CBN Government : నెల రోజుల చంద్రబాబు పాలన...! ఇప్పటివరకు ఏం చేశారు...?
ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని ఏన్డీయే ప్రభుత్వం జులై 12వ తేదీతో నెల రోజులు పూర్తి చేసుకుంది. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులను పట్టాలెక్కించే దిశగా దిశగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి… జులై 12వ తేదీతో నెల రోజులు పూర్తి అయింది. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని పట్టాలెక్కించే దిశగా ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.
ఐదు ఫైళ్లపై సంతకంతో మొదలు….
అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు… ఐదు కీలక ఫైళ్లపై సంతకం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం పెట్టారు. ల్యాండ్ టైటిల్లింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణతో పాటు మరో ఫైల్ పై చంద్రబాబు సంతకం చేశారు.
ఇక చంద్రబాబు నేృత్వంలోని మంత్రివర్గం తొలిసారిగా జూన్ 24వ తేదీన భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పెన్షన్లు 3వేల నుంచి రూ. 4వేలకు పెంపు, వృద్ధులకు రూ. 6వేలు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది.
రాజధాని పనులు….
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అమరావతి ప్రాంతంలో మళ్లీ పనులు మొదలయ్యాయి. ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసే విషయంపై చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించారు. అమరావతి ప్రాంతంలోని నిర్మాణాలను పరిశీలించటంతో పాటు సుదీర్ఘ సమీక్ష కూడా నిర్వహించారు.
అమరావతిలో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు వివిధ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సీఎం చంద్రబాబు చర్చించారు. రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రుణాల ప్రతిపాదనను పునరుద్ధరించేందుకు ప్రపంచ బ్యాంకు అధికారులతో ప్రాథమికంగా చర్చలు జరిపారు.
పోలవరం పర్యటన….
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టుపై కార్యకలాపాలను త్వరితగతిన పూర్తి చేసే విషయంపై దృష్టిపెట్టారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పర్యవేక్షించారు. ప్రాజెక్టులోని నష్టాలను అంచనా వేయటంతో పాటు పరిష్కారం మార్గాలను సూచించేందుకు ఇటీవలే అమెరికాతో పాటు కెనడా నుంచి అంతర్జాతీయ నిపుణులు వచ్చారు.
శ్వేతపత్రాలు…..
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు… అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వివిధ రంగాల స్థితిగతులను ప్రజల ముందు ఉచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలవరం, అమరావతి, రాష్ట్ర విద్యుత్ సంక్షోభంపై ఆయన శ్వేతపత్రాలు విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై తదుపరి శ్వేతపత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు.
ఇటీవలే కొద్దిరోజుల కిందట ఢిల్లీలో పర్యటించారు సీఎం చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తక్షణ ఆర్థిక సాయం కోరడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు.
వివిధ పారిశ్రామికవేత్తలతో పాటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చలు జరిపారు. ర. 60,000 కోట్ల పెట్టుబడితో పెట్రోల్ రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆటోమొబైల్ కంపెనీ విన్‌ఫాస్ట్‌తో కూడా చర్చలు జరిగాయి. రాష్ట్రంలో మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు కు ప్రయత్నాలు షురూ చేశారు.
విభజన సమస్యలపై ఫోకస్
ఓవైపు రాష్ట్రంలోని సమస్యలపై దృష్టిసారిస్తూనే… మరోవైపు విభజన సమస్యలపై దృష్టిపెట్టారు చంద్రబాబు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ కూడా రాశారు. దీనికి తెలంగాణ సీఎం కూడా సముఖత వ్యక్తం చేయటంతో హైదరాబాద్ వేదికగా ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీలో నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పరిశీలించటంతో పాటు పనుల పూర్తిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… కీలకంగా పని చేస్తున్నారు. నిత్యం సమీక్షలు చేస్తూ… తక్షణం చేపట్టాల్సిన పనులపై ఫోకస్ చేసే పనిలో పడ్డారు. మిగతా మంత్రులు కూడా తమ శాఖల తరపున చేసే పనులపై ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా… గత ప్రభుత్వం చోటు చేసుకున్న తప్పిదాలను వెలకి తీసే ప్రయత్నాలు కూడా ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది. ఇందులో భాగంగా… పలువురు అధికారులపై విచారణ కూడా ప్రారంభించే పనిలో పడింది.
రాజకీయ దాడులు, విగ్రహాల ధ్వంసం….
ఏపీలో కూటమి అధికారంలోకి రావటంతో రాజకీయ దాడులు పెరిగిపోయాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతన్నారని అంటున్నారు. వైసీపీ నేతలపై దాడులు చేయటంతో పాటు వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు నెల రోజుల పాలపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ…. చంద్రబాబువి అన్ని మోసపూరితమైన నిర్ణయాలు అని ఆరోపించారు. 30 రోజుల పాలనలోనే అదే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు .“ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. ఓవైపు భారీ ఎత్తున అప్పులు తీసుకుంటూ సంపద సృష్టించడం అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు, రాష్ట్రాన్ని అత్యంత అప్పులపాలు చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పుడు లెక్కలతో శ్వేతపత్రాలు విడుదల చేయడానికే ఆయన 30 రోజుల పాలన గడిపారు" అని దుయ్యబట్టారు.
తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు ఇంకా అమలు చేయడం ప్రారంభించలేదని పేర్ని నాని అన్నారు. 2014, 2024లో విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోలన్నీ మోసం, మోసంతో నిండిపోయాయని కామెంట్స్ చేశారు. గతంలోనూ చంద్రబాబు…. 600 హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.
చంద్రబాబు నెల రోజుల పాలనపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మల్లు రాజేష్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడిన మొదటి 30 రోజుల్లో పనితీరును అంచనా వేయడం చాలా తొందరపాటు చర్య అని అభిప్రాయపడ్డారు. “కానీ చంద్రబాబుతో పాటు ఆయన టీమ్… ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవటంతో పాటు సరైన దిశలో వెళ్తున్నట్లే కనిపిస్తోంది. ఈ ముద్ర ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి” అని ఓ మాటలో చెప్పారు.