Saturday Motivation: మీ స్నేహాన్ని బలోపేతం చేయడానికి సైన్స్ చెబుతున్న ఈ అలవాట్లను నేర్చుకోండి
జీవితం సంతోషంగా ఉండాలంటే మంచి కుటంబమే కాదు, స్నేహితులు కూడా ఉండాలి. చక్కటి స్నేహ బంధంలో ఉన్నవారు మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.
జీవితంలో స్నేహాలు ఎంతో ముఖ్యం. కుటుంబం ఎంత అండగా నిలిచి ఉంటుందో.. నిజమైన స్నేహితులు కూడా కష్టంలో అంతే బలంగా నిల్చుని పోరాడుతారు. అందుకే రక్తసంబంధం తర్వాత స్నేహబంధమే గొప్పదని ప్రపంచంలోని మేధావులంతా చాటి చెబుతారు. రోజురోజుకు స్నేహబంధం పెరగాలంటే మీరు దానికి విలువ ఇవ్వాలి. అలాగే కొన్ని విలువలను కూడా పాటించాలి. కొద్ది మంది వెంటనే స్నేహం అలవర్చుకుంటారు. మరికొందరికి మాత్రం స్నేహితులు కావడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు.
ఎవల్యూషనరీ సైకలాజికల్ సైన్స్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వ్యక్తులు తమ స్నేహితులతో బంధాలను బలోపేతం చేసుకున్నందుకు ఈ అలవాట్లను అలవర్చుకోవాలి. ఇది ఎవరి స్నేహాన్ని అయినా కలకాలం ఉండేలా కాపాడుతుంది.
మంచి స్నేహానికి కావాల్సిన అలవాట్లు
మీ స్నేహితుడికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలవండి. అతడు ఏం చెప్పినా జాగ్రత్తగా విని స్పందించాలి. ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ బంధాన్ని బలపరుచుకోవాలి. ఒకరికొకరు చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోవాలి. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి. స్నేహితులను ఇంట్లో తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసి కుటుంబ సంబంధాల్లో భాగం చేసుకోవాలి. ఏవైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు స్నేహితుడికి ఆ విషయాన్ని చెప్పి అభిప్రాయాన్ని తీసుకోవాలి.
పైన చెప్పిన అలవాట్లు మీరు పాటిస్తే మీ స్నేహం సాగే నదిలా అందంగా ఉంటుంది. లేకపోతే అడ్డంకులు వచ్చి ఏరులుగా, పాయలు పాయలుగా విడిపోతుంది.
స్నేహానికి స్త్రీ పురుష అనే తేడా లేదు. మీ స్నేహితురాలు అయినా స్నేహితుడైన అతనితో కనెక్ట్ కావాలంటే మీరు కూడా ఎంతో నిజాయితీగా ఉండాలి. పురుషులతో పోలిస్తే స్త్రీలు పైన చెప్పిన అంశాలను తమ స్నేహబంధంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అదే మగవారి విషయానికి వస్తే వారి స్నేహంలో విశ్వాసం నిజాయితీ అధికంగా ఉంటుంది.
ఒక సర్వే ప్రకారం మిలీనియల్స్ లో పావు వంతు మందికి మంచి స్నేహితులే లేరని తేలింది. ఇలా స్నేహితులకు లేకపోవడానికిన కారణం వారిలో పైన చెప్పిన లక్షణాలు లేకపోవడమే. స్నేహంలో నిజాయితీ చాలా ముఖ్యం. మంచి స్నేహితులు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటాడు. నిజాయితీ స్నేహితులు తన స్నేహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు.
స్నేహితుడిని ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉండాలి. ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. చిన్న చిన్న విషయాలకే స్నేహితులు తరచూ గొడవ పడడం కూడా వంటివి చేయకూడదు.