Chandrababu Strategy: మోదీపై పొగడ్తలు… బీజేపీకి సీట్ల కేటాయింపు వెనుక చంద్రబాబు బాబు వ్యూహం అదే..
Chandrababu Strategy: సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో పొత్తుల రాజకీయం మొదలైంది. పదేళ్ల తర్వాత మోదీ, పవన్ చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చారు. మోదీని బాబు పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది.
Chandrababu Strategy: చిలకలూరిపేట ఎన్డీఏ ర్యాలీలో ప్రధాని మోదీని Narendra modi టీడీపీ TDP అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు Chandrababu పొగడ్తలతో ముంచెత్తారు. కొన్నేళ్ల క్రితం ఎన్డీఏ కూటమి నుంచి మోదీని తీవ్ర స్థాయిలో విమర్శించి బయటకు వచ్చిన చంద్రబాబు అనూహ్యంగా ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ఎన్నికల వేళ ఇలాంటివి సహజమే అయినా చంద్రబాబులో ఆకస్మిక మార్పు వెనుక లక్ష్యం ఎన్నికల్లో గెలుపేనని స్పష్టమవుతోంది.
బొప్పూడిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడిన పదినిమిషాల్లో ఆరేడు నిమిషాలు పూర్తిగా ప్రధాని మోదీని PM Modi అభినందించడానికి ప్రాధాన్యమిచ్చారు.
“మోదీ ఒక వ్యక్తి కాదు..భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. మోడీ అంటే సంక్షేమం...మోడీ అంటే అభివృద్ధి… మోడీ అంటే సంస్కరణలు, భవిష్యత్తు. మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం” అన్నారు.
ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్రమోడీ అని ప్రధాన మంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ లాంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారని కీర్తించారు.
సంక్షేమ పథకాలతో పాటు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారత్ మాల కార్యక్రమాలతో నరేంద్ర మోడీ అభివృద్ధి చేశారుని, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంక్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోడీ అని చంద్రబాబు పొగిడారు. .
మోడీ నినాదం సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో దేశానికి నమ్మకాన్ని కలిగించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్రమోడీ. కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా నాడు వ్యవహరించి మన ప్రాణాలు రక్షించారని, వంద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను చాటిచెప్పారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తెచ్చారు. 5వ స్థానం నుండి రాబోయే రోజుల్లో 3వ స్థానంలోకి వస్తాం. అమెరికా, చైనా కంటే ధీటైన ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చే శక్తి, సామర్థ్యం మోడీకి ఉన్నాయని అభినందించారు.
వికసిత్ భారత్ నరేంద్ర మోదీ కల...వికసిత్ ఏపీ మన అందరి కల కావాలని, వికసిత భారత్ దిశగా దేశం దూసుకు పోతోందని ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఏపీ కూడా అభివృద్ధి చెందాలన్నారు. పేదరికం లేని దేశం మోదీ సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం. మనమంతా ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలన్నారు.
మోదీ జీ కా సందేష్ హై కి ”వికసిత్ భారత్ కేలియే...యహీ సమయ్ హై..సహీ సమయ్ హై”. మై కెహనా చాహ్ తా హూం కి “దేశ్ కో సహీ సమయ్ మే మోదీజీ జైసా సహీ నేతా మిలాహై...ఆప్ కి పూరీ కోషిషోం మే.. హమ్ ఆప్ కే సాత్ రహేంగే. ఏ హమారా వాదా హై.” అంటూ హిందీలో కూడా మోదీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. భారత దేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్రమోదీ. వికసిత భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ దేశంగా చేసే శక్తి, సామర్థ్యం ఒక్క మోడీకే ఉందన్నారు.
బాబు మనసులో ఏముంది….
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి Ys Jagan సారథ్యంలోని వైసీపీని ఎదుర్కోవడం కష్టమనే విషయం టీడీపీకి అవగతమైంది. చివరి నిమిషం వరకు ఎన్నికల పొత్తు కోసం ప్రయత్నాలు కొనసాగించారు. గతంలో జరిగిన పరిణామాలు పొత్తు బంధానికి ఎక్కడ ప్రతిబంధకాలు అవుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు చిలకలూరిపేట సభలో మోదీని పొగడ్తలతో ముంచెత్తినట్టు తెలుస్తోంది.
2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన కూడా కూటమిలో ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయలేదు. నాటి ఎన్నికల్లో టీడీపీ 102 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థులు 4 స్థానాల్లో గెలిచారు. వైసీపీ నుంచి గెలిచిన 67మందిలో ఆ తర్వాత 23మంది టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో పరిస్థితులకు 2024 పరిస్థితులకు పెద్దగా మార్పు లేకున్నా బీజేపీ పోటీ చేసే స్థానాల సంఖ్య మాత్రం నాలుగు నుంచి ఆరుకు పెరిగింది. మరో రెండు స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది.
2019 ఎన్నికల్లో 117 స్థానాల్లో ఒంటరిగా పోటీచేసిన బీజేపీ కేవలం 0.85శాతం ఓట్లకు పరిమితం అయ్యింది. సంస్థాగతంగా ఆ పార్టీ పెద్దగా బలపడకపోయినా బీజేపీతో స్నేహానికి టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది. మోదీ అండదండలు లేకపోతే ఎన్నికల్లో ముందుకు వెళ్లడం అంత సులువు కాదనే విషయం చంద్రబాబుకు 2019 ఎన్నికల్లోనే తెలిసొచ్చింది. కార్యనిర్వాహక వ్యవస్థల్ని కట్టడి చేస్తే ఎలా ముప్పతిప్పలు పెడతారనే సంగతి అనుభవంతో చంద్రబాబుకు అర్థమైంది. అందుకే మోదీని ప్రసన్నం చేసుకునేందుకు చిలకలూరిపేటలో మోదీని కీర్తించినట్టు స్ఫష్టమవుతోంది.