Biryani Offer : 3 రూపాయలకే బిర్యానీ, నిర్వాహకులకు చుక్కలు చూపించిన జనం!
Biryani Offer : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొత్త ప్రారంభమైన ఓ హోటల్ రూ.3 బిర్యానీ అని ప్రకటించింది. దీంతో వేల సంఖ్యలో కస్టమర్లు హోటల్ ముందు క్యూకట్టారు. జనం తాకిడిని ఊహించిన నిర్వాహకులు ప్రత్యేక క్యూలైన్లు, సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మూడు గంటలే ఆఫర్ పెట్టడంతో బిర్యానీ ప్రియులు నిరాశచెందారు.
తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీకి యమా క్రేజ్ ఉంటుంది. ఏ రెస్టారెంట్ అయినా బిర్యానీ క్షణాల్లో ఖాళీ అవుతుంది. ఇక కాస్త పేరున్న రెస్టారెంట్లలో అయితే బిర్యానీ కోసం కస్టమర్ల క్యూ కడతారు. ఏకంగా లైన్లలో నిలబడి బిర్యానీ కొనుగోలు చేస్తారు. ఇక వీకెండ్ డేస్ అయితే ప్రధాన నగరాలతో పాటు పట్టణాల్లో రెస్టారెంట్లు కిటకిటలాడతాయి. ఇక కొత్తగా హోటల్ ప్రారంభించే సమయంలో ఆఫర్లు పెట్టడం సహాజం. భోజన ప్రియులను ఆకర్షించేందుకు ఒక్క రూపాయికే ఆహారం అంటూ ఆఫర్లు పెడుతుంటారు. ఏలూరు జిల్లాలోని ఓ హోటల్ నిర్వాహకులు ఇలాంటి ఆఫర్ పెట్టారు. ఇంకేముంది జనం తండోప తండాలుగా హోటల్ ముందు క్యూకట్టారు. క్యూలైన్లలో కాసేపు ఘర్షణ సైతం నెలకొంది.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొత్తగా ప్రారంభమైన ఓ రెస్టారెంట్ బిర్యానీపై బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ గురించి తెలుసుకున్న బిర్యానీ ప్రియులు హోటల్ ముందు క్యూ కట్టారు. అయితే నిర్వాహకులు మాత్రం ఓ కండీషన్ పెట్టారు. కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఈ ఆఫర్ చెప్పడంతో జనం కిక్కిరిసిపోయారు. రూ.3 బిర్యానీ అని ప్రకటించడంతో జనం పోటెత్తారు. బిర్యానీ జనం ఎగబడడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్ లలో తోపులాట జరగకుండా సెక్యూరిటీని సైతం నియమించారు.
జంగారెడ్డిగూడెంలో కొత్తగా ప్రారంభించిన అన్ లిమిటెడ్ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ ఆఫర్ పెట్టారు. వీరికి ఇప్పటికే భీమడోలు, తాడేపల్లిగూడెంలో రెస్టారెంట్లు ఉన్నాయి. వ్యాపార అభివృద్ధిలో భాగంగా తాజాగా జంగారెడ్డిగూడెంలో కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.3 లకే బిర్యానీ అని ప్రకటించారు. చుట్టుపక్కల గ్రామాల్లో గత వారం రోజులుగా ప్రచారం చేయించారు. అసలే బిర్యానీ, పైగా రూ.3 లకే అనడంతో... భోజన ప్రియులు ఎగబడ్డారు.
జనం తాకిడిని ముందుగానే అంచనా వేసిన హోటల్ నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కస్టమర్ల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్ లో వచ్చి రూ.3 చెల్లిస్తే వారికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు. అయితే క్యూ లైన్ లో తోపులాట, ఘర్షణలు జరిగి అవకాశం ఉందని ప్రైవేట్ సెక్యూరిటీని సైతం ఏర్పాటు చేసింది. అంతా బాగానే ఉన్నా ఈ ఆఫర్ కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే మూడు మాత్రమే ఉండడంతో ముందుగా వెళ్లిన వారికి బిర్యానీ దొరికింది. బిర్యానీ కోసం ఆశగా వచ్చిన చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. సుమారు నాలుగైదు వేల మంది ఈ ఆఫర్ ను వినియోగించుకున్నట్లు రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు.
సంబంధిత కథనం