AP Opposition Party: ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీ, 11స్థానాలకే గెలుపు పరిమితం, గెలిచిన స్థానాలు ఇవే
AP Opposition Party: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. కేవలం 11 స్థానాలకే ఆ పార్టీ పరిమితం అయ్యింది.
AP Opposition Party: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడితో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప, మిగిలిన మంత్రులందరూ ఓటమి చెందారు. సిఎం జగన్మోహన్ రెడ్డికి కూడా మెజార్టీ తగ్గింది.
కోల్పోయిన ప్రతిపక్ష హోదా
రాష్ట్రంలో ఘోర పరాజయం పొందిన వైసీపీకి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాల్లోనే వైసీపీ గెలుపొందింది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ, ఇప్పుడు కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. అసెంబ్లీలో 175 సీట్లున్న అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలంటే, 1/10 వంతు సీట్లు అవసరం ఉంటుంది.
అంటే, మొత్తం సీట్లలో కనీసం 17 లేదా 18 సీట్లు రావాల్సి ఉంటుంది. కానీ వైసీపీకి అన్ని సీట్లు రాలేదు. కానీ వైసీపీకి 11 స్థానాలే వచ్చాయి. దీంతో ప్రతిపక్ష హోదాను వైసీపీ కోల్పోయింది. ఇప్పటి వరకు సభానాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాలేరు.
జగన్ కు తగ్గిన మెజారిటీ
రాష్ట్రంలో ఓటమిని చవిచూసిన వైసీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ భారీగా తగ్గింది. 2014లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి 75,243 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డిపై గెలుపొందారు.
2019 ఎన్నికల్లో మళ్లీ సతీష్ కుమార్ రెడ్డిపైనే 90,110 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డిపై 61,687 ఓట్ల మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. దీంతో గత ఎన్నికల్లో కంటే ఈసారి 28,433 ఓట్లు తగ్గాయి.
వైసీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలివే
1. పులివెందుల (వైఎస్ జగన్మోహన్ రెడ్డి)
2. బద్వేలు (దాసరి సుధ)
3. పుంగనూరు (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి)
4. మంత్రాలయం (వై.బాలనాగిరెడ్డి)
5. ఆలూలు (బూసినే విరూపాక్షి )
6. యర్రగొండపాలెం (ఎస్సీ) (తాటిపత్రి చంద్రశేఖర్)
7. అరకు (ఎస్టీ) (రేగం మత్స్యలింగం)
8. పాడేరు (ఎస్టీ) (మత్స్యరాస విశ్వేశ్వరరాజు)
9. రాజంపేట (ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి)
10. తంబళ్లపల్లి (పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి)
11. దర్శి (బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి)
( రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం