Posani Krishna Murali : పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, పోసానిపై కేసు నమోదు!
Posani Krishna Murali : వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Posani Krishna Murali : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో కేసు నమోదు అయింది. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ పార్టీ నేతలు రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ ఫిర్యాదుపై స్పందించకపోవడంతో జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. జనసేన నేతల పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు పోసానిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి పోలీసులు పోసాని కృష్ణమురళిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
పవన్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసేవారిలో వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ముందు వరుసలో ఉంటాయి. మైకు ముందుకు వచ్చారంటే పవన్ పై మాటాలు దాడి చేస్తారు. ఏలూరు వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేశారు. దీంతో పోసాని పవన్ కు కౌంటర్ ఇస్తూ... వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పదంటూ చెప్పుకొచ్చారు. వాలంటీర్లను తిడితే వారి కుటుంబ సభ్యులు బాధపడరా అని ప్రశ్నించిన ఆయన.. పవన్ పై మండిపడ్డారు. భీమవరంలో పవన్ కల్యాణ్ ఓటమికి టీడీపీనే కారణమని ఆరోపించారు. పవన్ చంద్రబాబు గుప్పిట్లో ఉన్నారని పోసాని విమర్శలు చేశారు. కాపు ఓట్ల కోసం అత్తా కోడలు పవన్ తో డ్రామా ఆడుతున్నారన్నారు. అత్త కోడలు ఇద్దరు కలిసి పవన్ ను ఐస్ చేశారని భువనేశ్వరి, బ్రాహ్మణిని ఉద్దేశించి మాట్లాడారు. గతంలో పవన్ కల్యాణ్ కుటుంబంపై పోసాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పవన్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో జనసైనికులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోసానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో కేసు నమోదు
పవన్ కల్యాణ్ పై పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పోసానిపై గతంలో రాజమండ్రికి చెందిన జనసేన నేతలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసేందుకు అంగీకరించకపోవడంతో జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో తాజాగా పోసానిపై కేసు నమోదు చేశారు. 2022లో కూడా పోసానిపై జనసేన పార్టీ రాజమహేంద్రవరం నేత యందం ఇందిరా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై అప్పట్లోనూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఇంకా విచారణలో ఉండగా, మరోసారి పోసాని దూషణలకు దిగారు.