AP BJP Struggle: పొత్తు కుదిరినా.. తేలని సీట్ల పంచాయితీ, బీజేపీకి టిక్కెట్ల కేటాయింపుపై నేతల గరంగరం…-even nda alliance is finalized seat sharing with bjp not finalsed in andhra padesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bjp Struggle: పొత్తు కుదిరినా.. తేలని సీట్ల పంచాయితీ, బీజేపీకి టిక్కెట్ల కేటాయింపుపై నేతల గరంగరం…

AP BJP Struggle: పొత్తు కుదిరినా.. తేలని సీట్ల పంచాయితీ, బీజేపీకి టిక్కెట్ల కేటాయింపుపై నేతల గరంగరం…

Sarath chandra.B HT Telugu
Mar 20, 2024 06:17 AM IST

AP BJP Struggle: ఏపీలో బీజేపీకి టీడీపీ-జనసేనలతో ఎన్నికల పొత్తు కుదిరినా కోరుకున్న స్థానాలను మాత్రం దక్కించుకోలేక పోయింది. టీడీపీ ఇచ్చిన సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి రావడంపై ఆ పార్టీ నేతలు రగిలిపోతున్నారు.

బీజేపీకి సీట్ల కేటాయించిన స్థానాలపై ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
బీజేపీకి సీట్ల కేటాయించిన స్థానాలపై ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

AP BJP Struggle: ఏపీలో వైసీపీ YCPని గద్దె దించే లక్ష్యంతో టీడీపీ TDP-బీజేపీ BJP-జనసేన Janasena మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. మూడు పార్టీలు పదేళ్ల తర్వాత కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. పొత్తు Alliance కుదిరినా కోరుకున్న స్థానాలు దక్కలేదనే అక్రోశం ఏపీ బీజేపీ AP BJP నేతల్లో పెరిగిపోతోంది.

ఎన్నికల్లో పోటీపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్లకు నిరాశ తప్పేట్టు లేదు. పొత్తులో భాగంగా బీజేపీ ఆశించిన స్థానాలకు కూడా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు.

బీజేపీకి కాస్తో కూస్తో బలం ఉన్న స్థానాల్లో కూడా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం చిచ్చుకు కారణమైంది. దీంతో టిక్కెట్ల కేటాయింపు, అభ్యర్ధులను ఖరారు చేయడంలో ప్రతిష్టంబన కొనసాగుతోంది. బీజేపీకి ఓడిపోయే సీట్లని కేటాయించడంలో చంద్రబాబు వ్యూహాత్మంగా వ్యవహరించారని బీజేపీలో టీడీపీ వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది.

బీజేపీకి టీడీపీ కేటాయిస్తున్న సీట్లలో- శ్రీకాకుళం, విశాఖ నార్త్ , కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

అయితే బీజేపీ అడుగుతున్న సీట్లలో విశాఖ జిల్లాలో రెండు స్ధానాలు ఉన్నాయి. వాటిలో విశాఖ నార్త్/ పాడేరు/ చోడవరం లేదా మాడుగుల కావాలని కోరుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో రెండు స్ధానాలలో పి.గన్నవరం, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్ధానాలు కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరులో ఒక స్ధానం గుంటూరు వెస్ట్‌, రాయలసీమ నుంచి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి స్థానాలను తమకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు అడుగుతున్నారు.

ఇప్పటికే టీడీపీ అభ్యర్థుల ఖరారు…

బీజేపీ కోరుతున్న స్ధానాలలో చోడవరం, మాడుగుల, రాజమండ్రి సిటీ, పి.గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి ఇలా మొత్తం ఎనిమిది స్ధానాలలో ఇప్పటికే బీజేపీ అభ్యర్ధులని ప్రకటించారు.

చోడవరం లేదా మాడుగుల స్ధానాలను తమకు ఇవ్వాలని బీజేపీ కోరినా ఆ స్ధానాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. రాజమండ్రి స్ధానాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసుకి కేటాయించడంతో అనపర్తిని బీజేపీకి ఆఫర్ చేశారు. అనపర్తిలో కనీసం బీజేపీకి అర్బన్ అధ్యక్షుడు కూడా లేడని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

విజయవాడలో సెంట్రల్ నియోజక వర్గం కావాలని అడిగితే విజయవాడ పశ్చిమ నియోజక వర్గం బీజేపీకి కేటాయించారు. అక్కడ కొన్నేళ్లుగా జనసేన అభ్యర్ధి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు బీజేపీ-జనసేన మధ్య చిచ్చు పెట్టేలా బీజేపీకి ఆ స్థానం కేటాయించారు.

రాయలసీమలో కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి స్ధానాలు ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టినా కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించారు. హిందూపూర్ లోక్ సభ స్ధానం కోసం విష్ణువర్దన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. హిందూపురం లేకపోతే కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని భావింవిన విష్ణువర్దన్ రెడ్డి చివరకు భంగపడ్డారు.

కదిరిలో పోటీ చేయాలని భావించిన మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్ధసారధి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీలకి కూడా నిరాశ తప్పలేదు.

కడప పార్లమెంట్ పరిధిలో బద్వేలు, జమ్మలమడుగు రెండు అసెంబ్లీ స్ధానాలు బీజేపీకి కేటాయించారు. బద్వేలు ఉప ఎన్నికలలో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. బద్వేలులో టిడిపికి అభ్యర్ధి లేకపోవడంతోనే బీజేపీకి కేటాయించారని ఆరోపిస్తున్నారు.

టీడీపీనుంచి బీజేపీలో చేరిన వరదాపురం సూరి కోసం ధర్మవరం, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కోసం జమ్మలమడుగు సీట్లను బీజేపీకి వదిలినట్టు చెబుతున్నారు. రెండున్నర దశాబ్దాలగా టీడీపీ ఒక్కసారి కూడా గెలవని స్థానాలను బీజేపీకి కేటాయించిందని, పొత్తు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకకు ఢిల్లీలో శివప్రకాష్ జీ కి బీజేపీ సీనియర్లు ఫిర్యాదు చేశారు. సీట్లు కేటాయింపుపై పునరాలోచన చేయాలని ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం