AP Secreteriat Promotions: ఏపీ సచివాలయంలో ఎస్టీ అధికారుల పదోన్నతులకు గండి.. నిబంధనల సడలింపుకు ప్రభుత్వం అమోదం-injustice with relaxation of rules in promotions of st employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Secreteriat Promotions: ఏపీ సచివాలయంలో ఎస్టీ అధికారుల పదోన్నతులకు గండి.. నిబంధనల సడలింపుకు ప్రభుత్వం అమోదం

AP Secreteriat Promotions: ఏపీ సచివాలయంలో ఎస్టీ అధికారుల పదోన్నతులకు గండి.. నిబంధనల సడలింపుకు ప్రభుత్వం అమోదం

Sarath chandra.B HT Telugu
Dec 20, 2023 12:25 PM IST

AP Secreteriat Promotions: ఏపీ సచివాలయంలో ఎస్‌ఓ పదోన్నతుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎస్టీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దొడ్డిదారిలో పదోన్నతులకు ఉన్నత స్థాయిలో అమోదం లభించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్
ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్

AP Secreteriat Promotions: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల్లో కొత్త వివాదం తలెత్తింది. ఎస్టీ ఉద్యోగులకు దక్కాల్సిన పదోన్నతుల్ని దొడ్డిదారిలో మళ్లించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. 2022-23 ప్యానల్‌ ఇయర్‌కు సంబంధించిన పదోన్నతుల్లో అర్హులైన ఎస్టీ అధికారులు లేకపోవడంతో వాటిని తర్వాత ఏడాదికి బదలాయించారు.

ఏపీ సచివాలయంలో జిఏడిలోని ఆర్ధిక, న్యాయ శాఖలు మినహా మిగిలిన 31 విభాగాలకు చెందిన సింగల్‌ యూనిట్‌లో 351 సెక్షన్ ఆఫీసర్ పోస్టుల్లో.. ఆరు శాతం ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం 21మంది సెక్షన్ ఆఫీసర్లు ఉండాలి. 2022-23 ప్యానల్ ఇయర్‌లో 13మంది మాత్రమే ఆ క్యాడర్‌లో విధుల్లో ఉన్నారు. మిగిలిన 8మందికి అర్హత లేకపోవడంతో అప్పుడు పదోన్నతులు లభించలేదు.

2023 సెప్టెంబర్ 1 నాటికి 9మంది ఎస్టీ అభ్యర్థులు ఏఎస్‌ఓ నుంచి ఎస్వో క్యాడర్‌కు పదోన్నతులకు అర్హత సాధించారు. 2022-23 ప్యానల్‌ ఇయర్‌లో వందకు పైగా సెక్షన్‌ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించారు. ఆ ఏడాది అర్హులైన ఎస్టీ ఉద్యోగులు లేకపోవడం, మరుసటి ఏడాదికి వారికి అర్హత లభిస్తుందనే ఉద్దేశంతో ఆరు ఎస్టీ రిజర్వుడు పోస్టులతో పాటు మరో రెండు దివ్యాంగుల పోస్టుల్ని 2023-24 ప్యానల్‌ ఇయర్‌ క్యారీ ఫార్వార్డ్‌ చేశారు.

సెప్టెంబర్1, 2023 నాటికి 9మందికి అర్హత సాధించినా గతంలో మిగిలి ఉన్న ఎస్టీ పోస్టులు, దివ్యాంగుల పోస్టుల్ని జనరల్ క్యాటగిరీ ఉద్యోగులతో భర్తీ చేసేలా నిబంధనలు సడలించేలా పాత తేదీలతో ఫైల్‌‌ను ఉద్యోగ సంఘం నాయకుడు నడిపించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మంగళవారం రాత్రి నిబంధనలు సడిలింపుతో పదోన్నతులకు సంబంధించిన ఈ ఫైల్‌కు అమోద ముద్ర పడింది.

పాలసీ నిబంధనలు మార్చకుండానే…

ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్, పాలసీ నిబంధనలు మార్చకుండా కొద్ది మందికి క్యాటగిరీ మార్చి పదోన్నతులు ఇచ్చే అధికారం సిఎంకు కూడా లేదని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రిజర్వేషన్ కోటాలు మార్చే అధికారం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ఎస్టీలకు దక్కాల్సిన పోస్టుల్ని ఇతరులకు ఇచ్చేలా కొందరు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.

ఏటా సెప్టెంబర్ 1 నుంచి మొదలై ఆగష్టు 31తో ముగిసే ప్యానల్‌ ఇయర్‌లో ఉద్యోగులకు పదోన్నతుల్లో అవకాశం లభించాల్సి ఉంటుంది. అయితే 2022-23లో ఎస్టీలకు దక్కాల్సిన పదోన్నతుల్ని రూల్ రిలాక్సేషన్‌ కింద ఫైల్‌ నడిపి జనరల్ క్యాటగిరీ ఉద్యోగులతో భర్తీకి అమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెక్రటేరియట్ జిఏడి సర్వీసెస్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలా భాస్కర్‌ ద్వారా ఈ ఫైల్‌ నడిచింది. దానికి సిఎస్‌ ద్వారా సిఎంఓ అమోద ముద్ర వేసింది. ఇదంతా పథకం ప్రకారం సచివాలయంలో ఓ ఉద్యోగ సంఘం నాయకుడి కుట్రతో జరిగిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2023-24 ప్యానల్ ఇయర్‌లో ఆరు ఎస్టీ ఖాళీలు, రెండు ఫిజికల్లీ హ్యాండిక్యాప్‌ ఖాళీలు, మరో ఆరు జనరల్ ఖాళీలు ఉండగా వాటన్నింటిని పాతతేదీలతో జనరల్ కోటాలో భర్తీ చేసేలా నిబంధనలు సడలించాలని తాజాగా నిర్ణయించారు.

2022-23లో ఎస్టీ కోటా ఉద్యోగులకు దక్కాల్సిన పదోన్నతుల్ని ఇతరులతో భర్తీ చేసేందుకు అనుమతించడం ద్వారా తమ అవకాశాలు కొల్పోయేలా చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఎస్టీ ఉద్యోగులు ఎస్టీ కమిషన్‌, జిఏడి సెక్రటరీ, చీఫ్ సెక్రటరీని పలుమార్లు కలిసి అభ్యర్థించినా ఫలితం లేకపోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆగష్టు నెల తేదీలతో ఎస్టీ కోటా పదోన్నతుల్ని జనరల్ కోటాలో భర్తీ చేసేలా తాజాగా అనుమతించారని ఆరోపిస్తున్నారు.

IPL_Entry_Point