Road Accident : సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి
Road Accident in Sri Sathya Sai district: శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడకశిర మండలంలో తెల్లవారుజామున ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడకశిర మండలంలో బుళ్లసముద్రం దగ్గర్లో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని… మినీ వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్ లో ఉన్న నలుగురు మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. పది మందికిపైగా గాయపడ్డారు.
మృతులను గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా గుర్తించారు. వీరు తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. చికిత్స కోసం హిందూపురం, బెంగళూరు ఆసుపత్రులకు తరలించారు.
ఈ రోడ్డు ప్రమాదంలో అత్వార్, ప్రేమ్ కుమార్, రత్నమ్మతో పాటు డ్రైవర్ ప్రాణులు కోల్పోయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం - బీటెక్ విద్యార్థి మృతి
హైదరాబాద్ - పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీ పై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అతివేగంతో వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. అంతే కాదు ఆ బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది.
లోకేష్ అనే 20 సంవత్సరాల బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోసం గాలిస్తున్నారు.
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం - ముగ్గురు మృతి
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండలో ఓ బైక్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దేవరకొండ మండలం తాటికొల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.