Pawan Tour : మూడంచెల వ్యూహం...! గోదావరి జిల్లాల బాటలో పవన్-pawan kalyan godavari districts tour to start from feb 14 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Tour : మూడంచెల వ్యూహం...! గోదావరి జిల్లాల బాటలో పవన్

Pawan Tour : మూడంచెల వ్యూహం...! గోదావరి జిల్లాల బాటలో పవన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 11, 2024 10:11 AM IST

Pawan Godavari Districts Tour 2024: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు వెళ్లే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.

జనసేన అధినేత పవన్
జనసేన అధినేత పవన్ (Janasena Twitter)

Pawan Godavari Districts Tour 2024: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఓవైపు టీడీపీతో పొత్తుపై ప్రకటన చేస్తూనే…. మరోవైపు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉంటూ వచ్చారు. మొన్నటివరకు టీడీపీ - జనసేన పొత్తు మాత్రమే ఉంటుందని అంతా భావించినప్పటికీ… చంద్రబాబు ఢిల్లీ టూర్ తో మరోసారి మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై అన్ని పార్టీలవైపు నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగానే…. వచ్చే ఎన్నికల్లో(Andhra Pradesh elections 2024) మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పవన్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా తొలుత గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఫిబ్రవరి 14వ తేదీ నుంచి టూర్…

పవన్ కళ్యాణ్ (Jansena President Pawan Kalyan)ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ టూర్ సాగుతుంది. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారు. అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమవుతారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయి.

మూడంచెల వ్యూహం….

పవన్ కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని నిర్ణయించింది జనసేన పార్టీ. తొలి దశలో ముఖ్య నాయకులు, ముఖ్యులతో సమావేశాలు ఉంటాయని తెలిపింది రెండో సారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమావేశాలలో పాల్గొంటారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఎన్నికల ప్రచారం చేపట్టేనాటికి పవన్ కళ్యాణ్ మూడు సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

మరోవైపు ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్నాయి. ఇటీవలే చంద్రబాబు… బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. బయటికి అధికారికంగా వివరాలు రాకపోయినప్పటికీ…. టీడీపీ ఎన్డీయేలో చేరే అవకాశం ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే… జనసేనాని పవన్ కల్యాణ్ సోమవారం లేదా మంగళవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. టీడీపీతో పొత్తు, సీట్ల పంపకాల అంశంపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా బీజేపీ హైకమాండ్ తో చర్చించనున్నారు. ఈ భేటీలో పోటీ చేసే సీట్లపై కూడా ప్రాథమికంగా చర్చలు జరిగే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం