AP TG Weather : వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం..! ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తదుపరి 24 గంటలలో ఈ వాయుగుండం తీవ్రతను కొనసాగిస్తుందని వాతావరణశాఖ పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఇక తెలంగాణలో డిసెంబర్ 24 నుంచి వానలు కురిసే అవకాశం ఉంది.
పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. అంతేకాకుండా దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటు 5.8 కి.మీ వరకు విస్తరించి ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ వాయుగుండం… ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ… తదుపరి 24 గంటల వరకు తీవ్రతను కొనసాగిస్తుందని అంచనా వేసింది.
ఈ జిల్లాలకు హెచ్చరికలు..
వాయుగుండం ప్రభావంతో.. మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. దీంతో అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు..
ఇక ఇవాళ(డిసెంబర్ 21) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణకు వర్ష సూచన:
తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈ మూడు రోజులపాటు పొడి వాతవరణం ఉంటుందని తెలిపింది. అయితే డిసెంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
డిసెంబర్ 24వ తేదీ నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పలుచోట్ల పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. డిసెంబర్ 26వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.