AP CM Jagan Record: ఆ విషయంలో ముఖ్యమంత్రి జగన్ కొత్త రికార్డ్...! ప్రెస్ మీట్ లేకుండానే పదవీ కాలం పూర్తి
AP CM Jagan Record: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ విషయంలో రికార్డ్ సృష్టించారు. ఐదేళ్ల పాలనలో గతంలో ముఖ్యమంత్రులు ఎవరు సాహసించని ఓ నిర్ణయాన్ని నిర్మోహమాటంగా అమలు చేశారు
AP CM Jagan Record: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ Schedule వెలువడింది. శనివారం మధ్యాహ్నం సీఈసీ ప్రకటనతో ప్రభుత్వాలు మొత్తం ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లిపోయాయి. జూన్ 4న ఎన్నికల ప్రకటన వెలువడి, కొత్త ప్రభుత్వాలు కొలువుదీరే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేయాల్సి ఉంటుంది.
ప్రధాని మోదీ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నామమాత్రం కానున్నారు. రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూడా రెండున్నర నెలల పాటు నామమాత్రం అవుతాయి. మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుతో, కార్యనిర్వాహక వ్యవస్థలోని ప్రతి ఒక్కరు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పాలనా యంత్రంగాన్ని నడిపించాల్సి ఉంటుంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధించిన ఓ రికార్డు రాజకీయ వర్గాలతో పాటు, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఐదేళ్లలో సిఎం హోదాలో ప్రెస్ మీట్‌లు నిర్వహించకుండానే పదవీ కాలం పూర్తి చేశారు.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సిఎం జగన్ కోవిడ్ లాక్‌డౌన్ విధించిన తర్వాత.. 2020 మార్చిలో కోవిడ్ అప్రమత్తతపై ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఓసారి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యల్ని వివరించడానికి మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించారు. 2020 మార్చి-మేలలో వీటిని నిర్వహించారు. అంతకు ముందు 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీ పర్యటనలో ఓసారి మీడియాతో మాట్లాడారు.
మీడియాకు దూరం దూరం…
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు ఎవరైనా తరచూ ప్రెస్ మీట్‌లు నిర్వహించడం, ప్రభుత్వ విధానాలను వివరించడం, విమర్శలకు సమాధానాలు ఇవ్వడం, ప్రగతి, పనితీరును ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పడం, రాజకీయ విమర్శలు ఎదురైనపుడు ప్రత్యర్థులకు బదులివ్వడం వంటి సాధారణం జరిగే ప్రక్రియే.
సిఎం పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్కసారి కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయింది. ముఖ్యమంత్రి విధానాపరమైన నిర్ణయాల్లో భాగంగా మీడియా Media సమావేశాలు నిర్వహించ కూడదనే నిర్ణయానికి చివరి వరకు కట్టుబడి ఉన్నారు. అతి కొద్ది సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చి తాను చెప్పాలనుకున్నది చెప్పారు. అది కూడా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మాత్రమే మీడియా ముందుకు వచ్చారు.
అంతు చిక్కని కారణాలు...
ఐదేళ్లలో ముఖ్యమంత్రి తాను ఏమి చెప్పాలనుకున్నా అసెంబ్లీ సమావేశాలనే వేదికగా చేసుకుని చెప్పేవారు. కోవిడ్ ఆంక్షలు సడలించిన తర్వాత 2022 నుంచి విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. తొలి ఏడాది పాలనలో కుదురుకోడానికి సరిపోయింది. ఆ వెంటనే కోవిడ్ Covid 19 ఆంక్షలు మొదలయ్యాయి. 2020 నుంచి 2021 చివరి వరకు కోవిడ్ ఆంక్షలతోనే సరిపోయింది.
ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారనే కారణంతో కొన్ని మీడియా సంస్థలపై ఆంక్షలు విధించారు. అధికారిక సమాచారాన్ని కూడా అయా సంస్థలకు అందించడానికి ముఖ్యమంత్రి పిఆర్ బృందాలు నిరాకరించాయి. ఆ తర్వాత ఆ ఆంక్షల్ని కాస్త సడలించారు.
మిగిలిన మీడియా సంస్థలకు కూడా అరకొర సమాచారం మాత్రమే అందేది. సందేహ నివృత్తి ప్రక్రియకు ఐదేళ్లలో పూర్తిగా మంగళం పాడేశారు. ప్రభుత్వం తరపున ఎవరిని వివరణ కోరాలి, ఎవరు సమాధానాలిస్తారనే గందరగోళంతోనే చాలా కాలం గడిచిపోయింది.
బహిరంగ సభల్లోనే సిఎం మనసులో మాట…
గత రెండేళ్లుగా సంక్షేమ పథకాల అమలులో భాగంగా విస్తృతంగా బహిరంగ సభలు నిర్వహణతోనే సిఎం జగన్ ప్రజల్లోకి వెళ్లారు. ప్రతి నెలలో రెండు మూడు కార్యక్రమాలను ప్రతి జిల్లాలో ఉండేలా ప్రణాళికాబద్దంగా వ్యవవహరించారు.
వైసీపీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలను ప్రారంభించడం, నగదు బదిలీ పథకాలకు నిధుల విడుదల పేరుతో భారీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ప్రభుత్వం తరపున నిర్వహించినsa సభలు, సమావేశాల్లోనే ముఖ్యమంత్రి తన అంతరంగాన్ని ప్రజలకు వివరించే వారు. ఆ వేదికల నుంచే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే వారు. అదే సమయంలో ఐదేళ్లలో ఎవరికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఒక్క అధికారిక ప్రెస్ మీట్ కూడా నిర్వహించకుండానే ఎన్నికల కోడ్ వచ్చేసింది.
సంబంధిత కథనం