Pawan Kalyan : పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన, పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయవద్దని సూచన
Pawan Kalyan : పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడవద్దని కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు
Pawan Kalyan : రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు చేయొద్దని కోరారు. జన హితానికీ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దని సూచించారు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారన్నారు. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే తన రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావచ్చన్నారు. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరుతాయన్నారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవలసిందిగా ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చామని పవన్ తెలిపారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరన్నారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారన్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలను పవన్ కల్యాణ్ కోరారు. పొత్తులపై కార్యకర్తలు సంయమనం పాటించాలని, భావోద్వేగాలకు పోయి వివాదాస్పదంగా మాట్లాడవద్దని పవన్ కల్యాణ్ సూచించారు.
ఆ చెక్ లు వెనక్కి ఇచ్చేమన్న పవన్
పార్టీ కోసం పనిచేసి టిక్కెట్లు ఆశించిన వారిని కూడా సీట్ల సర్దుబాటు నేపథ్యంలో సర్దుకుపోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే ఉద్దేశంతో బీజేపీ,టీడీపీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ-బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా పవన్ కల్యాణ్ పలుమార్లు ప్రయత్నించారు. పవన్ గతంలో చేసిన ప్రయత్నాల్లో మోదీతో పాటు అమిత్‌షా, నడ్డా వంటి వారితో జరిపిన చర్చల్లో టీడీపీతో కలిసి పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీనిపై అప్పట్లో ఎలాంటి స్పందన రాలేదు.
మరోవైపు టీడీపీతో మాత్రం ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేనలో టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య పెరిగింది. ఆశావహులు టిక్కెట్ల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పార్టీకి విరాళంగా చెక్‌లు ఇచ్చి, తర్వాత మెల్లగా తమకు టికెట్ కావాలని అడుగుతుండటంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పార్టీకి విరాళాలిచ్చాం కాబట్టి తమకు టికెట్ ఇవ్వాలి’’ అంటూ ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కొందరి నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. పార్టీ నిర్వహణ కోసం గతంలో విరాళాలు ఇచ్చి.. ఆ తర్వాత రానున్న ఎన్నికల్లో టికెట్ కావాలని డిమాండ్లు తెరపైకి తీసుకు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం