Vankaya Dum Biryani: వంకాయ కూర నచ్చకపోతే వంకాయ దమ్ బిర్యానీ ఇలా చేసేయండి, దీని రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపి ఇదిగో-vankaya dum biryani recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vankaya Dum Biryani: వంకాయ కూర నచ్చకపోతే వంకాయ దమ్ బిర్యానీ ఇలా చేసేయండి, దీని రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపి ఇదిగో

Vankaya Dum Biryani: వంకాయ కూర నచ్చకపోతే వంకాయ దమ్ బిర్యానీ ఇలా చేసేయండి, దీని రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపి ఇదిగో

Haritha Chappa HT Telugu
Sep 23, 2024 11:30 AM IST

Vankaya Dum Biryani: వంకాయ కూర నచ్చని వాళ్ళు ఎంతోమంది. నిజానికి వంకాయ ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో బిర్యాని వండి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ కూడా ఎంతో సులువు.

వంకాయ బిర్యానీ రెసిపీ
వంకాయ బిర్యానీ రెసిపీ

Vankaya Dum Biryani: వంకాయ పేరు చెబితేనే ముఖం తిప్పేసుకునే వాళ్ళు ఎంతోమంది. వంకాయను సరైన పద్ధతిలో వండితే దీనంత రుచి ఇంకే కూర ఇవ్వదు. ఇక్కడ మేము వంకాయ బిర్యానీ రెసిపి ఇచ్చాము. వంకాయ కూర మీకు తినాలనిపించకపోతే వంకాయ బిర్యానీ చేసుకుని చూడండి. దీని రుచి అదిరిపోతుంది. చిన్నచిన్న వంకాయలతో ఈ బిర్యానీ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో తెలుసుకోండి.

వంకాయ దమ్ బిర్యానీ రెసిపీకి కావలసిన పదార్థాలు

చిన్న వంకాయలు - ఎనిమిది

బాస్మతి బియ్యం - రెండు కప్పులు

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కారం - రెండు స్పూన్లు

గరం మసాలా పొడి - అర స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

పచ్చి మిర్చి - నాలుగు

ధనియాలు పొడి - ఒకటిన్నర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను

కొత్తిమీర తరుగు - అరకప్పు

పుదీనా తరుగు - అరకప్పు

నిమ్మరసం - రెండు స్పూన్లు

పెరుగు - అరకప్పు

యాలకులు - నాలుగు

లవంగాలు - ఆరు

షాజీరా - అర స్పూను

బిర్యానీ ఆకులు - రెండు

ఉల్లిపాయలు - రెండు

దాల్చిన చెక్కలు - రెండు ముక్కలు

వంకాయ దమ్ బిర్యానీ రెసిపి

1. వంకాయ బిర్యానీ చేసేందుకు బాస్మతి బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోండి. అరగంట ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది.

2. వంకాయ బిర్యానీలో పెద్దపెద్ద వంకాయలను వేస్తే పెద్దగా రుచిగా ఉండవు. కాబట్టి చిన్న వంకాయలను తీసుకోండి. నల్ల వంకాయలను తీసుకుంటారో లేక తెల్ల వంకాయలను తీసుకుంటారో మీ ఇష్టం. ఏదైనా టేస్టీ గానే ఉంటుంది.

3. ఇప్పుడు వంకాయను శుభ్రంగా కడిగి గుత్తి వంకాయలకు ఎలా నాలుగు గాట్లు పెట్టుకుంటారో అలా ఈ వంకాయలను కూడా మధ్యకి నాలుగు ముక్కలుగా చేయండి. కాడలు మాత్రం కత్తిరించకండి.

4. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ ఉండే పాత్రను పెట్టండి.

5. అందులో నూనె వేసి వంకాయలను వేసి వేయించండి.

6. చిన్న మంట మీద పది నిమిషాల పాటు వేయిస్తే అవి మెత్తగా అయిపోతాయి. వాటిని తీసి పక్కన పెట్టుకోండి.

7. ఇప్పుడు మిగిలిన నూనెలో నిలువుగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా వేయించండి. అవి రంగు మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

8. ఇప్పుడు మిగిలిన నూనెలో మరికొంచెం నూనె వేసి అందులో కొన్ని ఉల్లిపాయల ముక్కలు వేయండి.

9. అలాగే నిలువుగా తిరిగిన పచ్చిమిర్చిని కూడా వేయండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, నిమ్మరసం కూడా వేసి బాగా కలపండి. అలాగే పెరుగును కూడా వేయండి.

10. ఆ మిశ్రమంలోనే రెండు స్పూన్లు కొత్తిమీర తరుగు, రెండు స్పూన్ల పుదీనా తరుగును కూడా వేసి బాగా కలుపుకోండి.

11. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి బాగా కలపండి.

12. ఇవన్నీ బాగా వేగాక ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి కలపండి.

13. మూత పెట్టి పావుగంట సేపు ఉడకనివ్వండి.

14. ఈ సమయంలో ఒక గిన్నెలో నానబెట్టిన బాస్మతి బియ్యం, కొంచెం ఉప్పు, ఒక స్పూను నూనె, బిర్యానీ ఆకులు, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించండి.

15. అన్నం 70 శాతం ఉడికాక స్టవ్ ఆఫ్ చేయండి. మిగిలిన నీటిని వంపేసి అందులోని అన్నం పొడిపొడిగా ఉండేలా చూసుకోండి.

16. ఇప్పుడు పక్కన వంకాయలు ఉడికిపోతే మంటను చిన్నగా మార్చండి.

17. ఆ వంకాయలపై 70 శాతం ఉడికించుకున్న అన్నాన్ని పొరలు పొరలుగా వేయండి.

18. మధ్య మధ్యలో వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగును చల్లుతూ ఉండండి.

19. అలా మొత్తం చల్లాక చిన్న మంట మీదే ఉంచి పైన మూత పెట్టండి. ఆవిరి బయటికి పోకుండా పైన బరువును పెట్టండి.

20. ఒక ఐదు నిమిషాల పాటు అలా చిన్న మంటపై పదినిమిషాల పాటు ఉడికించండి.

21. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా అలా ఒక పావుగంట పాటు వదిలేయండి. తర్వాత మూత తీసి చూస్తే ఘుమఘుమలాడే వంకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది.

22. వంకాయ గ్రేవీ అంతా పాత్ర అడుగు నే ఉంది, కాబట్టి మెల్లగా గరిటతో దాన్ని కలపాలి. అప్పుడు టేస్టీ వంకాయ బిర్యాని మరింత నోరూరిస్తుంది.

వంకాయ కూర ఇష్టం లేని వారు ఇలా వంకాయ బిర్యానీ చేసుకుంటే ఖచ్చితంగా తింటారు. దీన్ని ఏదైనా గ్రేవీతో, రైతాతో తింటే టేస్టీగా ఉంటుంది. వంకాయ దమ్ బిర్యాని రుచి ఎవరికైనా నచ్చుతుంది. చిన్న వంకాయలు కాబట్టి అవి మెత్తగా ఉడికిపోతాయి. వాటిని కూడా తినేయవచ్చు.

Whats_app_banner