Karnataka bandh: బెంగళూరు విమానాలు రద్దు; కర్నాటక బంద్ ప్రభావం
Karnataka bandh: తమిళనాడుకు కావేరీ నది జలాలను విడుదల చేయవద్దన్న డిమాండ్ తో కన్నడ అనుకూల సంఘాల కూటమి ‘కన్నడ ఒక్కుట (Kannada Okkoota)’ నిర్వహిస్తున్న కర్నాటక బంద్ శుక్రవారం విజయవంతంగా కొనసాగుతోంది.
Karnataka bandh: కర్నాటక స్తంభించింది. తమిళనాడుకు కావేరీ నది జలాలను విడుదల చేయవద్దన్న డిమాండ్ తో కన్నడ అనుకూల సంఘాల కూటమి ‘కన్నడ ఒక్కుట (Kannada Okkoota)’ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపునకు దాదాపు అన్ని వర్గాలు సానుకూలంగా స్పందించాయి.
విమానాలు రద్దు..
బంద్ ప్రభావంతో బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన, బెంగళూరుకు వెళ్లాల్సిన దాదాపు 44 విమానాలు రద్దు అయ్యాయి. కొన్ని విమానాల రాకపోకల షెడ్యూల్ ను మార్చారు. దాంతో బెంగళూరు విమానాశ్రయం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కష్టనష్టాలకు ఓర్చి ఏర్ పోర్ట్ కు వచ్చిన ప్రయాణికులు తమ విమానాలు రద్దు అయ్యాయని తెలుసుకుని ఆందోళనలకు దిగారు. ముందుగా సమాచారం ఇవ్వలేదని సంబంధిత ఏర్ లైన్స్ వద్ద గొడవకు దిగారు.
144 సెక్షన్
బంద్ నేపథ్యంలో బెంగళూరు లోని పలు ప్రాంతాలు సహా రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. బెంగళూరు అర్బన్, మాండ్య, మైసూరు, చామరాజనగర, రామనగర, హసన్ జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా, పలు ప్రాంతాల్లో నిరసన కారులు తమిళనాడు సీఎం స్టాలిన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పలు ప్రాంతాల్లో నిరసనకారులు రైల్ రోకో నిర్వహించారు. టోల్ గేట్ల వద్ద, రహదారులపై వాహనాలను అడ్డుకున్నారు.
సినీ పరిశ్రమ మద్దతు
కర్నాటక బంద్ కు కన్నడ సినీ పరిశ్రమ మద్దతు తెలిపింది. దాంతో, రాష్ట్రవ్యాప్తంగా థీయేటర్లు మూతపడ్డాయి. షూటింగ్ లు నిలిచిపోయాయి. బంద్ కు మద్దతుగా శివరాజ కుమార్ సహా సినీ పెద్దలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బెంగళూరులోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాల్సిందిగా సూచించాయి. బెంగళూరులోని ప్రధాన మార్కెట్లు సహా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. ఆటో రిక్షా యూనియన్, ఉబర్, ఓలా డ్రైవర్స్ అసోసియేషన్లు ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి. దాంతో వాటి సేవలు కూడా నిలిచిపోయాయి. బంద్ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రైతు సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.