Eluru Hostel Warden: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్‌ల పేరుతో బాలికలపై లైంగిక వేధింపులు-a hostel warden in eluru misbehaves sexual harassment of girls in the name of photo shoots ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Eluru Hostel Warden: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్‌ల పేరుతో బాలికలపై లైంగిక వేధింపులు

Eluru Hostel Warden: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్‌ల పేరుతో బాలికలపై లైంగిక వేధింపులు

HT Telugu Desk HT Telugu
Sep 18, 2024 08:40 AM IST

Eluru Hostel Warden: ఏలూరు జిల్లాలో దారుణ సంఘ‌ట‌న వెలుగుచూసింది. హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న బాలికల్ని పోటోషూట్ పేరుతో ఎరవేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న వైనం బయటపడింది. నిందితుడి వేధింపులు తాళలేక విద్యార్థినులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

హాస్టల్ వార్డెన్ వేధింపులపై పోలీసుల్ని ఆశ్రయించిన బాలికలు
హాస్టల్ వార్డెన్ వేధింపులపై పోలీసుల్ని ఆశ్రయించిన బాలికలు

Eluru Hostel Warden: ఏలూరు జిల్లా కేంద్రంలోని అమీనాపేట‌లో శ్రీ స్వామి స‌రస్వ‌తి సేవా ఆశ్ర‌మం పేరుతో బాలిక వ‌స‌తి గృహం ఉంది. ఇందులో 50 మంది బాలికలు వ‌స‌తి పొందుతూ వేర్వేరు విద్యా సంస్థ‌ల్లో చ‌దువుకుంటున్నారు. క‌రోనా స‌మ‌యంలో ఆశ్ర‌మ నిర్వాహ‌కులు హాస్టల్ నిర్వహణను ప‌ట్టించుకోక‌ పోవ‌డంతో ఏలూరుకి చెందిన శ‌శికుమార్ దానిని చేజిక్కించుకున్నాడు. శశికుమార్‌ చింత‌ల‌పూడి మండ‌లం య‌ర్ర‌గుంట‌ప‌ల్లిలోని ప్ర‌భుత్వ బీసీ వ‌స‌తి గృహం వార్డెగా పనిచేస్తున్నాడు.

శశికుమార్‌ ఏలూరు న‌గ‌రంలోని ఎన్ఆర్ పేట‌లో జ‌డ్పీ కూడ‌లిలో మ‌ణిఫొటో స్టూడియో సైతం న‌డుపుతున్నాడు. అమీనాపేటలో ఉన్న వ‌స‌తి గృహానికి వార్డెన్‌గా త‌న రెండో భార్య మ‌ణిశ్రీని, విద్యార్థినుల సంర‌క్ష‌కురాలిగా మేన‌కోడ‌లు లావ‌ణ్య‌ని నియమించాడు. హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న బాలికల్ని ఫొటోషూట్‌ పేరుతో మాయ‌ మాట‌లు చెప్పి లోబ‌ర్చుకునేవాడు.

ఫొటో షూట్‌ల కోస‌మ‌ంటూ శ‌శికుమార్ బాలిక‌ల్ని దూర ప్రాంతాల‌కు తీసుకెళ్తాడ‌ని, అక్క‌డ వారిపై అఘాయిత్యానికి పాల్ప‌డ‌తాడ‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. అడ్డు చెబితే ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడ‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఏలూరులో ఇత‌ర ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌కు వ‌చ్చే బాలిక‌ల‌ను ఈ సేవాశ్ర‌మానికి పంపాలంటూ శ‌శికుమార్ ఆయా హాస్ట‌ళ్ల వార్డెన్ల‌ను కోరుతాడ‌ని, ఆయ‌న కోరిక మేర‌కు ఆ హాస్ట‌ళ్ల వార్డెన్లు బాలిక‌ల‌ను ఇక్క‌డ‌కు పంపుతార‌ని తెలిపారు.

వసతి గృహంలో తమను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసేవాడ‌ని, అడ్డుచెబితే దాడికి పాల్ప‌డేవాడ‌ని పోలీస్ స్టేషన్‌ వద్ద బాధితులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. ప‌దుల సంఖ్య‌లో బాలిక‌ల‌ను లైంగికంగా వేధించిన‌ట్లు బాధిత బాలిక‌లు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఫొటోషూట్ అంటూ ఈనెల 15 ఆదివారం ఓ బాలిక‌ను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకెళ్లాడ‌ని, అక్క‌డ ఆమెపై అత్యాచారం చేసి 16వ తేదీ సోమ‌వారం రాత్రి తిరిగి తీసుకొచ్చి వ‌స‌తిగృహంలో దింపేశాడు. రాత్రి స‌మ‌యంలో ఆ బాలిక త‌న దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండ‌గా మిగిలిన బాలిక‌లు ప్ర‌శ్నించారు.

దీంతో జ‌రిగిన దారుణాన్ని ఆమె వారికి చెప్పింది. అదే స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన శ‌శికుమార్ జ‌రిగిందంతా ఆ బాలిక స‌హచ‌రుల‌కు విషయం చెప్పింద‌నే అక్క‌సుతో అక్క‌డ ఉన్న బాలిక‌ల‌ను అంద‌ర‌నీ మోకాళ్ల‌పై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు.

వార్డెన్‌ ఆగ‌డాల‌ను భ‌రించ‌లేని ముగ్గురు బాలిక‌లు మంగ‌ళ‌వారం రాత్రి టూ టౌన్ పోలీస్‌స్టేష‌న్‌ను ఆశ్ర‌యించారు. బాధిత బాలిక‌ల బంధువులు, త‌ల్లిదండ్రులు కూడా పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకోవ‌టంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఏలూరు డీఎస్పీ శ్రావ‌ణ్ కుమార్ వ‌స‌తిగృహాన్ని ప‌రిశీలించారు. బాలిక‌ల వాంగ్మూలాలు న‌మోదు చేశారు.

బాలికల నుంచి సమాచారం సేకరించినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితుడు, ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన వారిపై పోక్సో చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేస్తామ‌ని అన్నారు. ఏలూరు మ‌హిళా స్టేష‌న్ సీఐ ఎం. సుబ్బారావు, ఏలూరు టూ టౌన్ సీఐ వైవీ ర‌మ‌ణ‌, బాల‌ల సంర‌క్ష‌ణ అధికారి సూర్య‌చ‌క్ర‌వేని ఆధ్వ‌ర్యంలో విచార‌ణ చేప‌ట్టారు. ప్ర‌స్తుతం నిందితుడు శశికుమార్‌ ప‌రారీలో ఉన్నాడు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner