AP Employees Reversions: దొడ్డి దారిలో ఎమ్మెల్వో కమిటీ సిఫార్సుల అమలుకు కుట్రపై ఉద్యోగుల ఆగ్రహం-sc and st employees are angry over the conspiracy to implement the recommendations of the mlo committee ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Employees Reversions: దొడ్డి దారిలో ఎమ్మెల్వో కమిటీ సిఫార్సుల అమలుకు కుట్రపై ఉద్యోగుల ఆగ్రహం

AP Employees Reversions: దొడ్డి దారిలో ఎమ్మెల్వో కమిటీ సిఫార్సుల అమలుకు కుట్రపై ఉద్యోగుల ఆగ్రహం

HT Telugu Desk HT Telugu
Oct 13, 2023 06:29 AM IST

AP Employees Reversions: ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైన ప్రమోషన్లలో రివర్షన్ల వ్యవహారంలో అడ్డదారిలో ముందుకెళ్లే కుట్రలు జరుగుతున్నాయని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మిడ్ లెవల్ కమిటీ సిఫార్సులపై ఏజీ నివేదిక సమర్పించడంతో, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఏపీ సిఎస్ జవహార్ రెడ్డి
ఏపీ సిఎస్ జవహార్ రెడ్డి

AP Employees Reversions: ఏపీ ప్రభుత్వంలో ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదం మళ్లీ రాజుకుంది. కొన్నాళ్ళుగా సద్దుమణిగిన ఈ వ్యవహారంలో MLOs కమిటీ రూపొందించిన తప్పుడు నివేదికకు తాజాగా అడ్వకేట్‌ జనరల్‌ అమోదించి అదే నివేదికను GA పొలిటికల్ సెక్రటరీ చీఫ్‌ సెక్రటరీకి ఫైల్ రూపంలో పంపించడంతో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.సెక్రటేరియట్‌ మిడిల్ లెవల్ ఆఫీసర్స్ కమిటీ అధికారులు ఏకపక్షంగా రూపొందించిన విధానాలకు ఏజీ ఒపీనియన్ సైతం అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్వో కమిటీ నివేదికకు అనుకూలంగా రూపొందిన నివేదిక తాజాగా సిఎస్‌ను చేరడంతో గురువారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సిఎస్‌కు వినతి పత్రం సమర్పించారు. పదోన్నతుల వ్యవహారంలో పూర్తి స్థాయి అధ్యయనం చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

రిజర్వుడు ఉద్యోగులకు పదోన్నతుల్లో గండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఉద్యోగులకు పదోన్నతులు కల్పించేపుడు ప్రస్తుతం పని చేసే స్థానంలో ఉన్న సీనియారిటీని కాకుండా, ఉద్యోగి నియామక తేదీ నుంచి సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలనే నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు గత జులై నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి మిడ్‌లెవల్ ఆఫీసర్స్ కమిటీ సమర్పించిన నివేదిక రెండు నెలల తర్వాత వెలుగు చూసింది.

రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానంలో ఉన్న ఉద్యోగి కొన్నేళ్ల సర్వీసు తర్వాత... తన ఉద్యోగంలో పై స్థానానికి ప్రమోట్ అయినపుడు, పదోన్నతి లభించిన తేదీ నుంచి ఆ తర్వాత వచ్చే ప్రమోషన్‌కు సీనియారిటీ పొందడానికి అర్హత పొందుతారు. దీనిని కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీగా పరిగణిస్తారు.

స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 33(a) ప్రకారం ఒక ఉద్యోగి తను ప్రమోట్ అయిన తేదీ నుండి ప్రమోట్ అయిన పోస్టులో సీనియారిటీ వస్తుంది. ఆ సీనియారిటీనే తదుపరి ప్రమోషన్ కు సీనియారిటీగా పరిగణనలోకి తీసుకుంటారు. 1995లో విర్పాల్ సింగ్ చౌహాన్ కేసు, అజిత్ సింగ్ (1996)కేసుల్లో సుప్రీం కోర్టు పదోన్నతుల్లో ఇనిషియల్ క్యాడర్ సీనియారిటీని (క్యాచ్ అప్ రూల్) అమలు చేయాలని తీర్పులు ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన తలెత్తింది.

