Bengaluru news: పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఆఫీస్ కు వస్తే ఇన్సెంటివ్స్; బెంగళూరు లో ఉద్యోగులకు కంపెనీల ఆఫర్
Bengaluru news: ఐటీకి ఫేమస్ అయిన బెంగళూరు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ లకు ఫేమస్ అయింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో బెంగళూరులో ట్రాఫిక్ జామ్ కాని రోడ్ ఉండదంటే అతిశయోక్తి కాదు. రోడ్లపై ట్రాఫిక్ ను తగ్గించడానికి ప్రజా రవాణా వ్యవస్థను వాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
Bengaluru news: బెంగళూరు లోని పలు కంపెనీలు నగరంలోని ప్రజారవాణా వ్యవస్థలను ప్రోత్సహించే దిశగా పలు చర్యలు ప్రారంభించాయి. ఉద్యోగులు ఆఫీస్ కు రావడానికి, మళ్లీ వెళ్లడానికి ప్రజారవాణాను వినియోగించుకుంటే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అంతేకాదు, ఉద్యోగులు తమ రాకపోకలకు సింగిల్ ఆక్యుపెన్సీ ప్రైవేట్ వాహనాలను ఉపయోగిస్తే పార్కింగ్ కోసం వారి నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి.
ట్రాఫిక్ కష్టాలు
బెంగళూరు నగరంలో వాహనాల రద్దీ (Bengaluru traffic) ఇటీవల కాలంలో చాలా పెరిగింది. ఉద్యోగులు సొంత వాహనాలు కొనుగోలు చేయడం, ఒక్కో ఇంట్లో ఒక్కక్కరికి ఒక్క కారు ఉండడం బెంగళూరులో కామన్ గా మారింది. ఈ పరిస్థితుల్లో పీక్ హవర్స్ లో బెంగళూరులో ట్రాఫిక్ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. అందువల్ల ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రభుత్వాలు నగరంలోని ప్రైవేటు కంపెనీల సాయం తీసుకుంటున్నాయి. తమ ఉద్యోగులు ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా చూడాలని కంపెనీలను ప్రభుత్వం కోరింది. దాంతో, కంపెనీలు ప్రజా రవాణాను ఉపయోగించే ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం ప్రారంభించాయి. అంతేకాదు, ఉద్యోగులు ఒకే కారులో విధులకు వచ్చేలా కార్ పూలింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి.
మల్టీ నేషనల్ కంపెనీల కేఆర్ఏల్లో కూడా..
బెంగళూరులోని నెట్ యాప్, మష్రెక్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బహుళజాతి సంస్థల (MNC) తమ ఉద్యోగుల కీ రిజల్ట్ ఏరియా/ కీ రెస్పాన్సిబిలిటీ ఏరియా (KRA)లో ఉద్యోగుల రవాణా విధానాన్ని భాగం చేశాయి. ప్రజా రవాణాను ఉపయోగించే ఉద్యోగులకు రవాణా ప్రయోజనాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ను ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు మెట్రో పాస్ లు, షటిల్ సేవలకు రీయింబర్స్ మెంట్ ను కూడా అందిస్తున్నారు.