PM IST

Ysrcp Welfare: గాంధీజి కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చామని, గడప వద్దకే పాలన తీసుకొచ్చామని ఏపీ ప్రభుత్వం గర్వంగా చెబుతున్నా, నాణానికి రెండో వైపు కూడా ఉంది.

జగన్‌ తెచ్చిన గ్రామ స్వరాజ్యంలో మరో కోణం ఉందా?
జగన్‌ తెచ్చిన గ్రామ స్వరాజ్యంలో మరో కోణం ఉందా?

Ysrcp Welfare: కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం పేదరికమే ప్రాతిపదికగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తామని ఐదేళ్లలో జనాభాలో దాదాపు 90శాతం ప్రజలకు మేలు చేశామని వైసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ys Jagan జగన్మోహన్ రెడ్డి తరచూ చెబుతుంటారు. గడప వద్దకే పాలన తీసుకొచ్చామని ప్రభుత్వం గర్వంగా చెబుతున్నా, నాణానికి రెండో వైపు కూడా ఉంది.

గాంధీజి కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ్యానిఫెస్టో manifesto విడుదల సందర్భంగా మరో సారి గుర్తు చేశారు. 2019 అక్టోబర్ 2 నుంచి ఏపీ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. నిజానికి ఏపీలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ grama Sachivalayam వ్యవస్థ పనితీరుపై దేశ వ్యాప్తంగా ఇప్పటికే చర్చ జరుగుతోంది.

గ్రామ, వార్డు సచివాలయాలతో ఏపీ ప్రభుత్వం సాధించిన గుణాత్మక మార్పేమిటనే ప్రశ్న ఇప్పటికే దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో బ్యూరోక్రాట్ల Public Policy పబ్లిక్ పాలసీ కోర్సుల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఏపీలో అమలు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల స్వతంత్రత, వాటికున్న నిర్ణయాధికారం, పాలనలో గుణాత్మక మార్పులపై సంతృప్తికర స్థాయిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల్లో మద్దతు దక్కలేదు. డిబిటి స్కీమ్‌ల పంపిణీ తప్ప అవి సాధించిన మార్పేమి లేదన్నది కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి హోదాలో సుదీర్ఘ కాలం పనిచేసి, పబ్లిక్ పాలసీ పాఠాలు చెప్పే రిటైర్డ్ అధికారుల అభిప్రాయంగా ఉంది.

సంస్కరణలకు మరో వైపు...

ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమాన్ని గడప వద్దకే అందిస్తున్నామని, లబ్దిదారులకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, ఇంటింటికి సంక్షేమాన్ని చేరవేసే వాలంటీర్లపై సిఎం ప్రసంగాల్లో ప్రశంసలు కురిపిస్తున్నా కనిపించని మరో కోణాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి ఏడాదిలోపు మాత్రమే అది స్వతంత్రంగా పనిచేసింది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయం కనుసన్నల్లోకి జారిపోయింది.

కులం, మతం, ప్రాంతం, పార్టీ వంటివి ఏమి చూడకుండా సంక్షేమాన్ని అమలు చేస్తే తమ మాట ఎవరు వింటారని ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గగ్గోలు పెట్టడంతో అవి ఏర్పాటైన ఏడాదిలోపే వాలంటీర్లను ప్రాంతాల వారీగా అధికార పార్టీ నాయకులకు అప్పగించేశారు. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను అధికార పార్టీకి అనుబంధ వ్యవస్థగా మార్చారో అప్పుడే ప్రభుత్వ వ్యవస్థలకు ఉండే అవలక్షణాలన్ని చాలా వేగంగా నేర్చేశారు.

ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో కార్పొరేటర్లు, చోటామోటా నాయకులు, నామినేటెడ్‌ నేతలు, స్థానిక సంస్థల నాయకులు సచివాలయాలపై వాలిపోయారు. సచివాలయాలను ఏర్పాటు చేసి ఐదేళ్లు గడిచినా వాటికి స్వతంత్ర నిర్ణయాధికారం ఇప్పటికీ లేదు. అవి అందించాల్సిన పౌర సేవల్ని సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా అందించే నోడల్ ఏజెన్సీ పాత్రను మాత్రమే ఇప్పటికీ సచివాలయాలు పోషిస్తున్నాయి.

కోవిడ్‌తో చెలరేగిపోయారు…

మొదటి దశ కోవిడ్‌ ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలను స్థానిక ఎమ్మెల్యేలకు వారి కింద ఉండే కార్పొరేటర్లు, ఇతర నాయకులకు అనుబంధం చేశారు. ఒక్కో ఎమ్మెల్యే పరిధిలో ఉండే సచివాలయాలను ఆదాయ మార్గాలుగా మార్చేసుకున్నారు. ఇదంతా అనధికారికంగా నోటి మాటగానే జరిగినా నాలుగేళ్లలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సచివాలయ వ్యవస్థలో రాజకీయ నేతల ప్రమేయం రాగానే క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బందిని అవినీతి రొచ్చులోకి లాగేశారు.

సంక్షేమ పథకాల అమలు, పెన్షన్ల పంపిణీ సంగతి అటుంచితే స్థానికంగా ఉండే వాలంటీర్లను నేతలు నిఘా వ్యవస్థగా మార్చుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇంటి ముందు ఇసుక కనిపిస్తే కార్పొరేటర్లకు కప్పం కట్టాల్సిన దుస్థితిని తీసుకొచ్చారు. వాలంటీర్లు, టౌన్ ప్లానింగ్‌ సెక్రటరీలు, కార్పొరేటర్లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, టౌన్‌ ప్లానింగ్ విభాగాలు చెలరేగిపోయాయి. వ్యవస్థీకృత నేర ముఠాలుగా తయారై ప్రజల్ని పీల్చుకుతిన్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చిన చాలా నియోజక వర్గాల్లో ఈ తరహా సమస్యలు ప్రధాన పాత్ర పోషించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 56 నియోజక వర్గాలు పూర్తిగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని చోట్ల ప్రణాళిక విభాగాలతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. స్థానిక నాయకులకు కప్పం కట్టనిదే నిర్మాణాలు కొనసాగించని పరిస్థితి అన్ని చోట్ల ఉంది. బెదిరింపులు, బలవంతపు వసూళ్లలో వాలంటీర్లను ప్రధాన భాగస్వాముల్ని చేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు అందుకోని మధ్యతరగతి వర్గమే ఐదేళ్లలో ప్రధానంగా ఈ తరహా సమస్యలు ఎదుర్కొంది.

కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లకు ప్రభుత్వం చెల్లించే జీతం నామమాత్రం కాబట్టి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లోని డిబిటి స్కీమ్‌ నగదులో వాటాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయనే భయం, పథకాలను నిలిపివేస్తారనే ఆందోళనతో వీటిపై కనీసం ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా అవినీతి ప్రభావం తక్కువగానే ఉన్నా అవి కూడా పట్టణ ప్రాంతాల బాట పట్టడానికి అట్టే సమయం పట్టదు.

ఏది జవాబుదారీతనం…!

గ్రామ స్వరాజ్యం నినాదం ఆకర్షణీయంగా కనిపిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కానీ, ఏ మాత్రం బాధ్యత, జవాబుదారీతనం లేని వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి హామీ తాజా మేనిఫెస్టోలో లేదు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే క్రమంలో మరింత బాధ్యతాయుతమైన పాత్రను వారికి కల్పిస్తామనే భరోసా మాత్రం ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగంలో ఇవ్వలేదు.గతంలో టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో పోల్చే క్రమంలో ప్రస్తుత పరిస్థితిని మాత్రం విస్మరించారు.

WhatsApp channel

సంబంధిత కథనం