AP SC ST Employees :ఆ నివేదికతో చీలిక తెచ్చే ప్రయత్నాలు..! ఈసీకి ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు
AP SC ST Employees Complaint to EC: ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం… ఈసీకి లేఖ రాసింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లపై వేసిన కమిటీ నివేదిక సమర్పించకుండా నిలుపివేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. దీనిద్వారా ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతోందని లేఖలో పేర్కొంది.
AP SC ST Employees Complaint: కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం(AP Secretariat SC, ST Employees Union). పదోన్నతుల్లో రిజర్వేషన్ల పదోన్నతుల విషయంపై నియమించిన కమిటీ నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని, ఈ రిపోర్టును సమర్పించకుండా నిలుపులకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ నివేదిక ఇవ్వడం ద్వారా.... ఉద్యోగ వర్గాల్లో చీలిక తెచ్చేందుకు కొందరు ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ నివేదికను సమర్పించటం ద్వారా... ఇతర కులాల ఉద్యోగులు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టే అవకాశం ఉందని ప్రస్తావించింది. ఫలితంగా ఉద్యోగులను కుల ప్రాతిపాదికన విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని, దీని ద్వారా అధికార పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు.
ఇది ఎన్నికల కోడ్ ను(Election Code in AP) ఉల్లంఘించడమే అవుతుందని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం(AP Secretariat SC, ST Employees Union) లేఖలో తెలిపింది. ఈ నివేదికను సమర్పించకుండా ఆపేలా ఆదేశాలివ్వాలి కోరింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇలా చేస్తే.... ఈ ఎన్నికల్లో ఉద్యోగులు ఏకతాటిపై ఉండి ఐక్యమత్యంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత… నివేదికను ఇచ్చేలా ఆదేశాలివ్వాలని ఉద్యోగుల సంఘం కోరింది.
ప్రమోషన్లలో రిజర్వేషన్ల పై క్యాచ్ ఆఫ్ రూల్ ను అమలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం మిడ్ లెవల్ అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఓ నివేదికను కూడా సమర్పించింది. అయితే రిపోర్టును ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో మిడ్ లెవల్ అధికారుల కమిటీ ఇచ్చిన రిపోర్టును సమీక్షించేందుకు ఐఎస్ఎస్ అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఈ కమిటీ ప్రస్తుతం నివేదిక ఇచ్చేందేకు సిద్ధమవుతోందని.. ఇందుకు ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు ఉందని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ కమిటీ కార్యకలాపాలు కూడా DOPT ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదికను సమర్పించటం ద్వారా... ఉద్యోగుల్లో చీలిక వచ్చి ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని తెలిపింది. ఫలితంగా ఉన్నతస్థాయి కమిటీ...ప్రస్తుతం నివేదిక ఇవ్వకుండా ఆదేశాలివ్వాలని ఈసీని కోరింది. అయితే ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది చూడాలి.