IAS Committee: MLO కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ, తమకు మరణ శాసనమే అంటోన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు-ias officers committee meeting on mlo committee report on promotions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ias Committee: Mlo కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ, తమకు మరణ శాసనమే అంటోన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు

IAS Committee: MLO కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ, తమకు మరణ శాసనమే అంటోన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు

Sarath chandra.B HT Telugu
Apr 18, 2024 12:13 PM IST

IAS Committee: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మిడ్‌ లెవల్ ఆఫీసర్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్‌ ఆఫీసర్ల కమిటీ భేటీ కావడంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది చేకూర్చేందుకు ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండి పడుతున్నారు.

ఎమ్మెల్వో కమిటీ నివేదికపై సిఎస్‌ వద్ద అభ్యంతరం వక్యం చేస్తున్న ఉద్యోగులు (ఫైల్ ఫోటో)
ఎమ్మెల్వో కమిటీ నివేదికపై సిఎస్‌ వద్ద అభ్యంతరం వక్యం చేస్తున్న ఉద్యోగులు (ఫైల్ ఫోటో)

IAS Committee: ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల Promotions వ్యవహారంపై ఐఏఎస్‌ IAS Officers అధికారుల కమిటీ భేటీ కావడంపై ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  Election Code ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగుల చీలిక తీసుకొచ్చి కొందరికి రాజకీయ లబ్ది చేకూర్చేలా కమిటీ పావులు కదుపుతోందని ఆరోపిస్తున్నారు.

పదోన్నతులలో రిజర్వేషన్ల అమలు కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్‌ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి కమిటీ నివేదికకు ఎన్నికలకు ముందే అమోద ముద్ర వేయించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినా కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంపై నష్టపోయే ఉద్యోగులతో చర్చలు జరపాలని తమకు సూచించలేదని ఐఏఎస్‌ అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్‌ అధికారి భర్తకు గత ఏడాది ఫారెస్ట్‌ సర్వీస్‌లో రెండేళ్ల పొడిగింపు ఇచ్చారని, మరో అధికారిపై కర్ణాటకలో కుల ధృవీకరణ వివాదం నడుస్తోందని, మరో అధికారి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే అధికారులతో నివేదికలకు అమోద ముద్ర వేయించే కుట్రలు జరుగుతున్నాయని సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం ఆరోపించింది. ఎమ్మెల్వో కమిటీ నివేదికకు అమోద ముద్ర పడితే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పాలిట మరణశాసనం అవుతుందని ఆరోపించారు.

ఎమ్మెల్వో కమిటీని నివేదికను సవాలు చేస్తూ ఐఏఎస్‌లకు తప్ప విధానపరమైన నిర‌్ణయాలు తీసుకునే అధికారం లేదని అభ్యంతరం చెబితే, తమ చెప్పు చేతల్లో ఉండే అధికారులతో నివేదికలకు అమోదం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ప్రభుత్వం ముగింపు పలుకుతోందని దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెరపైకి క్యాచ్‌ అప్‌ రూల్ థియరీ….

2001లో చేసిన 85వ రాజ్యాంగ సవరణతో ముగిసిన క్యాచ్‌ ఆఫ్‌ రూల్‌ థియరీ/ ఇనీషియల్‌ కేడర్‌ సీనియారిటీని మళ్లీ తెరపైకి తెచ్చి ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన పదోన్నతుల్ని రివర్స్‌ చేస్తూ, కొత్త పదోన్నతులు ఇవ్వకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఏ నిబంధనల ప్రకారం పదోన్నతుల్లో రిజర్వేషన్లు తొలగిస్తున్నారో చెప్పాలని ఉద్యోగులు డిమాండు చేశారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ సిఫార్సలకు బిన్నంగా రాజకీయ ప్రయోజనాల కోసమే ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో ఇనీషియల్‌ కేడర్‌ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలైతే, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పాత స్థానాలకు రివర్షన్లు జరుగుతాయని ఆరోపిస్తున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయడంపై ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం… ఈసీకి లేఖ రాసింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లపై వేసిన కమిటీ నివేదిక సమర్పించకుండా నిలుపివేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. దీనిద్వారా ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతోందని లేఖలో ఫిర్యాదు చేశారు.

పదోన్నతుల్లో రిజర్వేషన్ల పదోన్నతుల విషయంపై నియమించిన కమిటీ నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని, ఈ రిపోర్టును సమర్పించకుండా నిలుపులకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ నివేదిక ఇవ్వడం ద్వారా.... ఉద్యోగ వర్గాల్లో చీలిక తెచ్చేందుకు కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీ కావడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనం