CM Chandrababu : తక్షణమే రోడ్ల మరమ్మతు పనులు చేపట్టండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు
CM Chandrababu Review On Roads: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
CM Chandrababu Review On Roads: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, దీంతో వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చే పనులు మొదలుకావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు.
సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖపై శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు. నాడు రోడ్ల మరమ్మతులపై కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదని సీఎంకు అధికారులు తెలిపారు.
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. దీంతో కాంట్రాక్టర్లు కూడా నేడు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై పాత్ హోల్స్ (గుంతలు) సమస్య ఉందని అధికారులు వివరించారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయని సీఎంకు తెలిపారు.
మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిథిలో తక్షణం పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. వీటి కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరం అని తెలిపారు. పాత్ హోల్స్ పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైనా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు.
సాంకేతిక అంశాలపై నిపుణులతో చర్చ
రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
తక్కువ ఖర్చుతో, మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధనల వివరాలను సమీక్షలో ముఖ్యమంత్రికి తెలిపారు. సాంప్రదాయ పద్దతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై చర్చించారు.
నేల తీరు, ట్రాఫిక్ రద్దీ, వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. వర్షాకాలంలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే సాంకేతికపైనా నిపుణులు సాధ్యాసాధ్యాలను వివరించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు పాల్గొన్నారు.
ఏపీకి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. రాష్ట్రానికి పెట్టబడులు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్‌లో ఆయన పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, సీఐఐ సభ్యులతో సమావేశమయ్యారు.
త్వరలోే పాలసీ - మంత్రి టీజీ భరత్
ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరినట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ముందుంటామన్నారు. వ్యాపారాన్ని సులభతరం చేయడం ( ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ) పై త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి పాలసీని తయారుచేస్తామని మంత్రి టి.జి భరత్ అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాకనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు.