AP Govt Promotions: ఏపీ ప్రభుత్వ తీరుపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఆగ్రహం.. రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నారని ఆరోపణ
AP Govt Promotions: పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పదంగా మారింది. సిఎస్ జవహర్ రెడ్డి నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తప్పు పడుతున్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎత్తి వేసే కుట్రలో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.
AP Govt Promotions: ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రకు ఏపీ ప్రభుత్వం తెర తీసిందని సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులపై ఉద్యోగులు పోరాడేందుకు జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై ఈ నెల 15న కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ప్రభుత్వం ముగింపు పలుకుతోందని దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది.
2001లో చేసిన 85వ రాజ్యాంగ సవరణతో ముగిసిన క్యాచ్ ఆఫ్ రూల్ థియరీ/ ఇనీషియల్ కేడర్ సీనియారిటీని మళ్లీ తెరపైకి తెచ్చి ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన పదోన్నతుల్ని రివర్స్ చేస్తూ, కొత్త పదోన్నతులు ఇవ్వకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఏ నిబంధనల ప్రకారం పదోన్నతుల్లో రిజర్వేషన్లు తొలగిస్తున్నారో చెప్పాలని డిమాండు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో ఇనీషియల్ కేడర్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలైతే, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పాత స్థానాలకు రివర్షన్లు ఖాయమని, ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఉద్యోగులు ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పలుమార్లు కలసి మొర పెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు.
రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంక్రమించిన హక్కులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ, దీనిపై పోరాడేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఐక్యకార్యాచరణ సమితి జేఏసీగా ఏర్పడాలని నిర్ణయించారు. ఈ నెల 15న జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని సంఘం ఒక ప్రకటనలో తెలిపారు.
రాజ్యాంగానికి విరుద్ధం
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులపై రాజ్యాంగం, కోర్టు తీర్పులు, ఐఏఎస్‌ల కమిటీ నిర్ణయం ఒకలా ఉంటే... రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమిటీ దానికి భిన్నంగా నివేదిక ఇచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులను అర్థం చేసుకోవడంలో న్యాయశాఖ కార్యదర్శి విఫలమయ్యారని, కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీపై ఉన్నతాధికారులకు అవగాహన లేదని, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారుల సీనియారిటీని రివైజ్ చేసేటప్పుడు ఆ దస్త్రాన్ని ముఖ్యమంత్రికి పంపాలన్న అవగాహన కూడా లేకపోవడం దురదృష్టమని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆరోపించింది.
2003 నుంచి పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఎస్సీ, ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం లేనప్పుడే పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలవుతుందని వివరించారు. కోటాకు మించిన ప్రాతినిధ్యానికి తావెక్కడ ఉంటుందన్నారు. కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీపై ఇచ్చిన జీవో నం.26ని ఉమ్మడి హైకోర్టు సమర్థిస్తే దానికి విరుద్ధంగా వారు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిచ్చారని, ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులపై అంత కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 2013లో కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీపై అశుతోష్ మిశ్ర సారథ్యంలోని సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక చదివే తీరిక కూడా ఉన్నతాధికారులకు లేదని ఆరోపించారు.
మరోవైపు సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి అడిషనల్ సెక్రటరీ కేడర్ వరకు... ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వారిని రివర్స్ చేసేందుకు కసరత్తు జరుగుతోందని వచ్చిన వార్తలపై... రాష్ట్ర ప్రభుత్వం గురువారం వివరణ ఇచ్చింది. ఆయా కేడర్లలో అదనంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు నష్టం జరగకుండా, తెలంగాణలోలాగే వారినీ సర్దుబాటు చేస్తామని ప్రకటించింది.
''వివిధ ప్యానల్ సంవత్సరాల్లో ఇచ్చిన పదోన్నతుల్ని సమీక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడ్వైజరీ కమిటీని వేసిందని, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల కంటే అదనంగా ఉన్నవారిని గుర్తించి వారిని రివర్స్ చేయకుండా... కొన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించినట్లు చెబుతున్నారు. 30 మంది ఉద్యోగులకు నోషనల్ పదోన్నతులు కల్పించిందని, అదనంగా ఉన్న ఉద్యోగుల్ని తెలంగాణలో మాదిరే సర్దుబాటు చేస్తాంమని చెబుతున్నారు.
‘‘ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనపై మిడిల్ లెవల్ ఆఫీసర్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అమలు చేయరాదని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించాలని, ఈ అంశంపై కోర్టు కేసుల్లో పార్టీలుగా ఉన్న వారే మిడిల్ లెవల్ ఆఫీసర్స్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని చెబుతున్నారు.
దురుద్దేశాలతో ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అమలుచేస్తే మాకు అన్యాయం జరుగుతుందని, కొత్తగా ఏమీ అడగడం లేదని, ఉన్నవి తీసేయొద్దని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతున్నామని అని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్‌బాబు అన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.