ఈ తీర్పుల వల్ల ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని భావించి 85వ రాజ్యాంగ సవరణ (2001) ద్వారా ఆర్టికల్ 16(4ఏ)కు 'కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీ' అనే పదాన్ని జోడించారు. రూల్ అఫ్ రిజర్వేషన్ ద్వారా ప్రమోట్ అయిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోట్ అయిన తేదీ నుండి ప్రమోట్ అయిన పోస్టులో సీనియారిటీ వర్తింపచేయడమే 'కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీ'. స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 33(a) ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4ఏ) లో పొందుపరచడం ద్వారా రాజ్యాంగ బద్దతను కల్పించారు. ఈ రాజ్యాంగ సవరణను నాగరాజ కేసు (2006) లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది.

క్యాచ్ అప్ రూల్ థియరీ-ఇనిషియల్ కేడర్ సీనియారిటీ అంటే....

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌కు చెందిన ఓ వ్యక్తి జూనియర్ అసిస్టెంట్ కేడర్‌‌లో పనిచేస్తూ, పనిచేసే చోట సీనియారిటీలో ఐదో స్థానంలో ఉంటే, అతని కంటే ముందు ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో ఉన్నవారు ఎస్సీ, ఎస్టీ యేతరులు అయినప్పుడు... “సీనియర్ అసిస్టెంట్” క్యాడర్‌లో ఎస్సీ, ఎస్టీలలో తగినంత ప్రాతినిధ్యం లేనప్పుడు అంటే రిజర్వేడ్ పోస్ట్ భర్తీ చేయవలసిన సమయంలో, జూనియర్ అసిస్టెంట్ కేడర్‌‌లో ఐదవ స్థానంలో ఉన్న వ్యక్తి “సీనియర్ అసిస్టెంట్” క్యాడర్‌ కి ముందుగా ప్రమోట్ అవుతాడు. 'కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీ' ప్రకారం ప్రమోట్ అయిన తేదీ నుండి అతనికి సీనియారిటీ లభిస్తుంది.

తర్వాత కాలంలో ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో ఉన్న వారు కూడా “సీనియర్ అసిస్టెంట్” క్యాడర్‌ కి ప్రమోషన్లు వచ్చాయి అనుకుంటే, “సీనియర్ అసిస్టెంట్” క్యాడర్‌లో వారికీ తదుపరి సీనియారిటీ లభిస్తుంది అంటే ప్రమోట్ అయిన తేదీ నుండి వారికి సీనియారిటీ లభిస్తుంది.

తర్వాత దశలో సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ క్యాడర్ కి పదోన్నతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు సీనియర్ అసిస్టెంట్లలో సీనియర్ కు మొదటగా పదోన్నతి లభించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ సీనియారిటీలో ముందు ఉన్న వ్యక్తి ఎస్సీ లేదా ఎస్టీ కులాలకు చెందిన వాడు అతనికి సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో వచ్చిన సీనియారిటీ తగినంత ప్రాతినిధ్యం లేని కారణంతో ముందుగా ప్రమోట్ అవ్వడం వలన వచ్చింది కాబట్టి ఫీడర్ క్యాడర్ అయిన సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న సీనియారిటీని కాకుండా ఇనిషియల్ క్యాడర్ అయిన జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న సీనియారిటీని పరిగణలోకి తీసుకుని సూపరింటెండెంట్ క్యాడర్ కి పదోన్నతి ఇవ్వడమే క్యాచ్ అప్ రూల్ థియరీ.

ఈ విధానంలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఉద్యోగి పని చేసే పోస్టులో సీనియారిటీని కాకుండా అంటే ఫీడర్ క్యాడర్ సీనియారిటీ కాకుండా, అతను ఉద్యోగంలో చేరిన మొదటి పోస్టులో ఉన్న సీనియారిటీని పరిగణలోకి తీసుకుని పదోన్నతులు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలే దక్కవని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరగడంతోనే 85వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగ సవరణను నాగరాజ కేసు (2006) లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. అయినా క్యాచ్ అప్ రూల్ థియరీని ఎస్సీ, ఎస్టీల ప్రమోషన్లపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

రద్దు చేసిన ఉత్తర్వులు మ‌ళ్ళీ తెరపైకి….

85వ రాజ్యాంగ సవరణ చేసిన పార్లమెంట్ ఉద్దేశంతో పాటు ఆ సవరణను సమర్ధించిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉద్దేశాలకు తూట్లు పొడిచేలా.., రద్దు చేసిన క్యాచ్ అప్ రూల్ థియరీని తిరగదోడాలని చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, సంఘాలు కొద్ది నెలలుగా రకరకాల పద్ధతుల్లో ఆందోళనలు చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులతో పాటు, సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులను అర్థం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయకార్యదర్శి విఫలమయ్యారని, కీలకమైన నిర్ణయం తీసుకునే సమయంలో, సీనియారిటీ రివైజ్ చేసే సమయంలో ఆ ఫైలును ముఖ్యమంత్రికి పంపకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.

పాత స్థానాలకు పంపేందుకు ప్రయత్నాలు….

ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారం కీలక నిర్ణయం తీసుకునే సమయంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌తో పాటు జిఏడి సర్వీసెస్ సెక్రటరీగా ఉన్న పోలా భాస్కర్‌ను కమిటీలో లేకుండానే నిర్ణయం తీసుకోవడాన్ని ఉద్యోగులు తప్పు పడుతున్నారు. కోర్టు తీర్పులు, అశుతోష్ మిశ్రా కమిటీ నిర్ణయానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం న్యాయ శాఖ కార్యదర్శి అధ్యక్షతన 2022 నవంబర్‌లో కమిటీ ఏర్పాటు చేసింది. మధ్య స్థాయి అధికారులతో కూడిన ఈ కమిటీలో డీఎస్, జేఎస్‌, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మాత్రమే ఉన్నారని ఉద్యోగులు చెబుతున్నారు.

ఈ కమిటీ క్యాచ్ అప్ రూల్ థియరీ (ఇనిషియల్ క్యాడర్ థియరీ) అమలు చేయాలని 'కాన్‌సీక్వెన్షియల్ సీనియారిటీ' తో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన పదోన్నతులు సమీక్షించాలని రిపోర్టును మార్చి నెలలో సిఎస్‌కు సమర్పించింది. డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ స్థాయి ప్రమోషన్లకు ముఖ్యమంత్రి అమోదించాల్సి ఉన్నా సిఎస్ స్థాయిలోనే అమోదించేశారు.

ఎన్నికల్లో లబ్ది కోసమే కమిటీ ఏర్పాటు...

గత ఏడాది జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో గెలుపు కోసమే ఉద్యోగుల ప్రమోషన్లలో వివాదానికి తెరతీశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో బీసీ, ఓసీ ఉద్యోగుల ఓట్లు ఓ ప్యానల్‌కు పడకుండా ప్రమోషన్లలో రివర్షన్లు అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారని ఆ హామీలో భాగంగానే కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించి ఆ ఎన్నికలలో లాభపడ్డారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నాడని ఆరోపిస్తున్నారు. తాజాగా అడ్వకేట్ జనరల్ నుంచి సిఎస్‌కు ఫైల్ చేరడంతో ప్రమోషన్లలో రిజర్వేషన్లు రద్దైనట్టేనని చెబుతున్నారు.

