Bengaluru traffic : బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి, మీమ్స్ జాతరకు కారణమవుతున్న బెంగళూరు ట్రాఫిక్‌ను తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 190 కి.మీల భారీ టన్నెల్‌ను నిర్మించనున్నట్టు ప్రకటించింది. త్వరలోనే పబ్లిక్ టెండర్లకు ఆహ్వానాలు పంపిస్తామని స్పష్టం చేసింది.
నగరంలో ట్రాఫిక్ సమస్యలు.. బెంగళూరు వాసులకు చాలా తలనొప్పిగా మారాయి. పక్కనే ఉన్న ప్రాంతాలకు వెళ్లాలన్నా.. తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టన్నెల్‌ను నిర్మిస్తున్నట్టు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పడం కాస్త ఉపశమనాన్ని కల్పించే విషయం.
Bengaluru tunnel road : "190 కి.మీల పొడవైన టన్నెల్ రోడ్డును నిర్మించేందుకు ప్రతిపాదించాము. బెంగళూరు ట్రాఫిక్ నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. 8 కంపెనీలు క్వాలిఫై అయ్యాయి. 45 రోజుల్లో టెండర్లకు పిలుస్తాము," అని డీకే శివకుమార్ అన్నారు.
ఇక టన్నెల్ రోడ్డు.. 6 లేన్లు ఉండాలా? లేక 4 లేన్లు సరిపోతాయా? అన్న విషయాన్ని కంపెనీలు అధ్యయనం చేసి, నివేదిక ఇస్తాయి. ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఎక్కడి ముగించాలి? అన్నది కూడా నివేదికలో ఉంటుంది.
Bengaluru tunnel road project : బెంగళూరు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు.. బెల్లారి రోడ్డు, ఓల్డ్ మద్రాస్ రోడ్డు, ఇస్టీమ్ మాల్ జంక్షన్- మెఖ్రీ సర్కిల్, మిల్లర్ రోడ్డు, చాలుక్య సర్కిల్, ట్రినిటీ సర్కిల్, సర్జాపుర్ రోడ్డు, హోసూర్ రోడ్డు, కనకపురా రోడ్డు- కృష్ణ రావు పార్క్, మైసూర్ రోడ్డు- సిర్సి సర్కిల్, మగాడి రోడ్డు, తిుమకురు రోడ్డు- యశ్వంత్‌పూర్ జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్డు, గోరగుంటపల్య, కేఆర్ పురం, సిల్క్ బోర్డు ప్రాంతాల్లో 190 కి.మీల భారీ టన్నెల్‌ను రూపొందించాలని భావిస్తున్నట్టు కర్ణాటక డిప్యూటీ సీఎం తెలిపారు.
ఇక రుతుపవనాల సీజన్ ముగియడంతో.. నగరంలో మిగిలిపోయిన డ్రైనేజ్, ఇతర పనులను శరవేగంగా పూర్తిచేయనున్నట్టు డీకే శివకుమార్ వెల్లడించారు. రోడ్లపై గుంతల సమస్యను కూడా తగ్గించేందుకు చూస్తున్నట్టు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు బెంగళూరు డెవల్ప్మెంట్ విభాగం కూడా డీకే శివకుమార్ దగ్గరే ఉంది.
Bengaluru tunnel plan : బెంగళూరు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు కేంద్ర సహాయాన్ని తీసుకుంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. '190 కి.మీల టన్నెల్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. కేంద్ర సాయం కచ్చితంగా తీసుకుంటాము. నివేదికలు వచ్చిన తర్వాత.. వాటిని కేంద్రానికి సమర్పిస్తాము. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని నేను ఇప్పటికే కలిశాను. జాతీయ రహదారుల నుంచి వచ్చే వాహనాలు.. బెంగళూరు ట్రాఫిక్ కారణమవుతున్నాయి. ఈ విషయం ఆయనకు చెప్పాను. ఆయన నాకు కొన్ని సలహాలు ఇచ్చారు,' అని డీకే శివకుమార్ అన్నారు.
సంబంధిత కథనం