YS Sharmila : వైసీపీకి వైఎస్ఆర్‌కు సంబంధం లేదు.. ఇకపై అలా చేస్తే ఊరుకోను - వైఎస్ షర్మిల వార్నింగ్-ys sharmila serious warning to tdp leaders over attacks on ysr statues ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila : వైసీపీకి వైఎస్ఆర్‌కు సంబంధం లేదు.. ఇకపై అలా చేస్తే ఊరుకోను - వైఎస్ షర్మిల వార్నింగ్

YS Sharmila : వైసీపీకి వైఎస్ఆర్‌కు సంబంధం లేదు.. ఇకపై అలా చేస్తే ఊరుకోను - వైఎస్ షర్మిల వార్నింగ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 13, 2024 07:24 AM IST

వైసీపీకి వైఎస్ఆర్‌కి సంబంధం లేదని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తిలేదంటూ టీడీపీ కార్యకర్తలను హెచ్చరించారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

వైఎస్ విగ్రహాలపై దాడులు చేయటాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె…..తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని స్పష్టం చేశారు.

వైసీపీకి రాజశేఖర్ రెడ్డికి సంబంధం లేదని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తిలేదని వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇదే తన హెచ్చరిక అన్నారు.

మరోమారు ఇలాంటి సంఘటనలు జరిగితే అక్కడే భైఠాయించి ధర్నా చేస్తానని షర్మిల చెప్పారు. ఇలాంటి హత్య, కక్ష, గుండా రాజకీయాలు వైసీపీ చేసిందనే ప్రజలు ఘోరంగా వైసీపీని ఓడించారని గుర్తు చేశారు. మళ్లీ అదే పరిస్థితి రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీపై షర్మిల ఫైర్….

రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి రోజున జగన్ ఏమి చేశారు? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద కూడా ఐదు నిముషాలు మాత్రమే ఉన్నారని అన్నారు. వందల కోట్లు సిద్ధం సభలకు ఖర్చుపెట్టిన మీరు వైఎస్ఆర్ జయంతికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలి అని డిమాండ్ చేశారు. కనీసం ఒక సభ పెట్టి ఆయనకు నివాళి అర్పించలేకపోయారని దుయ్యబట్టారు. కనీసం వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏం చేశారని నిలదీశారు. ‘‘మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు’’ ? అంటూ సూటిగా ప్రశ్నించారు.