Shanagala pulao: శనగలతో పులావ్ చేయండి, బిర్యానీ కన్నా బాగుంటుంది-high protein dinner recipe chick pea pulao with perfect measurements ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shanagala Pulao: శనగలతో పులావ్ చేయండి, బిర్యానీ కన్నా బాగుంటుంది

Shanagala pulao: శనగలతో పులావ్ చేయండి, బిర్యానీ కన్నా బాగుంటుంది

Shanagala pulao: శనగలతో చేసే పులావ్ రుచి బిర్యానీ కన్నా బాగుంటుంది. ఈ హై ప్రొటీన్ డిన్నర్ లేదా లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేయడమూ సులువే. రెసిపీ ఎలాగో చూసేయండి.

శనగల పులావ్

శనగలతో సలాడ్, కూరలే కాదు టేస్టీ పులావ్ చేసుకోవచ్చు. దీనికోసం కాబూలీ శనగలు లేదా నల్ల శనగల్ని వాడొచ్చు. ఏవి వాడినా రుచి బాగుంటుంది. మసాలాలలో ఉడికిన శనగలు తింటున్నప్పుడు రుచిగా అనిపిస్తాయి. ఈ సింపుల్ రెసిపీ మిగిలిన అన్నంతో చేసుకోవచ్చు. లేదా బాస్మతీ బియ్యంతో అప్పటికప్పుడు చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.

శనగల పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

సగం కప్పు శనగలు

1 కప్పు బాస్మతీ బియ్యం

1 ఉల్లిపాయ, పొడవాటి ముక్కల తరుగు

1 టమాటా, ముక్కలు

1 బంగాళదుంప

2 యాలకులు

1 బిర్యానీ ఆకు

2 లవంగాలు

అంగుళం దాల్చిన చెక్క ముక్క

సగం చెంచా కారం

సగం చెంచా గరం మసాలా

అర టీస్పూన్ పసుపు

అరచెక్క నిమ్మరసం

3 చెంచాల నెయ్యి లేదా నూనె

గుప్పెడు పుదీనా

గుప్పెడు కొత్తిమీర తరుగు

మసాలా కోసం:

అల్లం తరుగు

4 వెల్లుల్లి రెబ్బలు

పుదీనా

కొత్తిమీర

1 పచ్చిమిర్చి

శనగల పులావ్ తయారీ విధానం:

  1. ముందుగా శనగల్ని ఒక పూటంతా లేదా కనీసం ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి.
  2. నీళ్లు వంపేసి సగం కప్పుకు రెండున్నర కప్పుల నీళ్లు పోసుకుని, కాస్త ఉప్పు వేసి ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. అవి బాగా మెత్తబడాలి.
  3. బియ్యం కూడా కడిగి అరగంట నానబెట్టుకోండి.
  4. ఇప్పుడు పులావ్ కోసం మసాలా చేసుకుంటే రుచి పెరుగుతుంది. ఇది చేయకపోయినా పర్వాలేదు. దీనికోసం మసాలా కోసం అని చెప్పిన పదార్థాలన్నీ కాసిన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి.
  5. శనగలు తీసేసిన కుక్కర్లోనే నెయ్యి వేసుకుని వేడెక్కాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు వేసుకుని వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు కూడా రంగు మారేదాకా వేయించండి.
  6. టమాటా ముక్కలు, బంగాళదుంపను ముక్కలుగా చేసి వేసేయండి. కాస్త మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి వేసి బాగా కలుపుకుని పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మూత పెట్టుకోండి.
  7. బాస్తమీ బియ్యం కూడా వేసి ఒక నిమిషం అలా కలపండి. శనగలు కూడా వేసేసుకోండి. నిమ్మరసం వేసుకుని కలిపేసి సగం కప్పుకు కప్పున్నర నీళ్లు పోసుకోండి.
  8. ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకుని దించేసుకుంటే చాలు. శనగల పులావ్ రెడీ అయినట్లే.