YS Jagan : ఇలాంటి ఫలితాలు ఊహించలేదు, ఉద్వేగానికి లోనైన వైఎస్ జగన్
YS Jagan : ఎన్నో సంక్షేమ పథకాలు చేశామని, అయినా ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వైఎస్ జగన్ అన్నారు. తన ప్రసంగంలో ఉద్వేగంగా మాట్లాడారు.
YS Jagan : ఏపీ ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ భావోద్వేగం లోనైయ్యారు. కన్నీళ్లు ఆపుకుంటూ జగన్ ప్రసంగించారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేశామని, అవన్నీ ఎక్కడకు వెళ్లాయో తెలియలేదన్నారు. అన్ని తట్టుకుంటాం, మళ్లీ నిలబడతామని వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టో లోని 99 శాతం హామీలు అమలు చేశామన్నారు.
ఏపీ ప్రజల తీర్పును స్వీకరిస్తున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. పడిన చోట నుంచే గుండె ధైర్యంతో మళ్లీ లేస్తామన్నారు. ఇది పెద్దవాళ్ల కూటమి అన్నారు. నా జీవితం ఎవరూ చూడని కష్టాలు, పోరాటాలు చూశానని, ఇప్పుడు అంతకన్నా కష్టాలు పెట్టినా సిద్ధంగా ఉన్నానన్నారు. అన్నింటికీ సిద్ధపడే ఉన్నానన్నారు. తనకు తోడుగా నిలబడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రసంగం మొత్తం జగన్ భావోద్వేగంతో మాట్లాడారు. ఎవరు ఏం చేసినా తమకున్న 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారని జగన్ అన్నారు. ప్రతిపక్షంలో ఉండడం తనకు కొత్త కాదని, తన రాజకీయ జీవితంలో ఎక్కువ శాతం ప్రతిపక్షంలోనే ఉన్నానన్నారు. ప్రభుత్వంలోకి వచ్చినవాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందించామని వైఎస్ జగన్ అన్నారు. గతంలో ఎప్పుడూ జరగనంత మంచి చేసినా, అన్ని వర్గాల మంచి కోసం అడుగులు వేసినా వైసీపీకి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. యాభై మూడు లక్షల మంది తల్లులకు, వాళ్ల పిల్లలు బాగుండాలని అడుగులు వేశామన్నారు. ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియలేదన్నారు. 66 లక్షల మంది అవ్వా తాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు అందించామని, వారి కష్టాన్ని అర్థం చేసుకుని ఇంటికే పింఛన్ అందించామన్నారు. ఆ అవ్వాతాతలు చూపించిన ప్రేమ ఏమైందో తెలియడం లేదన్నారు. ఇలాంటి ఫలితాల్ని అస్సలు ఊహించలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు.
సీఎంగా ఉన్నన్ని రోజులు పవన్ కల్యాణ్ పేరెత్తకుండా దత్తపుత్రుడు అని మాట్లాడిన జగన్... ఇవాళ పవన్ కల్యాణ్ గారికి అభినందనలు అని వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం