పొత్తులు జనహితం కోసమా..? రాజ్యాధికారం కోసమా..?-is tdp janasena alliance for the people or the power ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  పొత్తులు జనహితం కోసమా..? రాజ్యాధికారం కోసమా..?

పొత్తులు జనహితం కోసమా..? రాజ్యాధికారం కోసమా..?

HT Telugu Desk HT Telugu
Sep 21, 2023 03:26 PM IST

‘జనసేన - టిడిపి కూటమిగా ఏర్పడింది ‘‘జనహితం కోసమా..? రాజ్యాధికారం కోసమా..?’’ జెండాలు వేరైనా, ఎజెండాలు ఒకటైనప్పుడు, ఆ ఎజెండా కూడా జనహితం కోసమైతే ప్రజలు ఆదరిస్తారు. ఈ విషయం అనేకసార్లు చరిత్రలో రుజువైంది.’ - ఏపీలో పొత్తులపై పీపుల్స్ పల్స్ రీసెర్చర్ ఐవీ మురళీకృష్ణ విశ్లేషణ.

టీడీపీ - జనసేన కూటమి పొత్తులు ప్రకటనకే పరిమితమవుతాయా?
టీడీపీ - జనసేన కూటమి పొత్తులు ప్రకటనకే పరిమితమవుతాయా? (PTI)

‘తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచింది’ అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి పరిస్థితి. అవినీతి ఆరోపణలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు పంపించిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ టిడిపితో పొత్తు ప్రకటన చేసి రాజకీయ పంచ్‌ ఇచ్చారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌ జైలు ప్రాంగణంలోనే రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని ప్రకటిస్తూనే, ఎన్‌డిఎలో తాము భాగస్వామ్యంగా ఉన్నామని, బిజెపి కూడా తమ కూటమిలో చేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

జనసేన ఎన్డీయేలో భాగస్వామ్యమై, బీజేపీతో కలిసి నడుస్తామని, ఆ పార్టీ ఇచ్చే రోడ్‌మ్యాప్‌ ద్వారా ముందుకు సాగుతామని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించి మూడు సంవత్సరాలు కావొస్తున్నా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. బిజెపి తమ రోడ్‌ మ్యాప్‌ను ఇవ్వకపోగా రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. బిజెపి కేంద్రనాయకత్వం వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తమ దత్తపుత్రుడిగా చూసుకుంటూ అన్ని విధాల సహకరిస్తున్నా ఇంకా ఆ పార్టీపైన జనసేన అధినేత ఆశలు పెట్టుకోవడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది.

జనసేన - టిడిపి కూటమిగా ఏర్పడింది ‘‘జనహితం కోసమా..? రాజ్యాధికారం కోసమా..?’’ జెండాలు వేరైనా, ఎజెండాలు ఒకటైనప్పుడు, ఆ ఎజెండా కూడా జనహితం కోసమైతే ప్రజలు ఆదరిస్తారు. ఈ విషయం అనేకసార్లు చరిత్రలో రుజువైంది.

అధికారం కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమే కాకుండా, నాలుగున్నర సంవత్సరాల వైఎస్‌ఆర్‌సిపి పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం, కక్ష సాధింపు చర్యలు చేపట్టడం వంటి చర్యలను అడ్డుకోవడం కోసమే పొత్తులు పెట్టుకుంటున్నామని జనసేన పార్టీ అధినేత సెప్టెంబర్‌ 14 వ తేదీన రాజమహేంద్రవరంలో, మంగళగిరిలో సెప్టెంబర్‌ 16వ తేదీన జనసేన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో స్పష్టతనిచ్చారు. దీనికి కొనసాగింపుగా ఈ కూటమి ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతలను మాజీ అసెంబ్లీ స్పీకర్‌, జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. ఈ ప్రకటనలతో కూటమి లక్ష్యంపై ఆయనకున్న స్పష్టత ఉన్నట్లు అర్థమౌతోంది.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో కంగుతిన్న ఆ పార్టీ నాయకత్వం ఇంకా కోలుకున్నట్లు కనబడటం లేదు. దానికి నిదర్శనం కూటమిలో పెద్దపార్టీగా ఉన్న టిడిపి మాత్రం ఈ కూటమి లక్ష్యంపై ఇంకా స్పష్టతనివ్వలేదు. జనసేనాని కూటమిపై ముందడుగులు వేస్తున్నా పెద్దన్న పాత్ర పోషించాల్సిన టిడిపి మాత్రం ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసుకోవాల్సిన కమిటీని ఇప్పటి వరకు నియమించుకోలేదు.

ప్రకటనలకే పరిమితమా?

‘‘ఇల్లు అలకగానే పండుగ వచ్చినట్లు కాదు’’ కేవలం కూటమిగా ఏర్పడ్డామని ప్రకటనలు చేసినంత మాత్రాన ఆశించిన ఫలితం రాదు. ఆ కూటమి చేపట్టే రాజకీయ కార్యాచరణపై, ప్రజలకు తాము ఇచ్చే ఎజెండాపై ప్రజలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలలు మించి సమయం లేని ప్రస్తుత దశలో జనసేన టిడిపితో పొత్తు అంశం కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందా..? లేక ఆచరణలో ముందడుగు వేస్తారా..? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉభయ పార్టీలు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి. జనసేన, టిడిపి అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలంటే కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన కామన్‌ మినిమన్‌ ప్రోగ్రామ్‌ (సిఎంపి)తో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

కూటమి లక్ష్యం నెరవేరాలంటే ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? వారి ఆకాంక్షలు ఏమిటి? ముందుగా తెలుసుకొని అందుకు అనుగుణంగా కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌ (సిఎంపి) రూపొందించుకొని ప్రజలు ముందుకు వెళ్ళాలి. ఈ ‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామే’ రాబోయే ఎన్నికల్లో కీలకం అవడంతోపాటు ఇరు పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాన ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ, అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి కూడా ఆగిపోతుందని చెప్పటం లేదంటే రాష్ట్ర అభివృద్ధి అంశంపై ఆ పార్టీ ఆశలు పెట్టుకోలేదని స్పష్టమవుతోంది. దీన్ని టిడిపి - జనసేన కూటమి అందిపుచ్చుకొని పథకాలతో సరిపెట్టుకోకుండా రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడుతుందో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌ (సిఎంపి)లో పొందుపరిస్తే కచ్చితంగా ప్రజల్లో ఆదరణ లభిస్తుంది.

కూటమికి పెద్ద సవాలే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి నేతలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ధనికులకు పేదలకు మధ్య ‘క్లాస్‌వార్‌’ అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలను తిప్పి కొట్టడం జనసేన-టిడిపి కూటమికి పెద్ద సవాలే. ఈ ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోవాలంటే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పథకాల కంటే మెరుగైన సంక్షేమ పథకాలను అందిస్తామనే భరోసాను కల్పిస్తేనే ప్రజలు కూటమిని ఆదరిస్తారు, పట్టం కడతారు.

జనసేన-టిడిపి ఎజెండాలో (సిఎంపి) సంక్షేమ కార్యక్రమాలతోపాటు, రాష్ట్రాభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సకల జనులు ఆకాంక్షలేమిటి? వారు ఏం కోరుకుంటున్నారు? తదితర అంశాలపై అధ్యయనం జరగాలి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సకలజనులు కోరుకుంటున్నది సంక్షేమంతోపాటు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం, నవరత్నాల పేరుతో వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోంది. ఇలాంటి సంక్షేమ పథకాలనే జనసేన- టిడిపి కూటమి కూడా తమ కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌ (సిఎంపి)లో ప్రకటిస్తే ప్రస్తుత ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా, అభివృద్ధికి కూడా సమప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమ పథకాల అమలు కూడా మరింత మెరుగ్గా అందిస్తేనే ప్రజలు కూటమిని ఆదరిస్తారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సకలజనులు ‘‘ప్రతీ చేతికి పని - ప్రతీ చేనుకు నీరు’’ కోరుకుంటున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలని, తమ ప్రాంతంలోనే తమకు ఉపాధి కల్పించాలని, కులవృత్తులను పరిరక్షించాలని, ప్రకృతి వనరులను కాపాడాలని, గ్రామాల్లో స్వయం పరిపాలన రావాలని, రోడ్లకు మరమ్మతులు చేయాలని, వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని కోరుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తేవాలని, ప్రజల మానప్రాణాలకు రక్షణ కల్పించాలని, ముఖం చూసి బొట్టు పెట్టే విధానానికి స్వస్తి పలికి అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని, కేంద్రీకృత అభివృద్ధి కాకుండా, వికేంద్రీకరణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తున్నారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ప్లాన్‌నిధులను ఆ వర్గాలకే ఖర్చు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వాలని, జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ప్రతీ సంవత్సరం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

నదుల అనుసంధానం చేస్తూనే పెండిరగ్‌లో వున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పారదర్శకత జవాబుదారీతనంతో పాలన చేయాలని సకల జనులు కోరుకుంటున్నారు. ఈ ప్రధాన అంశాలపై జనసేన - టిడిపి కూటమి ప్రత్యేకదృష్టి పెట్టి తమ కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం (సిఎంపి)లో పొందుపరిచి ప్రజల ముందుకు వెళితే ఈ కూటమిని సకల జనులు ఆదరిస్తారు.

జనసేన - టిడిపి అగ్రనేతలు ఇప్పటికే వివిధ సందర్భాల్లో పలు హామీలిచ్చారు. వీటిని ‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం’ (సిఎంపి)లో చేర్చడంతోపాటు వీటి సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయాలి. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బయట నుంచి ఎన్ని ప్రకటనలు చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ అధికారంలోకి వచ్చాక బాధ్యత పెరుగుతుంది. జనసేన - టిడిపి కూటమి పగ్గాలు చేపడితే ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉంటుంది. దీనికి జనసేన -టిడిపి అగ్రనేతలు జవాబుదారిగా ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌లో (సిఎంపి) చేర్చే ప్రతీ ఒక్క అంశంపై నిశితంగా అధ్యయనం చేయాలి.

వారాహియాత్ర, జనవాణి కార్యక్రమం సందర్భంగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ప్రజలకు వివిధ హామీలిచ్చారు. దీంతోపాటు జనసేన షణ్ముక వ్యూహంతో ముందుకు వెళ్తామని ప్రజలకు వాగ్ధానం చేసింది. షణ్ముక వ్యూహంలో పొందుపరిచిన సంపన్న ఆంధ్రప్రదేశ్‌, అమరావతి రాజధాని, అల్పాదాయవర్గాల వారి ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక, జనసేన సౌభాగ్యపదం, వ్యవసాయం - బంగారు ఫలసాయం, మన ఆంధ్రప్రదేశ్‌ - మన ఉద్యోగాలు తదితర ఆరు అంశాల అమలుపై కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌ (సిఎంపి)లో స్పష్టతనివ్వాలి.

టిడిపి మినీ మహానాడు సందర్భంగా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన యువతకు అండగా ‘యువగళం’, రైతన్నకు భరోసాగా ‘అన్నదాత’, మహిళాసాధికారతకు ‘మహాశక్తి’, ‘ఇంటింటికీ నీరు’, బీసీలకు ‘రక్షణ చట్టం’, పేదలను ధనికులుగా మార్చేందుకు ‘పూర్‌ టు రిచ్‌’ వంటి పథకాలను ప్రకటించారు. టిడిపి యువనేత నారా లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన పలు డిక్లరేషన్ల అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌ (సిఎంపి)లో చేర్చాలి.

జనసేన - టిడిపి కూటమితో సోషలిజం వస్తుందని ప్రజలేమీ భ్రమపడడంలేదు. ఈ కూటమి కల్పించే భరోసాపైనే మనుగడ ఆధారపడి ఉంటుంది. మాట్లాడే హక్కు, గొంతెత్తే హక్కు, గాలిపీల్చే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడటం, రాగద్వేషాలకు అతీతంగా సామాజిక న్యాయం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వీటిని కల్పిస్తామనే భరోసాను కూటమి నేతలు అందిస్తేనే ప్రజాస్వామ్యవాదులు, తటస్థులు వీరిపట్ల ఆకర్షితులవుతారు.

ఆ హామీల జాడ లేదు

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, విభజన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాలైనా నెరవేర్చలేదని, రాష్ట్రానికి బిజెపి తీరని అన్యాయం చేస్తుందనే భావన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో నెలకొంది. ఈ భావనను తొలగించడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి నేతల బలహీనతలను, వారిపై ఉన్న కేసులను అడ్డం పెట్టుకుని రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజల మద్దతు లేకుండా నోటాతో పోటీ పడుతున్న బిజెపి పట్ల అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతున్నారు. వీటిని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తగిన సమయంలో ప్రజలు వీరికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

విభజన సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపు తదితర అంశాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. అయినా రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంట్‌ సభ్యుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, రాష్ట్రహక్కుల గురించి పోరాడటం లేదు.

ఈశాన్య రాష్ట్రాలు అధికారంలో ఉన్న పార్టీలు, కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తుతున్నాయనే విధంగానే ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంతో పాటు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా ఆ బాటలోనే నడుస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి, జనసేన పార్టీలను వంగమంటే, సాగిలపడే విధంగా వ్యవహరిస్తూ ఢిల్లీ నేతల పాదాల వద్ద రాష్ట్ర హక్కులను పణంగా పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన బిజెపితో జతకట్టడానికి పాకులాడితే కూటమి విశ్వసనీయతపై విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు అనుమానాలొచ్చే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగిందనే అభిప్రాయం రాష్ట్రంలో సర్వత్రా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ మొదలుకొని కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ అన్యాయం జరిగిందంటారే కానీ న్యాయం చేయడానికి మాత్రం ముందుకు రారనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ వెనుకబాటుకు రాష్ట్ర ప్రభుత్వం కారణమని కేంద్రం అంటే, కేంద్రం వివక్ష కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకుంటూ రాజకీయం పబ్బం గడుపుకుంటారు కానీ, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడం లేదని ప్రజలు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాల అవసరం ఎంతైనా ఉంది. కేంద్రంతో ఘర్షణ పడకుండా రాష్ట్రాభివృద్ధికి నిధులు ఎలా తీసుకొస్తారో, విభజన హామీలను ఏవిధంగా సాధిస్తారో ‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం’లో స్పష్టంగా జనసేన -టిడిపి కూటమి చెప్పి ప్రజలను ఒప్పించాలి.

జనసేన - టిడిపి కూటమి నేతలు పలుసందర్భాల్లో తాము అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్‌ఆర్‌సిపి నేతలపై, ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికార యంత్రాంగానికి తగిన గుణపాఠం చెబుతామని, వడ్డీతో సహా వారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకటన కూటమికి మేలు కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది. ఈ విషయాన్ని కూటమి నాయకులు విజ్ఞతతో గ్రహించాలి. వైఎస్‌ఆర్‌సిపి ప్రజాస్వామ్యబద్దంగా పాలన కొనసాగించడం లేదని, కక్ష్యలకు, ప్రతీకారాలకు పాల్పడుతున్నందుకు నిరసనగానే రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధపడుతున్నారు. అదేబాటలో జనసేన, టిడిపి కూటమి కూడా నడవాలనుకుంటే ఈ కూటమికి ఎందుకు పట్టంగట్టాలని సామాన్యులతోపాటు ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు. జనసేన-టిడిపి కూటమి అధికారంలోకి రావడం, కక్షసాధింపు చర్యలు తీసుకోవడం వంటివి కాకుండా జనహిత ఎజెండా లక్ష్యంగా ముందుకెళ్తే ప్రజలు ఆదరిస్తారు.

‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం’ (సిఎంపి)లో జనహిత ఎజెండా రూపకల్పనలో ప్రజలు, మేధావుల, రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వివిధ సంఘాలు, సమూహాల నుండి అభిప్రాయాలను సేకరించి వాటిని తమ ఎజెండాలో చేర్చుకోవాలి.

‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామే’ (సిఎంపి) కాకుండా ‘కామన్‌ పొలిటికల్‌ ప్లాట్‌ఫారం’ విస్తృత పరిచి భావసారూప్యం గల అన్ని రాజకీయ పార్టీలను, సమూహాలను, ప్రజాసంఘాలను, ప్రజాస్వామ్యవాదులను కలుపుకొని ఒక వేదిక మీదకు తీసుకొస్తే జనసేన`టిడిపి ప్రకటిస్తున్న జనహిత ఎజెండాపై ప్రజలకు సానుకూలమైన విశ్వాసం ఏర్పడుతుంది.

జగన్‌ సర్కారు స్వయంకృపరాధంతో ఇచ్చిన అవకాశంతో కూటమిగా ఏర్పడిన జనసేన-టిడిపి పార్టీలు జనహిత ఎజెండాతో ప్రజాస్వామ్యవాదులను కలుపుకొని ముందుకెళ్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అంతేకాని జగన్‌ను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాజ్యాధికారం ఎజెండాతో మాత్రమే ముందుకెళ్తే ఈ కూటమి లక్ష్యం విఫలమవుతుంది. దీనికి కూటమిలోని నేతలే పూర్తిబాధ్యత వహించాల్సి ఉంటుంది.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్
ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణ వ్యాసకర్త వ్యక్తిగతం లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థకు చెందినవి. హెచ్‌టీ తెలుగువి కావు.)

Whats_app_banner