2006లో నాగరాజ, జర్నైల్ సింగ్ కేసుల్లో సుప్రీం కోర్టు తీర్పు స్పష్టమైన తీర్పులు ఇచ్చినా వాటిని అమలు చేయకుండా, తెలంగాణ GAD డిపార్ట్మెంట్ లో ప్రవేశపెట్టిన క్యాచ్‌ అప్ రూల్ థియరీ మీద రెండున్నరేళ్లుగా హైకోర్టులో విచారణకు నోచుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదని, అదే తరహాలో ఇక్కడా కూడా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఇది సరికాదని ఉద్యోగులు చెబుతున్నారు.

తెలంగాణలో రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టు తీర్పులు, మార్గదర్శకాలు సక్రమంగానే ఉన్నాయని రాహుల్ బొజ్జా నేతృత్వంలోని కమిటీ నివేదికను సిఎస్ సోమేష్ కుమార్ కూడా అమోదించారని గుర్తు చేస్తున్నారు. మిడిమిడి జ్ఞానంతో ఉన్న మిడ్‌ లెవల్ అధికారుల బృందం రాజ్యాంగ స్ఫూర్తిగా భిన్నంగా, ఏకపక్షంగా రిజర్వేషన్లలో అవకాశాలను దెబ్బతీసేలా నివేదిక రూపొందించారని రిజర్వుడు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జిఏడిలో రివర్షన్లు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారని తర్వాత మిగిలిన శాఖలకు విస్తరిస్తారని ఆరోపిస్తున్నారు.

కోర్టు తీర్పులపై వివాదం...

ప్రమోషన్లలో రిజర్వేషన్లకు కీలకమైన జీవోలు 5 మరియు 26 చెల్లుతాయని అయితే రిజర్వేషన్లు ఎం.నాగరాజ మరియు జర్నల్ సింగ్ కేసులలో సుప్రీంకోర్టు ప్రతిపాదించిన నియమ నిబంధనలకు లోబడి ఉండాలని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు డిసెంబర్ 11, 2018 న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేయడం లేదు అని కొద్ది మంది ఓసీ,బీసీలు హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేశారు

ప్రమోషన్లలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన ఈ కంటెంప్ట్ పిటీషన్ లో, 2020 మార్చిలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీ ఎం.నాగరాజ మరియు జర్నల్ సింగ్ కేసులలో సుప్రీంకోర్టు ప్రతిపాదించిన నియమ నిబంధనలకు లోబడి ఉందని, దీనిపై ఏ రకమైన క్లారిఫికేషన్ అవసరం లేదు అని కూడా పేర్కొంది. ప్రమోషన్లలో రిజర్వేషన్లు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అంశం.

రిజర్వేషన్లకు సంబంధించి అన్ని జీవోలను ఈ డిపార్ట్మెంటే ఇచ్చింది. అయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హైకోర్టు కు సమర్పించిన అఫిడవిట్ కు వ్యతిరేకంగా పొలిటికల్ సెక్రటరీ GAD, ఎమ్మెల్వేలతో కూడిన కమిటీ ఏర్పాటు చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల తొలగింపుపై చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫైల్ చేసిన కౌంటర్ అఫిడవిట్ ఆధారంగా హైకోర్టులో కంటెంప్ట్ క్లోజ్ చేయాలని వాదించాల్సిన జీపీ ఖాసా జగన్మోహన్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఆ పని చేయకుండా ఎస్సీ,ఎస్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మండిపడుతున్నారు. ఈ విషయంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెబుతున్నారు.

ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల తొలగింపుపై చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫైల్ చేసిన కౌంటర్ అఫిడవిట్ ఆధారంగా హైకోర్టులో కంటెంప్ట్ క్లోజ్ చేయాలని వాదించాల్సిన జీపీ ఖాసా జగన్మోహన్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఆ పని చేయకుండా ఎస్సీ,ఎస్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ప్రమోషన్లలో రిజర్వేషన్లు రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మండిపడుతున్నారు. ఈ విషయంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెబుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం