‍NCBN Propaganda: చంద్రబాబుకు రాజకీయంగా నష్టం చేస్తున్న అతి ప్రచారం-excessive propaganda which is damaging chandrababu politically ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ‍Ncbn Propaganda: చంద్రబాబుకు రాజకీయంగా నష్టం చేస్తున్న అతి ప్రచారం

‍NCBN Propaganda: చంద్రబాబుకు రాజకీయంగా నష్టం చేస్తున్న అతి ప్రచారం

Sarath chandra.B HT Telugu
Oct 14, 2023 07:24 PM IST

‍NCBN Propaganda: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్ విషయంలో మీడియాలో మితిమీరిన ప్రచారం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. చంద్రబాబుకు అనుకూలంగా జరుగుతున్న మీడియా ప్రచారాలతోఆయనకు చేటు చేస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

మోదీతో చంద్రబాబు (ఫైల్ ఫోటో)
మోదీతో చంద్రబాబు (ఫైల్ ఫోటో)

‍NCBN Propaganda: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తరపున మీడియాలో జరుగుతున్న ప్రచారం కొత్త చర్చలకు దారి తీస్తోంది. బీజేపీ మైత్రిని కోరుకుంటోన్న టీడీపీ అదే సమయంలో కాషాయ పార్టీ తమ వెంట పడుతోందన్నట్టు కలర్ ఇవ్వడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

yearly horoscope entry point

రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాతావరణ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోత,చర్య సంబంధిత సమస్యలపై ఆయన కుటుంబ సభ్యులు రెండ్రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటూ ఆ పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. బాబు సతీమణి,కొడుకు, కోడలు ట్విట్టర్లో తమ ఆందోలన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని ఆరా తీశారంటూ మీడియాలో హడావుడి జరిగింది. టీడీపీ ఎంపీ కనకమేడలను ప్రధాని మోదీ ఆరా తీసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. చంద్రబాబు అరెస్ట్‌, రిమాండ్‌, కోర్టుల్లో జరుగుతున్న పరిణామాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరిగింది. ప్రధాని సైతం చంద్రబాబు ఎలా ఉన్నారని ఆరా తీసినట్లు అవి పేర్కొన్నాయి.

జి20 సభ్యదేశాల పార్లమెంటు స్పీకర్లతో జరుగుతున్న పి20 సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధానిని టీడీపీ ఎంపీ కనకమేడల కలిశారు. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంలో గతంలో తాను రాసిన లేఖను గురించి ప్రధానితో ప్రస్తావించినట్లు ఎంపీ మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్న అది కాస్త చంద్రబాబు అరెస్ట్ విషయంలో మోదీని అవసరానికి మించి లాగేందుకు విపరీతంగా ప్రయత్నాలు జరిగాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ప్రధాని నుంచి వచ్చే తక్షణ ప్రతిస్పందనను కూడా టీడీపీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తోందని ఏపీలో టీడీపీ వ్యతిరేక బీజేపీ వర్గం చెబుతోంది. చంద్రబాబుకు రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ స్పందన ఉండి ఉంటుందని చెబుతున్నారు.

ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌‌షాతో లోకేష్ భేటీ వ్యవహారంలో కూడా ఇలాగే జరిగింది.దాదాపు నెల రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న తర్వాత రెండు రోజుల క్రితం లోకేష్‌కు అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ లభించింది. అమిత్‌షాతో భేటీ పూర్తైన తర్వాత తాము అడగకపోయినా బీజేపీ పెద్దలు తమను పిలిపించి మాట్లాడారన్నట్టు బయటకు ప్రచారం చేయడం బీజేపీని అసహనానికి గురి చేస్తోంది. అమిత్‌ షాతో లోకేష్ భేటీ తర్వాత జరిగిన ప్రచారం, తాజాగా మోదీ వ్యవహారంలో జరిగిన ప్రచారాలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఎప్పటికప్పుడు నివేదించాయి.

అతి ప్రచారంతోనే అధిక నష్టం....

గత వారం రోజుల్లో లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత బీజేపీ పెద్దలే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అరా తీసేందుకు ఢిల్లీ పిలిపించినట్లు టీడీపీ శిబిరం విపరీతంగా ప్రచారం చేసింది. ఆ తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీ సుజనా చౌదరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి చర్చించారు. మోదీ, అమిత్‌షా, నడ్డాలతో జరిగిన సమావేశాలను తమకు అనుకూలంగా మలచుకునేందుక విశ్వ ప్రయత్నాలు చేశారు. సుజనా చౌదరి టీడీపీని వీడి చాలా కాలం క్రితమే బీజేపీలో చేరిపోయారనే సంగతి మరిచిపోయి బీజేపీ నాయకుల భేటీ కూడా తమ గురించేనని చెప్పుకోవడంపై బీజేపీ గుర్రుగా ఉంది.

ఈ ప్రచారాలు వరమా, శాపాలా?

అతి ప్రచారాలతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు బీజేపీ అధిష్టానానికి ఓ వర్గం చేరవేస్తోంది. మరోవైపు ఈ తరహా ప్రచారాలతో చంద్రబాబుకు మైలేజ్ పెంచుతున్నామనే భ్రమలో చేటు చేస్తున్నారనే సంగతి గుర్తించడం లేదని చెబుతున్నారు.

ఓ వైపు బీజేపీని సాయం కోరుతూ, జోక్యం కోసం రాయబారాలు నడుపుతూ మరోవైపు బీజేపీ.. టీడీపీ వెంట పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా ప్రచారాలు చంద్రబాబుకు శాపంలా మారాయని ఓ రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుడు వ్యాఖ్యనించాడు. గతంలో పార్లమెంటులో అఖిల పక్ష సమావేశంలో మోదీ మమతాబెనర్జీ, సీతారాం ఏచూరిలతో మాట్లాడినట్టే చంద్రబాబుతో కూడా భుజంపై చేయివేసి మాట్లాడితే ఇక పొత్తు కుదిరినట్టేనని టీడీపీ ప్రచారం చేసిందని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడున్న బీజేపీ మునుపటి బీజేపీ కాదని ఎప్పుడు ఏమి చేయాలనేది ఆ పార్టీ పెద్దలకు స్పష్టమైన ఆలోచన ఉంటుందని గతంలో పని చేసిన ట్రిక్కులు ఇప్పుడు చెల్లవని చెబుతున్నారు.

Whats_app_banner